Friday, April 26, 2024
Friday, April 26, 2024

నివాళి చెప్పడానికి అనుమతించరా?

మోదీ సర్కారుపై ఎంపీల ఆగ్రహం
న్యూదిల్లీ : రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ధర్నాను ప్రతిపక్షాలు గురువారం విరమించుకున్నాయి. హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, మరో 12 మందికి పార్లమెంటులో శ్రద్ధాంజలి ఘటించే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమాన్ని నిలిపివేశారు. రాజ్యసభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముందుగా మృతులకు సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి సంబంధించి ప్రకటన చేశారు. ఆ తర్వాత బిపిన్‌రావత్‌, ఇతరులకు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం ఆ ఎంపీలకు ప్రభుత్వం ఇవ్వలేదు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దేశ అత్యున్నత రక్షణాధికారికి నివాళి అర్పించడానికి ప్రభుత్వం నిరాకరించడాన్ని తప్పుబట్టారు. జనరల్‌ రావత్‌కు నివాళి అర్పించి మాట్లాడేందుకు ఎంపీలకు అనుమతివ్వకపోవడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసింది. ప్రతిపక్ష ఎంపీలంతా సభా కార్యకలాపాలను బహిష్కరించారు. చివరికి చేసేది లేక మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మళ్లీ ధర్నాకు దిగారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ విషాదకర ఘటనపై తమ నివాళి తెలపాలని ఎంపీలు కోరుకున్నారని, అందుకు అనుమతించలేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిరచారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13మంది మరణించడంతో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాను నిలిపివేయాలని భావించామని, మృతులకు సంతాపం తెలపడం కోసం ప్రయత్నించామని చెప్పారు. ‘ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి సరైన బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాం. బిపిన్‌ రావత్‌కు నివాళి అర్పించే అవకాశం నాయకులకు లేనప్పుడు ఇక్కడ ఏ తరహా ప్రజాస్వామ్యం రాజ్యమేలుతుంది? సభ ఎలా నడుస్తుందో అర్థమవుతుంది’ అని ఖర్గె వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img