Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రికాషన్‌ డోసుకు రూ.150 సర్వీస్‌ చార్జీ

న్యూదిల్లీ : కోవిడ్‌ నివారణకు తొలుత ఏ వాక్సిన్‌ తీసుకుంటే ప్రికాషన్‌ డోసుగా అదే వాక్సిన్‌ మోతాదును తీసుకోవాల్సి ఉంటుందని దేశ ప్రజలకు కేంద్రం సూచించింది. ఆదివారం నుంచి ప్రైవేటు వాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రికాషన్‌ డోసులు అందుబాటులో ఉంటాయని, 18ఏళ్లుపైబడి, రెండు టీకాలు పొందిన వారు దీనిని తీసుకోవచ్చు అని తెలిపింది. వాక్సిన్‌ ధరపై అదనంగా రూ.150 వరకు సర్వీసు చార్జీ రూపేణ ఆయా కేంద్రాలు వసూలు చేయొచ్చునని పేర్కొంది. రెండవ టీకా తీసుకొని 90 రోజులు పూర్తి అయిన వారు ప్రికాషన్‌ డోసుకు అర్హులు అవుతారని వెల్లడిరచింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌ శనివారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితులను సమీక్షించారు. కొత్త కేసులు, మరణాలు, టీకాల పంపిణీపై ఆరా తీశారు. ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ లేదా వాకిన్‌ అయినాగానీ ప్రతి టీకా వివరాలు కోవిన్‌లో పొందుపర్చాలన్నారు. కోవిడ్‌ వాక్సినేషన్‌ కేంద్రాలు (సీవీసీ)లు వాక్సినేషన్‌ సైట్లను కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తాయని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60ఏళ్లుపైబడిన వారికి వాక్సినేషన్‌ కేంద్రాల్లో టీకాల పంపిణీ కొనసాగుతోందని, ప్రభుత్వ కేంద్రాల్లో ఉచిత పంపిణీ జరుగుతోందని భూషణ్‌ నొక్కిచెప్పారు. ప్రికాషన్‌ డోసుతో పాటు 12 ఏళ్ల వయస్కుల్లో మొదటి టీకా పొందినది ఎంత మంది అన్న డేటాను సేకరించాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. వర్చువల్‌ సమావేశంలో అదనపు కార్యదర్శి (ఆరోగ్యం) డాక్టర్‌ మనోహర్‌ అగ్నామీ, శాఖ సీనియర్లు, ఆరోగ్య కార్యదర్శులు, ఎన్‌హెచ్‌ఎం మిషన్‌ డైరెక్టర్లు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img