Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రియాంక ఓ సునామీ

యూపీలో అధికారం మాదే : లల్లూ
లక్నో : ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించకుండానే కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటుందని ఆ పార్టీ యూపీ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూ స్పష్టంచేశారు. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా నాయకత్వంలో ఎన్నికల్లో సమర్ధవంతంగా పోరాడతామని చెప్పారు. ప్రియాంకగాంధీ ఓ సునామీ అని, ఆమె నాయకత్వంలో యూపీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక సమస్యలను ప్రియాంక ప్రస్తావిస్తున్నారని, ప్రియాంక అంటే యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం భయపడుతోందని లల్లూ చెప్పారు. అయితే, యూపీలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే సీట్ల సంఖ్య చెప్పడానికి మాత్రం లల్లూ నిరాకరిస్తూ పూర్తి మెజారిటీతో అధికారం చేపడతామని చెప్పుకొచ్చారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లకుగాను కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఏడు సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం విదితమే. ‘క్షేత్రస్థాయిలో పార్టీ ఉత్సాహంగా ఉంది. పార్టీలో సంస్థాగత మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మంచి బృందం తయారైంది. ఏమైనా చేయగలమనే ధీమా వచ్చింది’ అని లల్లూ చెప్పారు. అజయ్‌కుమార్‌ లల్లూ సోమవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు. ‘మా సంస్థాగత బలాన్ని మళ్లీమళ్లీ రుజువు చేశాం. యూపీలో ప్రియాంక సునామీ సృష్టించడం ఖాయం’ అని చెప్పారు. ఇదే కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేయడానికి దోహదపడుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించగా సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని, కానీ యూపీ ఇన్‌చార్జి ప్రియాంకగాంధీ ఉన్నారని, ఆమె నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తామని లల్లూ వివరించారు. పూర్తి మెజారిటీతో యూపీలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమాగా చెప్పారు. ప్రియాంకగాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడుగగా ఆయన సమాధానం దాటవేశారు. తన పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రియాంక ఇటీవలే చెప్పారు. ప్రియాంకను రాజకీయ టూరిస్టుగా బీజేపీ పేర్కొనడంపై లల్లూ స్పందిస్తూ ప్రియాంక లేదా తమపార్టీ కార్యకర్తలు, ప్రతి ఒక్కరినీ కాషాయపార్టీ లక్ష్యంగా చేసుకుందని, గడచిన మూడు మాసాలుగా గమనిస్తే..కాంగ్రెస్‌ పార్టీకార్యకర్తలపై లాఠీలు విరుగుతున్నాయని, అక్రమకేసులతో అరెస్టు చేస్తున్నట్లు లల్లూ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img