Friday, April 26, 2024
Friday, April 26, 2024

మహిళలకు నెలకు రూ.2 వేలు

ఏడాదికి 8 వంటగ్యాస్‌ సిలిండర్లు
విద్యార్థినులకు ద్విచక్రవాహనాలు
పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ వరాలు

చండీగఢ్‌ : ఓటర్లను ఆకర్షించడానికి పంజాబ్‌లోని రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి నానాతంటాలు పడుతున్నాయి. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ తాజాగా మహిళలపై వరాలు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు రూ.2 వేలు, ఏడాదికి 8 వంట గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని సిద్ధూ సోమవారం హామీ ఇచ్చారు. కాలేజీలకు వెళ్లే బాలికలకు ద్విచక్ర వాహనాలు, ఇంటర్‌ పూర్తయిన అమ్మాయిలకు రూ.20 వేలు, పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులకు రూ.10 వేలు, ఐదో తరగతి నుంచి రూ.5వేలు ఇస్తామని ప్రకటించారు. పంజాబ్‌లో మహిళలందరికీ రూ.1000, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ ఇవ్వడంతో సిద్ధూ కూడా ఆయన బాట పట్టారు. తాము అధికారంలోకి వస్తే పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవాలకు ఈ హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్‌ ఇటీవల ప్రకటించారు. పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలు మాట్లాడుతూ సిద్ధూ ఈ హామీలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు సాధికారత కల్పిస్తామని చెప్పారు. గృహిణులకు నెలకు రెండు వేల రూపాయలు, ఏడాదికి 8 వంటగ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని సిద్ధూ చెప్పారు. కాలేజీ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని వరాలు కురిపించారు. ఐదో తరగతి దాటిన పిల్లలందరికీ రూ.5 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థునులకు కంప్యూటర్లు ఇస్తామని తెలిపారు. కాలేజీలకు వెళ్లడానికి రెండు చక్రాల వాహనాలు పంపిణీ చేస్తామన్నారు. ఉచితంగా మహిళల పేరిట ఆస్తుల బదిలీ చేస్తామని సిద్ధూ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం 28 నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img