Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మాంద్యం భయం లేదు

దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయ్‌
ధరల పెరుగుదల చర్చలో ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూదిల్లీ : ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక మూలాధారాలు బలంగా ఉన్నందున భారతదేశం మాంద్యం లేదా ప్రతిష్టంభనకు గురయ్యే ప్రమాదం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం అన్నారు. అయితే ధరల పెరుగుదలపై ఆర్థిక మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్‌, డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. లోక్‌సభలో ధరల పెరుగుదలపై జరిగిన చర్చకు సీతారామన్‌ సమాధానమిస్తూ, జీఎస్‌టీ వసూళ్లు, కొనుగోలు నిర్వాహకుల సూచి (పీఎంఐ) భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా ఉందని సూచిస్తున్నాయని అన్నారు. జీఎస్‌టీ వసూళ్లు 28 శాతం పెరిగి జులైలో రెండో అత్యధిక స్థాయి రూ.1.49 లక్షల కోట్లను తాకాయి. జులై 2017లో ప్రవేశపెట్టిన జీఎస్‌టీ ఏప్రిల్‌ 2022లో రికార్డు స్థాయిలో రూ.1.68 లక్షల కోట్లకు చేరుకుంది. వస్తు సేవల పన్ను ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి కాగా, మార్చి 2022 నుంచి వరుసగా ఐదో నెల అని ఆమె చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో బ్యాంకింగ్‌ రంగం కూడా ఆరోగ్యంగా ఉందని అన్నారు. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 5.9 శాతానికి చేరుకున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణం జీడీపీ నిష్పత్తి 56.29 శాతానికి తగ్గిందని ఆమె అన్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 7 శాతం దిగువకు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వంట నూనెల ధరలు ఒక్కసారిగా సరి అయ్యాయని అన్నారు. కాగా సీతారామన్‌ సమాధానం మధ్యలో కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. కొద్ది నిమిషాల తర్వాత డీఎంకే సభ్యులు కూడా నిరసనగా వాకౌట్‌ చేశారు. చర్చను ప్రారంభించిన కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ తరువాత పార్లమెంటు హౌస్‌ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం… ‘జెస్సికాను ఎవరూ చంపనంతగా ద్రవ్యోల్బణం లేదు. అంతా హంకీ-డోరీ (చాలా సంతృప్తికరంగా). ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల పై మీ (ప్రభుత్వం) ప్రతిస్పందన అది’ అని ఎద్దేవా చేశారు. మంత్రి ప్రతిస్పందన అహంకారపూరితంగాఉందని తివారీ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img