Friday, April 26, 2024
Friday, April 26, 2024

యూపీలో ఆగని డెంగీ మరణాలు

బెడ్ల కొరతతో ఐదేళ్ల చిన్నారి మృతి
ఫిరోజాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజ్‌బాద్‌ను కొన్ని రోజులుగా డెంగీ వణికిస్తోంది. ఇప్పటికే అక్కడ 80 మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 14 మంది చనిపోగా.. అందులో 8 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో సోమవారం ఉదయం మృతి చెందిన ఐదేళ్ల చిన్నారి ఉన్నారు. బాలికను ఆసుపత్రిలో సరైన సమయంలో చేర్చుకోకపోవడంతో తల్లిదండ్రులు ఎదుట ప్రాణాలు విడిచింది. బాలిక మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రి ప్రాంగణంలో మిన్నంటాయి. మీడియా కథనం ప్రకారం జ్వరంతో వణికిపోతున్న ఐదేళ్ల చిన్నారి శవణ్య గుప్తాను ఫిరోజాబాద్‌ జిల్లా ఆసుపత్రికి సోమవారం ఉదయం 8 గంటలకు కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. పడకలు ఖాళీ లేవని వైద్యులు చెప్పడంతో అక్కడే పడిగాపులు కాశారు. మధ్యాహ్నం ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే బాలిక మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తన సోదరికి సరైన సమయంలో చికిత్స అందించి ఉంటే బ్రతికేదని బాధితురాలి సోదరుడు అన్నారు. తన పరిస్థితి చెప్పినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది తమ అభ్యర్థనను వినిపించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. జ్వరం అధికంగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారని కుటుంబ సభ్యులు విమర్శించారు. డాక్టర్లు ఏమీ చేయలేదని, వారికి కావాల్సిందీ డబ్బులేనని ఆగ్రహించారు. యూపీలో విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్‌, డెంగీ జ్వరాల కట్టడిలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ విఫలమైంది. ఫిరోజ్‌బాద్‌తో పాటు మథుర, ఆగ్రా, మెయిన్‌పురిలోనూ డెంగీ కేసులు వెలుగుచూశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img