Friday, April 26, 2024
Friday, April 26, 2024

యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు

మోదీ ఇలాకాలో ఘోర పరాజయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో మాత్రం అవమానకర ఓటమిని చవిచూసింది. 27 స్థానాలకు ఎన్నికలు జరగగా 22 సీట్లలో బీజేపీ గెలుపొందింది. రాష్ట్రంలో మొత్తం 36 స్థానాలు ఖాళీ కాగా అందులో 9 సీట్లు అధికార పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. వారణాసిలో మాత్రం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ బీజేపీ మూడోస్థానానికి పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇద్దరు ఇండిపెండెంట్లు, జనసత్తా దళ్‌(లోక్‌తాంత్రిక్‌) అభ్యర్థులు విజయం సాధించారు. వారణాసిలో బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్‌ కేవలం 170 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థి అన్నపూర్ణ సింగ్‌ 4,234 భారీ మెజారిటీతో గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ఉమేశ్‌ యాదవ్‌ 345 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. ఎన్నికలకు ముందు శాసనమండలిలో బీజేపీ సభ్యుల బలం 34 మాత్రమే. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. విజేతలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీపై ప్రజలు మరింత విశ్వాసం ప్రదర్శించినట్లు ఫలితాలు రుజువు చేశాయని సీఎం అన్నారు. ప్రతాప్‌గఢ్‌లో బీజేపీ అభ్యర్థి హరిప్రతాప్‌సింగ్‌పై జనసత్తా దళ్‌(లోక్‌తాంత్రిక్‌) అభ్యర్థి అక్షయ్‌ ప్రతాప్‌ సింగ్‌ 1107 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆజంగఢ్‌`మావు స్థానం నుంచి బీజేపీపై ఇండిపెండెంట్‌ అభ్యర్థి విక్రాంత్‌సింగ్‌ రిషు 2,813 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఎస్‌పీ పోటీ చేయలేదు. బీజేపీ, ఎస్‌పీ ముఖాముఖి తలపడ్డాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img