Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

షెడ్యూల్‌ ప్రకారమే యూపీ ఎన్నికలు

అన్ని పార్టీలు కోరాయి
కరోనా మార్గదర్శకాలు పాటిస్తాం
పోలింగ్‌ కేంద్రాలు పెంచుతాం
సీఈసీ సుశీల్‌ చంద్ర వెల్లడి

న్యూదిల్లీ : కోవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరపాలని ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలన్నీ కోరినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సుశీల్‌ చంద్ర గురువారం చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా పోలింగ్‌ కేంద్రాల సంఖ్య, ఓటింగ్‌ సమయం పెంచుతామని ఆయన తెలిపారు. పోలింగ్‌ అధికారులంతా టీకాలు వేసుకోవాల్సిందేనని, అర్హులైన వారికి బూస్టర్‌ డోసు కూడా వేయిస్తామని సీఈసీ చంద్ర పేర్కొన్నారు. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఈసీ ఆదేశించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడురోజులు లక్నోలో మకాం వేసింది. ఆయా రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. ముఖ్యమైన పార్టీల అభిప్రాయాలు తీసుకుంది. రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతోనూ మంతనాలు సాగించింది. అదేసమయంలో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులతోనూ చర్చించింది. మార్చిలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ పదవీకాలం పూర్తి కానున్నది. ఈలోపుగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. దేశంలో ఒమిక్రాన్‌ విజృంభణతో మూడోవేవ్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా అంశాన్ని పరిశీలించాల్సిందిగా అలహాబాద్‌ హైకోర్టు డిసెంబరు 23న కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఉత్తరప్రదేశ్‌ పర్యటన తర్వాత ఎన్నికల నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకుంటామని సీఈసీ చంద్ర వెల్లడిరచారు. ‘రాష్ట్రంలో 86శాతం మంది ప్రజలు మొదటి డోసు, 49 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. రానున్న 15, 20 రోజుల్లో అర్హులందరికీ మొదటి డోసు పూర్తిచేస్తాం’ అని చంద్ర హామీ ఇచ్చారు. టీకా ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి చెప్పామన్నారు. ఒమిక్రాన్‌ విస్తరణపైనా కూలంకషంగా చర్చించామని తెలిపారు. యూపీలో ఒమిక్రాన్‌ ప్రభావం అంతగా లేదని, కేవలం నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయని వివరించారు. అందులో ముగ్గురు కోలుకున్నట్లు చెప్పారు. ఓటర్లు భౌతికదూరం పాటించేలా రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను 11 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ గురువారం ఇక్కడ మీడియాకు చెప్పారు. పోలింగ్‌ సమయాన్ని కూడా మరో గంట పెంచుతామన్నారు. గతంలో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 1500 మంది ఓటర్లు ఉండేవారు. ఇప్పుడు కోవిడ్‌ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి బూత్‌కు ఓటర్లను 1250కి తగ్గించామన్నారు. దీనికారణంగా పోలింగ్‌ బూత్‌ల సంఖ్య 11వేలకు పెరిగాయని, దీంతో రాష్ట్రంలో మొత్తం 1,74,351కి పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరిగినట్లు వివరించారు. అన్ని పోలింగ్‌ బూత్‌లకు థర్మల్‌ స్కానర్లు, మాస్క్‌లు సరఫరా చేస్తామన్నారు. ప్రతి బూత్‌లో శానిటైజేషన్‌ సహా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించడానికిగాను ఏడాదికి పైగా ఒకేచోట పనిచేసిన అధికారులను బదిలీ చేయాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే 5వేల మంది పోలీసులను బదిలీ చేశామని, మిగిలిన వారిని త్వరలో బదిలీ చేస్తామని తెలిపారు. 4,030 ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయని, అందులో 10 బూత్‌లు ప్రతి నియోజకవర్గంలో ఉండేలా చూస్తామని సీఈసీ వివరించారు. 800 మహిళా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులు, వికలాంగులకు మొదటిసారి ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img