Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అన్నాడీఎంకే నుంచి పన్నీర్‌ సెల్వం బహిష్కరణ

తమిళనాట ప్రధాన రాజకీయ పార్టీ అయిన అన్నాడీఎంకేలో రెండువారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడిరది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) చేతికి వచ్చాయి. పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ (పార్టీ అత్యున్నత నిర్ణయాల విభాగం) పళనిస్వామిని జనరల్‌ సెక్రటరీగా ఎన్నుకోవడమే కాకుండా.. పన్నీర్‌ సెల్వమ్‌ ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్టీలో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్ధు చేసింది. అలాగే పన్నీర్‌ సెల్వం మద్దతుదారులైన వైతిలింగం, మనోజ్‌ పాండియన్‌, జేసీడీ ప్రభాకరన్‌ ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. మొత్తం 16 తీర్మానాలు జనరల్‌ కౌన్సిల్‌ ముందుకు వచ్చాయి. పార్టీ కార్యాలయం ముందు ఇరు వర్గాలు నిరసన చర్యలకు దిగాయి. పన్నీర్‌ సెల్వం దిష్టి బొమ్మలను పళనిస్వామి మద్దతు దారులు దహనం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో పన్నీర్‌ సెల్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు సెక్షన్‌ 144 విధించారు. పార్టీ ట్రెజరర్‌ గా ఉన్న పన్నీర్‌ సెల్వం స్థానంలో దిండుగల్‌ శ్రీనివాసన్‌ ను పళనిస్వామి నియమించారు. సీనియర్‌ నేతలు పలు మార్లు పన్నీర్‌ సెల్వంతో ఏక నాయకత్వంపై చర్చలు నిర్వహించినా.. ఆయన అంగీకరించలేదని పళనిస్వామి ప్రకటించారు. పన్నీర్‌ సెల్వం డీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ఇదిలావుంచితే, పళనిస్వామి, మునుస్వామిలకు తనను బహిష్కరించే అధికారం లేదని పన్నీర్‌ సెల్వం ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తానే వారిద్దరిని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. తనను అన్నాడీఎంకే కోర్డినేటర్‌ గా 1.5 కోట్ల మంది పార్టీ సభ్యులు నిర్ణయించినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img