Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఎన్నికల కోసమే సాగుచట్టాల రద్దు : పవార్‌

పూనె : సమీప భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు లేనట్లయితే వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే నిర్ణయాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకునేది కాదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ బుధవారం పేర్కొన్నారు. సతారా జిల్లాలోని మహాబలేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని నరేంద్ర మోదీ చట్టాల రద్దుకు ఉపక్రమించారని పవార్‌ తెలిపారు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాది (ఎంవీఎ) ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మూడు పార్టీల కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఎన్సీపీ యువజన విభాగం సదస్సుకు హాజరయ్యే ముందు పవార్‌ విలేకరులతో మాట్లాడారు. గత శుక్రవారం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. యూపీ, ఇతర పొరుగు రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యను ప్రకటించారని పవార్‌ స్పష్టం చేశారు. మాజీ కేంద్ర వ్యవసాయ మంత్రి తెలిపారు. ‘యూపీతోపాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి. మా సమాచారం ప్రకారం.. అధికారంలో ఉన్న వారు ఈ రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలను సందర్శించినప్పుడు, వారికి స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, వారు ఓట్లు అడగటానికి వెళ్లినప్పుడు వారికి ఎలాంటి స్పందన లభిస్తుందో వారు పసిగట్టవచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది’ అని పవార్‌ పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో మహారాష్ట్రలో ప్రభుత్వం మారుతుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై పవార్‌ ప్రశ్నించగా.. రెండేళ్ల క్రితం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ఎంవీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది కూలిపోతుందనే వాదన వినిపించింది.. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలుసునన్నారు. ఎంవీఏ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని, తదుపరి ఎన్నికల్లో మేము కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంటే, మరోసారి అధికారంలోకి వస్తుందని పవార్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img