Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పక్కా ‘ప్రచార్భాటం’

మహిళా సాధికారతపై కొరవడిన చిత్తశుద్ధి
‘బేటీ బచావో.. బేటీ పడావో’ నిధులు దుర్వినియోగం
80 శాతం ప్రచార ప్రకటనలకే ఖర్చు
చాలా రాష్ట్రాల్లో అధ్వానంగా పథకం అమలు ` కేంద్రం పాలన తీరుపై విమర్శలు

న్యూదిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిపాలన పక్కా ప్రచార్భాటంగా మారింది. సంక్షేమ పథకాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్నప్పటికీ దేశంలో అటువంటిదేమీ కానరావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకం అనుకున్న స్థాయిలో ఫలితాలను రాబట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పథకానికి సంబంధించి విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ఈ పథకానికి కేంద్రం కేటాయించిన నిధుల్లో 80 శాతం మేర ప్రచారం, ప్రకటనలకు ఖర్చు చేయడం తీవ్ర చర్చకు తెరలేపింది. ఈ పథకం చాలా రాష్ట్రాల్లో సరైన పనితీరు కనబర్చడం లేదు. ఈ పథకంతో బాలికలకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, ప్రభుత్వం ప్రచారం కోసమే దీనిని వాడుకుంటున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశంలోని బాలికల కోసం ఉద్దేశించిన సంక్షేమ సేవలపై అవగాహన, సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ‘బేటీ బచావో, బేటీ పడావో ప్రచారం 2015లో ప్రారంభమయింది.
మహిళా సాధికారతపై ఏర్పాటయిన ఒక కమిటీ ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకం కింద రాష్ట్రాలు నిధులను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొంది. ప్రభుత్వం ఈ పథకం ప్రకటనలపై కంటే విద్య, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించింది. ‘బేటీ బచావో-బేటీ పడావో పథకానికి ప్రత్యేక సూచనతో విద్య ద్వారా మహిళా సాధికారత’ అనే శీర్షికతో గురువారం లోక్‌సభలో సమర్పించిన ప్యానెల్‌ నివేదిక ప్రకారం, 2014-15లో పథకం ప్రారంభించినప్పటి నుండి 2019-20 వరకు దాని మొత్తం బడ్జెట్‌ కేటాయింపు రూ.848 కోట్లు. ఈ కాలంలో రాష్ట్రాలకు రూ.622.48 కోట్లు విడుదలయ్యాయి. అయితే నిరాశ కలిగించే విషయమేమిటంటే, కేవలం 25.13 శాతం నిధులు.. అంటే రూ.156.46 కోట్లు రాష్ట్రాలు ఖర్చు చేశాయి. ఇది పథకం పని తీరును ప్రతిబింబిస్తోంది. ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ కూడా 2016-17లో పథకం అమలు, రాష్ట్రాలు చాలా తక్కువ ఖర్చు చేయడం గురించి ప్రస్తావించింది’ అని నివేదిక పేర్కొంది. నిర్ధిష్ట సంవత్సరంలో రాష్ట్రాల వద్ద నిధులు ఖర్చు చేయకుండా మిగిలిపోయినప్పటికీ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు నిధులను విడుదల చేస్తోందని కమిటీ పేర్కొంది. ‘ఈ పథకం కింద విద్య, ఆరోగ్యం, ఇతరత్రా వాటిపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేసే ఖర్చుపై నోడల్‌ మంత్రిత్వ శాఖ(డబ్ల్యూసీడీ) వద్ద ఎటువంటి సమాచారం లేదని కమిటీ కనుగొంది’ అని నివేదిక పేర్కొంది. డబ్ల్యూసీడీ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర నిధుల దుర్వినియోగం సమస్య, బాలికల ప్రయోజనం కోసం ‘బేటీ బచావో, బేటీ పడావో’ నిధులను సక్రమంగా వినియోగించేలా చూడాలని కమిటీ సిఫార్సు చేసింది. నోడల్‌ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ముందుగా విడుదల చేసిన వాస్తవ వినియోగం ఆధారంగా, మునుపటి నిధుల ఖర్చు, వినియోగాన్ని సరిగ్గా పరిశీలించిన తర్వాత నిధులు విడుదల చేయాలి. నోడల్‌ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లక్ష్య ఆధారిత విధానాన్ని కలిగి ఉండాలి. సమయానుకూలంగా పని చేయాలి’ అని పేర్కొంది. ప్రతి జిల్లాకు ఆరు వేర్వేరు భాగాల కింద వినియోగానికి సంవత్సరానికి రూ.50 లక్షలు కేటాయించబడిరది. అందులో 16 శాతం అంతర్‌ విభాగ సంప్రదింపులు, సామర్థ్యం పెంపుదల కోసం, 50 శాతం ఆవిష్కరణ లేదా అవగాహన కల్పన కార్యకలాపాలకు, ఆరు శాతం పర్యవేక్షణ, మూల్యాంకనం కోసం, ఆరోగ్యంలో రంగాల జోక్యానికి 10 శాతం, విద్యలో రంగాల జోక్యానికి 10 శాతం, ఫ్లెక్సీ ఫండ్‌లుగా ఎనిమిది శాతం ఉన్నది. అయితే 2016-2019 మధ్య కాలంలో విడుదలైన మొత్తం రూ.446.72 కోట్లలో 78.91 శాతం మీడియా ప్రచారానికే ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. ‘బేటీ బచావో, బేటీ పడావో’ సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడానికి మీడియా ప్రచారాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని కమిటీ అర్థం చేసుకున్నప్పటికీ, పథకం లక్ష్యాలను సమతుల్యం చేయడం కూడా అంతే ముఖ్యమైనదని వారు భావిస్తున్నారు’ అని తెలిపింది. వెనుకబడిన ప్రాంతాలలో పిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి, ఆడపిల్లల విద్యను నిర్ధారించడానికి ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన పథకాలలో ఒకటైన ‘బేటీ బచావో బేటీ పడావో’ కింద ప్రకటనల ఖర్చులను ప్రభుత్వం మళ్లీ పరిశీలించాలని కమిటీ సిఫార్సు చేసింది. విద్య, ఆరోగ్యంలో రంగాల జోక్యాల కోసం ప్రణాళికాబద్ధమైన వ్యయ కేటాయింపులపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొంది. కాగా ఎండబ్ల్యూసీడీ కార్యదర్శి నేతృత్వంలో జాతీయ టాస్క్‌ఫోర్స్‌, ప్రధాన కార్యదర్శి లేదా కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్‌ నేతృత్వంలోని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అవసరమైన సంఖ్యలో సమావేశాలను నిర్వహించడంలో, జిల్లాల నుండి నెలవారీ నివేదికలు లేదా వ్యయ ప్రకటనలను సకాలంలో సేకరించడంలో లోపం ఉన్నట్లు గుర్తించింది. పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడమే బాలికలు పాఠశాలల నుండి తప్పుకోవడానికి కారణమని వివరిస్తూ, 94.8 శాతం పాఠశాలల్లో మాత్రమే బాలికలకు మరుగుదొడ్లు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ‘సమగ్ర శిక్ష కింద కాంపోజిట్‌ గ్రాంట్లు ప్రత్యేక బాలికల మరుగుదొడ్ల నిర్మాణంతో సహా అనుకూలమైన అభ్యాస వాతావరణం కోసం అందించబడతాయని కూడా కమిటీ గమనించింది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం 100 శాతం ప్రత్యేక ఫంక్షనల్‌ టాయిలెట్లను నిర్మించడం, జల్‌ శక్తి మిషన్‌తో కలిసి, వాటిలో కుళాయి ద్వారా నీటి సరఫరా ఉండేలా చూసేందుకు కాలక్రమాన్ని ఖరారు చేయాలని సిఫార్సు చేసింది. పథకం నిధులు ఇలా సక్రమైన రీతిలో ఉపయోగించుకోకపోవడం గురించి మహిళా శిశు సంక్షేమ శాఖ తక్షణమే స్పందించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈ విషయంపై చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img