Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రైతుకు రుణమాఫీ, 20లక్షల ప్రభుత్వోద్యోగాలిస్తాం

యూపీకి కాంగ్రెస్‌ హామీలు
మేనిఫెస్టో విడుదల చేసిన ప్రియాంక గాంధీ

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి గురువారం తొలి దశ పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో బుధవారం కాంగ్రెస్‌ మేనిఫెస్టో ‘ఉన్నతీ విధాన్‌’ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విడుదల చేశారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, వీధిపశువుల వల్ల జరిగే పంట నష్టానికిగాను రైతులకు రూ.3వేల పరిహారం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రియాంక హామీలు ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోను జనఘోషనా పత్రంగా వర్ణించారు. ఇంతకుముందు మహిళల కోసం శక్తి విధాన్‌, యువత కోసం భారతీ విధాన్‌ పేరిట మేనిఫెస్టోలను కాంగ్రెస్‌ విడుదల చేసింది. ప్రియాంక మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ధాన్యం, గోధుమలను క్వింటా రూ.2,500కు కొనుగోలు చేస్తామని, క్వింటా చక్కెరను రూ.400 లెక్కన కొంటామని తెలిపారు. మేనిఫెస్టోను రూపొందించే క్రమంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుందని, ఖాళీగా ఉన్న 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, ఎనిమిది లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రియాంక హామీలిచ్చారు. ‘గోధాన్‌ న్యాయ్‌ యోజన’ను ప్రారంభిస్తామని, తద్వారా పేడను కేజీ రూ.2 లెక్కన కొనుగోలు చేసే ప్రక్రియ మొదలవుతుందని అన్నారు. ప్రభుత్వంలో అవుట్‌సోర్సింగ్‌ అంతమే కాంగ్రెస్‌ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్‌ దశలవారీగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తుందని ప్రియాంక తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img