Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఉచితం

అఖిలేశ్‌ యాదవ్‌ మరో ఎన్నికల హామీ
లక్నో :
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు నానాతంటాలు పడుతున్నాయి. పోటాపోటీగా వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తాజాగా శనివారం రాష్ట్రంలోని యువత, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని వాగ్దానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం కట్టబెడితే గృహవినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని అఖిలేశ్‌ ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ మీడియా విభాగంపై అఖిలేశ్‌ నిప్పులు చెరిగారు. ఇటీవల ఐటీ దాడులు ఎదుర్కొన్న కాన్పూరు అత్తరు వ్యాపారితో తనకు సంబంధం ఉందంటూ ఇద్దరి ఫొటోలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జిపై తమ పార్టీకి చెందిన న్యాయవిభాగం ఫిర్యాదు చేస్తుందని అఖిలేశ్‌ ప్రకటించారు. ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని, నీటిపారుదల రంగానికి ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని ఇప్పటికే తమ పార్టీ హామీ ఇచ్చిందని, తాము అధికారంలోకి రాగానే ఉత్తమ నాణ్యతతో కూడిన ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు, యువతకు అందిస్తామని శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అఖిలేశ్‌ హామీ ఇచ్చారు. గతంలోనూ తాము లక్షలాది ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశామని, లబ్ధిదారులు వాటిని ఇప్పటికీ వాడుకుంటున్నారని గుర్తుచేశారు. యోగి ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లను యువతకు పంపిణీ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి పెద్దఎత్తున డబ్బులు తీసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అఖిలేశ్‌ విమర్శించరు. ఆయన పెద్ద అబద్ధాలకోరుగా ప్రచారం చేయాల్సిందిగా తమ డిజిటల్‌ బృందానికి చెప్పానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img