Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

విద్యుత్‌ప్లాంట్లలో నిండుకున్న బొగ్గు నిల్వలు

న్యూదిల్లీ : విద్యుత్‌ డిమాండ్‌ పెరగడం, భారీ వర్షాలు తదితర కారణాల వల్ల విద్యుత్‌ ప్లాంట్లు ఈ ఏడాది ఏప్రిల్‌`నవంబరు మధ్యకాలంలో డిమాండ్‌కు తగ్గ రీతిలో చాలినన్ని బొగ్గు నిల్వలను పొందలేకపోయాయని కేంద్రప్రభుత్వం గురువారం పార్లమెంటుకు తెలిపింది. ‘ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ కారణంగా గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే దేశంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సుమారు 16 శాతం పెరిగినందున ఏప్రిల్‌-నవంబర్‌, 2021లో విద్యుత్‌ ప్లాంట్లు తగినంత నిల్వల్ని నిర్వహించలేకపోయాయి’ అని విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా దేశీయ బొగ్గు సరఫరాకు అంతరాయం కలిగిందని, ఇది అక్టోబర్‌ 2021 మొదటి వారం వరకు కొనసాగిందని, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లలో దిగుమతి చేసుకున్న బొగ్గు ధరలు పెరగడంతో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ద్వారా బొగ్గు దిగుమతి తగ్గిందని మంత్రి చెప్పారు. ఏప్రిల్‌-జూన్‌, 2021లో కోవిడ్‌ రెండో వేవ్‌ కారణంగా ఉత్పత్తి , లాజిస్టిక్‌ ఏర్పాట్లు కూడా దెబ్బతిన్నాయని మంత్రి తెలిపారు. సభకు మరో సమాధానంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత దిగుమతి విధానం ప్రకారం బొగ్గును ఓపెన్‌ జనరల్‌ లైసెన్స్‌ (ఓజీఎల్‌) కింద ఉంచుతామని, వినియోగదారులు తగిన సుంకం చెల్లించి వారి ఒప్పంద ధరల ప్రకారం తమకు నచ్చిన చోట నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవచ్చునన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img