Monday, May 6, 2024
Monday, May 6, 2024

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సింగర్‌ కేకే హఠాన్మరణం

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్‌ కేకేగా పేరొందిన కృష్ణకుమార్‌ కున్నత్‌ (53) హఠాన్మరణం చెందారు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్‌ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. . అనంతరం ఆయన అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను సీఎంఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేకే మరణించినట్టు ధ్రువీకరించారు.1990లలో ‘పాల్‌’, ‘యారోన్‌’ సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంచలనం సృష్టించాయి. యువతలో ఆయన పాటలకు విపరీతమైన క్రేజ్‌ ఉండేది. స్కూల్‌, కాలేజీ, కల్చరల్‌ ఈవెంట్స్‌లో ఎక్కువగా ఈ పాటలు వినిపించేవి. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ సహా పలు భాషల్లోనూ పాటలు పాడారు. కేకే మరణవార్త ఆయన అభిమానులను, ప్రముఖులు, సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కేకే మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని, అన్ని వయసుల వారిని అలరిస్తాయని అన్నారు. ఆయన పాటల ద్వారా ఎప్పటికీ కేకేను గుర్తుంచుకుంటామని అన్నారు. కేకే కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చాలా విచారకరమని, కేకే మృతి వార్త తనను షాక్‌కు గురిచేసిందని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్‌ కుమార్‌ అన్నారు. కేకే మృతి తీరని లోటని పేర్కొన్నారు. కేకే పాటలు, ఆయన గాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయని గాయకుడు పాపాన్‌ అంగారాగ్‌ ట్వీట్‌ చేశారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కేకే మరణవార్త వినాల్సి రావడం విషాదకరమని, జీవితం ఎంత దుర్భలమైందో ఆయన మరణం మరోమారు గుర్తు చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img