Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సీఎన్‌జీపై సబ్సిడీ ఇవ్వండి

రెండోరోజుకు క్యాబ్‌ డ్రైవర్ల సమ్మె
న్యూదిల్లీ: సీఎన్‌జీకి సబ్సిడీ ఇవ్వాలని లేదా చార్జీలు పెంచాలన్న డిమాండ్‌తో డ్రైవర్లు చేస్తున్న సమ్మె మంగళవారానికి రెండోరోజుకు చేరింది. ఉబర్‌, ఓలా వంటి యాప్‌ ఆధారిత టాక్సీ డ్రైవర్లు సమ్మెను ఉధృతం చేశారు. సీఎన్‌జీ ధరలు విచ్చలవిడిగా పెంచడంపై డ్రైవర్లు ఆగ్రహంతో ఉన్నారు. అయితే, టాక్సీ డ్రైవర్లతో సోమవారం సమ్మెలో పాల్గొన్న ఆటో రిక్షా, యెల్లోబ్లాక్‌ టాక్సీ యూనియన్లు తమ ఆందోళనను వాయిదా వేసుకున్నాయి. దీంతో దిల్లీ వాసులకు ఊరట లభించింది. సమ్మెతో యాప్‌ ఆధారిత క్యాబ్‌లు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, ఇదే అదనుగా ఆటో వంటి వాహనదారులు ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది ప్రజలకు మరింత భారంగా మారింది. ‘మయూర్‌ విహార్‌ నుంచి నోయిడాలోని ఫిల్మ్‌సిటీలో గల తన కార్యాలయానికి క్యాబ్‌ను బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నించాను. సమ్మె కారణంగా చార్జీ ఎక్కువగా అడిగారు. సాధారణంగా నేను రూ.300 చెల్లిస్తాను. ఈ రోజు అది రూ.700కి చేరింది’ అని నీలేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి చెప్పాడు. అయితే, ఆటో రిక్షాలు, యెల్లోబ్లాక్‌ టాక్సీలు మంగళవారం రోడ్డెక్కడంతో సమ్మె ప్రభావం కొంతమేరకు తగ్గినట్లు కనిపించింది. ‘నేను క్యాబ్‌ బుక్‌ చేసుకోవడానికి ప్రయత్నించాను. 15`20 నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. దీనికితోడు చార్జీ కూడా ఎక్కువ డిమాండ్‌ చేశారు. నేటినుంచి ఆటోలు తిరుగుతుండటంతో ఎయిమ్స్‌ నుంచి లజపత్‌ నగర్‌కు ఆటోలో వెళ్లాను’ అని మరో ప్రయాణికురాలు దీపికా చౌదరి వివరించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డ్రైవర్లు జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ప్రదర్శన చేశారు. ‘ఓలా, ఉబర్‌ క్యాబ్‌లు నేడు తిరగడం లేదు. జంతర్‌ మంతర్‌ వద్ద మా ఆందోళన ప్రారంభమైంది. సాయంత్రమో లేక రేపో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకుంటాం’ అని సర్వోదయ డ్రైవర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవిరాథోడ్‌ చెప్పారు. సీఎన్‌జీపై సబ్సిడీ ప్రకటించడమే కాకుండా చార్జీల సవరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాథోడ్‌ విజ్ఞప్తి చేశారు. ఇంధన ధరలు పెరగడంతో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు బతకడమే కష్టంగా మారిందని చెప్పారు. సీఎన్‌జీ ధరలు విచ్చలవిడిగా పెంచిన కేంద్ర ప్రభుత్వం…క్యాబ్‌ చార్జీల పెంపును మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img