Friday, April 26, 2024
Friday, April 26, 2024

అలుపెరగని పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం

సురవరం సుధాకరరెడ్డి

ఆ కాలంలో నైజాం రాజ్యం చదువులలో అత్యంత వెనుకబడి ఉండేది. మొత్తం రాష్ట్రంలో ఐదు శాతం కూడా చదువుకున్నవారు లేరు. తెలుగు పాఠశాలలు అసలే లేవు. ఉర్దూలోనే చదువుకోవాలి. సూర్యాపేటలో చదువుతున్నప్పుడే, విద్యార్థుల సమ్మె చేయించారు. చదువు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న ధర్మభిక్షం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఒక హాస్టల్‌ నడిపారు. ఆ హాస్టల్‌ను సందర్శించిన కొత్వాల్‌ రాజ్‌ బహదూర్‌ వెంకట్రామి రెడ్డి ‘‘ఈయన భిక్షం కాదు, ధర్మభిక్షం’’ అని ప్రసంశించారని, అప్పటి నుండి అందరూ ఆయనను ధర్మభిక్షం అని పిలిచేవారని ఒక పత్రికలో చదివాను.

నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాట అగ్ర నాయకులలో కామ్రేడ్‌ ధర్మభిక్షం ఒకరు. ఆయన సూర్యాపేటలో ఒక పేద గీత కుటుంబంలో పుట్టి స్వయంకృషితో చైతన్యాన్ని పెంచుకుని నాయకు డయ్యారు. చూపులకు, మాట లకు అత్యంత మృదువుగా కనిపించే ధర్మభిక్షం నిజాం నిరంకుశ ప్రభుత్వానికి, ఫ్యూడలిజానికి, దోపిడీకి వ్యతిరేకంగా అత్యంత కఠినమైన పోరాటాన్ని చేశారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా, ముందు ఆర్య సమాజంలో పనిచేశారు.

ఆ కాలంలో నైజాం రాజ్యం చదువులలో అత్యంత వెనుకబడి ఉండేది. మొత్తం రాష్ట్రంలో ఐదు శాతం కూడా చదువుకున్నవారు లేరు. తెలుగు పాఠ శాలలు అసలే లేవు. ఉర్దూలోనే చదువుకోవాలి. సూర్యాపేటలో చదువుతున్న ప్పుడే, విద్యార్థుల సమ్మె చేయించారు. చదువు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న ధర్మభిక్షం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఒక హాస్టల్‌ నడిపారు. ఆ హాస్టల్‌ను సందర్శించిన కొత్వాల్‌ రాజ్‌ బహదూర్‌ వెంకట్రామి రెడ్డి ‘‘ఈయన భిక్షం కాదు, ధర్మభిక్షం’’ అని ప్రసంశించారని, అప్పటి నుండి అందరూ ఆయనను ధర్మభిక్షం అని పిలిచేవారని ఒక పత్రికలో చదివాను. అప్పట్లో ఒక మోస్తరు రైతు కుటుంబాల వారు కూడా, తమ పిల్లలను చదివించుకోగలిగిన ఆర్థిక స్తోమత ఉండేది కాదు. అందువల్ల జిల్లా నలుమూలల నుండి అనేక మంది విద్యార్థులు, ధర్మభిక్షం హాస్టల్‌లో ఉండి చదువుకునే వారు. బర్కత్‌పురలో ఒక సుప్రసిద్ద హైకోర్టు అడ్వకేట్‌ ఉండేవారు. ఆయన ఆ హాస్టల్‌లోనే చదువు కున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, ఒక పర్యాయం నాతో ధర్మభిక్షం బస్సులో తిరుగుతున్నారు. ఆయనకు ఒక కారు కొనిపెట్టాలని ప్రతిపాదించారు. మా పార్టీకి అది సాధ్యం కాదని అన్నాను. మీకేమిటి ఆసక్తి అని అడిగాను. నేను ధర్మభిక్షం హాస్టల్‌లో చదువుకున్నాను. నాకు ఆయన పట్ల అపారమైన గౌరవమని చెబుతూ ఆయన అంగీకరిస్తే ఆయన హాస్టల్‌లో చదువుకున్న వారు, ఆయన అభిమానుల అందరి దగ్గర వసూలు చేసి ఒక కారు కొని పెట్టవచ్చునని అన్నారు. ధర్మభిక్షం గారిని అడిగితే, దాని సమస్యలు దానికి ఉంటాయి. దానికి డ్రైవర్‌ కావాలి. పెట్రోల్‌ కావాలి. ఉద్యమం కోసం కాకుండ కారు కోసం డబ్బులు వసూలు చేయాలి. వారి దగ్గర కారు తీసుకుంటే రాజకీయ మొహమాటాలు ఉంటాయి. మన పార్టీ, సంఘం కొనగలిగినప్పుడు చూద్దాం అన్నారు.
ఆయన హాస్టల్‌ను గీత కార్మికుల కుటుంబాల కోసం పరిమితం చేయలేదు. అన్ని కులాల వారిని ఈ హాస్టల్లో చదివేందుకు ఆహ్వానించారు. అందుకే ఆయనకు జిల్లా నలుమూలల అసంఖ్యాకమైన అభిమానులున్నారు.
నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి సంవత్సరాల తరబడి జైలులో ఉంచింది. గీత కార్మికుల దోపిడికి వ్యతిరేకంగా, కాంట్రాక్టర్లపై పెద్ద పోరాటం చేశారు. నిరక్షరాస్యులైన గీత కార్మికులను సంఘటితం చేసినందుకు అనేక దాడులు, ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొన్నారు. తెలంగాణలో బలమైన గీత కార్మిక ఉద్యమం నిర్మితమైంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత విశాలమైన రాష్ట్ర సంఘంగా ఏర్పడిరది. ఆయన పార్లమెంటు సభ్యుడు అయిన తర్వాత దేశవ్యాప్తంగా గీత కార్మిక సంఘాన్ని విస్తృతం చేసి జాతీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. యస్‌. కుమారన్‌, యం.పి. కేరళ, అధ్యక్షులుగా, బొమ్మగాని ధర్మభిక్షం ప్రధాన కార్యదర్శిగా జాతీయ సంఘం ఏర్పడిరది. కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాలకు కూడా ఉద్యమం విస్తరించింది.
ధర్మభిక్షం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, నల్లగొండ జిల్లా పార్టీ కార్య దర్శిగా, పార్టీ జాతీయ సమితి సభ్యులుగా పనిచేశారు. ఆయన 1952, 57, 62 ఎన్నికలలో సూర్యాపేట, నల్లగొండ, మునుగోడు, మూడు వేరువేరు నియోజక వర్గాల నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రతిసారీ కొత్త నియోజకవర్గం కేటా యించినా, వరసగా గెలవటం, ఆయన పలుకుబడికి నిదర్శనం. తర్వాత ఆయన పార్లమెంట్‌కు, జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. పార్టీలో చీలిక వల్ల గెలవలేకపోయినా, ఎక్కువ ఓట్లు సంపాదించారు. మళ్లీ రెండు పార్టీలు కలిసి, టీడీపీ కూడా మద్దతుతో రెండుసార్లు పెద్ద మెజార్టీతో పార్లమెంటుకు గెలిచారు. 1967 నుండి ప్రతి ఎన్నికలలో నేను విద్యార్థిగా పార్టీ బాధ్యుడిగా, ఆయన ఎన్నికలలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను. దానితో ఆయనతో మరింత సన్నిహితంగా మెలిగే అవకాశం కలిగింది. సైకిళ్లపై విద్యార్థి దళం ప్రచారం చేసే వారం. ఘట్కేసర్‌లో కొంతమంది గుండాలు ఎర్రజెండాలు చూసి, మా సైకిళ్లను గుంజుకున్నారు. ఆ వూళ్లో పార్టీ లేదు. సర్పంచి దగ్గరకు వెళ్లి ధర్మభిక్షం కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నామని చెప్తే, మా సైకిళ్లను వాపస్‌ ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో పార్టీ లేదు. భిక్షం గారు ఎన్నికల ప్రచారానికి వచ్చామని చెప్పి, ఇంటికొక వాలంటీరు లాగా భోజనం చేసేవాళ్ళం. కొన్నిచోట్ల ఆయన కూడా మాతో పాటు ఉగ్గాని తినేవారు.
ధర్మభిక్షం విద్యార్థి, యువకులతో అత్యంత ఆప్యాయతతో వుండేవారు. వారిని పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రోత్సహించేవారు. ఆయన సాన్నిహిత్యం అనేక మందిని పార్టీ వైపు ఆకర్షించింది.
ఆయన అత్యంత నిరాడంబరంగా జీవించాడు. వారి సోదరుడు వెంకటయ్య సాయుధ పోరాటంలో దళ నాయకుడు. పిల్లలతో సహా ఆయన అందరినీ పలకరించేవారు. శాసన సభ్యునిగా ఉన్నప్పుడు అక్కడ తాత్కాలికంగా పని చేస్తున్న అజీజ్‌ పాషాను పార్టీలోకి తెచ్చారు. ఇంకా అనేకమందిని ఆయన అలాగే పార్టీలోకి ఆకర్షించారు. ఆఖరివరకు ఉద్యమంలో ఉన్నారు. ఆయన కుటుంబం మొత్తాన్ని పార్టీలోకి తెచ్చారు. అలుపెరగని కమ్యూనిస్టు పోరాట యోధుడు కామ్రేడ్‌ బొమ్మగాని ధర్మభిక్షం గారికి విప్లవాంజలి.
(నేడు కామ్రేడ్‌ ధర్మభిక్షం శతజయంతి)

వ్యాస రచయిత సీపీిఐ మాజీ ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img