Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అశాస్త్రీయమైన గర్భసంస్కార్‌

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

గర్భసంస్కార్‌ పేరుతో సంఫ్‌ు అనుబంధ సంస్థ సమవర్ధిని న్యాస్‌ దిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో 05.03.2023 న కార్యశాల నిర్వహించింది. 12 రాష్ట్రాల నుండి స్త్రీ,శిశు వైద్యులు, ఆయుర్వేద వైద్యులు, యోగా గురువులు పాల్గొన్నారు. ‘‘కడుపులోని పిండాలకు భారతీయ (హిందువాద) సాంస్కృతిక విలువలు నేర్పాలి. దీంతో దేశభక్తులైన, స్త్రీలను గౌరవించే పిల్లలు, రాముని వంటి కొడుకులు పుడతారు. గీత, సంస్కృతం చదివే గర్భశుద్ధి పద్దతితో బిడ్డ డి.ఎన్‌.ఎ. మారుతుంది.’’ అని న్యాస్‌ నేతలు చెప్పారు. పౌరాణిక హిందు పాలకుల గుణగణాలు, నరేంద్రమోదీ, డొనాల్డ్‌ ట్రంప్‌ల నాయకత్వ లక్షణాలు గల భావి నాయకులను తయారుచేయడం గర్భసంస్కార్‌ లక్ష్యమని న్యాస్‌ జాతీయ నిర్వహణ కార్యదర్శి మాధురి మరాఠే అన్నారు. గర్భసంస్కార్‌ అన్న సంస్కృత పదాలకు గర్భసంచిని శుద్ధిచేయడం, పిండం మెదడును చైతన్యపరచడం అని అర్థం. ఇది వేదకాలపు ఆధ్యాత్మిక ఆచరణ. గర్భసంస్కార్‌లో గర్భవతులకు భగవద్గీత, రామాయణ శ్లోకాలను వినిపిస్తారు. యోగా నేర్పిస్తారు. సాంస్కృతిక విలువల పేరుతో మతాధిపత్య భావజాలాన్ని పుట్టబోయే పిల్లల, తల్లుల మెదళ్ళలో చొప్పించి, వారిని హిందువాదంతో చైతన్యపరిచే ప్రక్రియే గర్భసంస్కార్‌. గర్భసంస్కార్‌, చైతన్యవంతమైన సంస్కృతి, నాగరికతలతో శుద్ధ మతతాత్విక పవిత్ర శిశువులను పుట్టిస్తుందట. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌, వీర శివాజీ ఈ గర్భసంస్కార్‌తోనే పుట్టారట.
పూర్వం ఆయుర్వేద వైద్యులు ప్రజలందరికీ చికిత్స చేసేవారు. వైద్యం చేస్తూ వారు అంటరానివారిని కూడా తాకి అదే చేతులతో ఇతరులనూ తాకుతారని, సమాజాన్ని మైలపరుస్తారని నాటి ఆధిపత్య వర్ణాలవారు ఆయుర్వేదాన్ని అడ్డుకున్నారు. అది అటకెక్కింది. లేకుంటే 3 వేల ఏళ్ల నాడే చరకుడు, శుశ్రుతుడు అభివృద్ధి చేసిన ఆయుర్వేదం నేడు ప్రపంచంలోనే మెరుగైన వైద్య విధానంగా ఎదిగేది. తాము నాశనంచేసిన ఆయుర్వేదంలో భాగమైన గర్భసంస్కార్‌ను ఇపుడు సన్మార్గుల జన్మకు వాడతారట! గర్భశుద్ధి కోసం 15.09.1935న హిట్లర్‌ చేసిన నూరెంబర్గ్‌ చట్టాల ప్రకారం జర్మన్‌ రక్తాన్ని, జాతి గౌరవాన్ని కాపాడటానికి జర్మన్‌, యూదుల మధ్య పెళ్ళి, వివాహేతర సంబంధాలను నిషేధించారు. 45 ఏళ్ల లోపు జర్మన్‌ స్త్రీలు యూదుల వద్ద ఉద్యోగం చేయరాదు. అశుద్ధజాతులుగా నిర్ధారించి, జన్యులోపాల సాకుతో, 4 లక్షల మందికి గర్భనిరోధక టీకాలు వేశారు. వేలాది మందికి బలవంతంగా గర్భస్రావం చేయించారు. పిల్లలను యాక్షన్‌ టి 4 కింద చంపారు. యూదు స్త్రీలను, పిల్లలను, వృద్ధులను సామూహిక హత్యచేశారు. సంఫ్‌ు ఆరోగ్య విభాగ అధినేత అశోక్‌ కుమార్‌ జర్మనీకి వెళ్ళి శుద్ధ ఆర్యజాతి సిద్దాంతాన్ని అధ్యయనం చేశారు. భారత్‌లో అమలుకు పథకాలు రచించారు. ముస్లింల, క్రైస్తవుల పుణ్యభూమి భారత్‌ కాదని, కమ్యూనిస్టుల సిద్ధాంతం విదేశాలదని ఎగతాళిచేసే సంఫ్‌ు ఉత్తమజాతి పిల్లలను పుట్టించటానికి జర్మనీ సూత్రాలను అమలుచేస్తోంది. సంఫ్‌ు అనుబంధ ఆరోగ్య భారతి, ఉత్తమ సంతతి కోసం బీజేపీి పాలిత గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో 16 ఏళ్ల క్రితమే గర్భ విజ్ఞాన సంస్కార్‌ పథకాన్ని ప్రారంభించింది. ‘‘ఉత్తమ సంతతి ద్వారా బలమైన భారత్‌ మా లక్ష్యం. 450 సంస్కార శిశువులను పుట్టించాం. 2020 నాటికి ప్రతి రాష్ట్రంలో గర్భ విజ్ఞాన్‌ అనుసంధాన కేంద్రాలను స్థాపిస్తాం’’ అని ఈ పథక జాతీయ అనుసంధానకర్త డా.కరిష్మా మోహన్‌ దాస్‌ నార్వాణి 1917మే లో చెప్పారు. జర్మనీలో శుద్ధ ఆర్యజాతిని నిర్మించిన హిట్లర్‌ ఈ విషయంలో మాకు ఆదర్శమని సంఫ్‌ు నాయకులు అన్నారు. తాము ఉత్తమ హిందుజాతి అని నిర్ణయించినవారిని తప్ప మిగిలిన వారి పట్ల హిట్లర్‌ చర్యలు తీసుకుంటారేమో!?
గర్భసంస్కార్‌లో పౌరాణికకథలను వినిపిస్తారు. కడుపుతో ఉన్న భార్య సుభద్రకు అర్జునుడు పద్మ వ్యూహం గురించిచెప్పాడు. గర్భంలోని అభి మన్యుడు విన్నాడు. వ్యూహంలోకి పోవడం రావడం తెలిసిన యోధుడు అజేయుడై సవాలుగా మారతాడని భావించిన శ్రీకృష్ణుడు, వ్యూహం నుండి బయటికి రావడం చెప్పకుండా అర్జునున్ని అడ్డుకున్నాడు. బయటికిరావడం తెలియని అభిమన్యుడు యుద్ధంలోదుర్మరణం పాలయ్యాడు. హిరణ్యకశిపుని భార్య లీలావతి కడుపులోని ప్రహ్లాదునికి నారదుడు విష్ణుకీర్తనలు విని పించాడు. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడయ్యాడు. నారదుడు నాస్తికులం దరికీ కీర్తనలు ఎందుకు చెప్పలేదో! 8 శారీరక వంకర లతో పుట్టిన అష్టావక్రుని కథనూ ఆలపిస్తారట. ఈ కథ వింటే వంకరలేని పిల్లలెలా పుడతారు? హనుమంతున్నీ స్తుతిస్తారట. ఆంజనేయ స్తుతితో చిరంజీవులు పుడతారా? ప్రథమ దేవుళ్ళయినా పసిపిల్లలుగా మారితే దృశ్యజ్ఞానం ఉండదని సతీ అనసూయకథలో కవి సరిగానే రాశారు. ఎన్నో పుక్కిటిపురాణాలను నమ్మిన సంఫ్‌ు దీన్ని ఎందుకు నమ్మదు?
గర్భసంస్కార్‌ కార్యక్రమంలో గర్భం ధరించినప్పటి నుండి బిడ్డ పుట్టిన తర్వాత 2 ఏళ్ల వరకు తల్లీపిల్లలకు ‘చైతన్య’ శిక్షణఇస్తారు. 30వారాలపిండానికి ఇంద్రియాలు, మెదడు అభివృద్ధి చెందుతాయి. గర్భస్థపిండానికి వినికిడి శక్తే ఉండదు. పుట్టిన 3 నెల్లకు అమ్మ వాసనను, సైగలను గుర్తిస్తుంది. మూడేళ్ళకు గాని అతి ప్రాథమిక స్థాయి విషయాలు అర్థంకావు. ఆరేళ్ళకు ఒక మోస్తరు పాఠాలు అర్థమవుతాయి. అడవిలో పెరిగిన పిల్లలకు మాటే రాదు. పిల్లకు, తల్లికి గర్భసంస్కార్‌లో చదివే సంస్కృత శ్లోకాలు అర్థంకావు. ఐతే మతాచారాల లయబద్ద శబ్దాలు తల్లీ పిల్లను సవ్వడి సమ్మతులుగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో జరిగే హిందువాద తంతులతో తల్లి, రెండేళ్ల బిడ్డ మమేక మవుతారు. ఈ మిషతో తొలిగురువు, సమాజనిర్మాత అమిర తల్లికి సంఫ్‌ు, కాషాయకషాయం తాపుతుంది. జన్యు సాంకేతికతలతో మాత్రమే శాస్త్రవేత్తలు జీవి డి.ఎన్‌.ఎ.ను మార్చగలరు. మాటలతో మనిషి డి.ఎన్‌.ఎ. మారదు. గర్భసంస్కార్‌తో భావిభారతం కాషాయమత్తులో మునుగుతుంది. ‘ఒక దేశం ఒక మతం’, శుద్ధ హైందవ జాతి సాఫల్యమవుతాయి. కార్యశాలకు హాజరైన వైద్యులెవరూ విజ్ఞానశాస్త్ర వాస్తవాలను మాట్లాడలేదు. ఏడాదికి వెయ్యి మంది గర్భవతులకు గర్భసంస్కార్‌ శిక్షణ ఇస్తామని ప్రమాణంచేశారు. యజమానులు ‘ఔనంటే ఔను కాదంటే కాదు’ అనే సౌజన్య పక్షపాత బాధితులు వీరు. గర్భసంస్కార్‌ కొత్త వ్యాపారాలకు తెరలేపింది. ప్రయోగ శాలలు, శిక్షణాలయాలు, సాహిత్య సామగ్రి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం కార్యదర్శి,
సెల్‌: 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img