Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతపై సూచన

ప్రధాన ఎన్నికల అధికారి, మిగతా ఎన్నికల అధికారుల నియామకంపై సుప్రీంకోర్టు మంచి సూచన చేసింది. ఇంతవరకూ జరుగుతున్నట్టు ఇకపై ప్రభుత్వం సిఫార్సు మేరకు వారిని నియమించడం కాకుండా ఒక ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు మేరకు నియమించాలని చెప్పింది. ఆ ఉన్నత స్థాయి కమిటీలో ప్రధాని, పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు. ఒకవేళ ప్రతిపక్ష నాయకుని హోదా ఏ పార్టీకి దక్కకపోతే, పెద్ద ప్రతిపక్షానికి చెందిన నేత సభ్యునిగా ఉంటారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం పాత్ర కుదించి,నియమించిన అధికారిపై ప్రభుత్వపు నీడ పడడం తగ్గుతుంది. ఆయన తమని నియమించిన వారిపట్ల  కృతజ్ఞతా రుణభారం తగ్గి, స్వతంత్రంగా వ్యవహరించే వీలుంటుందన్నది న్యాయపాలిక భావన. ఇది మంచి ఆదేశం. ఈ ఆదేశాన్ని ప్రభుత్వం చట్టం రూపంలోకి తీసుకురావాలి. అదే విధంగా ఎన్నికల సంఘానికి ప్రత్యేక నిధులు నేరుగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రావాలన్నది మరో సూచన. ఖర్చులకు, జీతభత్యాలకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా వత్తిడి లేకుండా పని చేయగలదని ఆశించవచ్చు. అన్ని పార్టీలూ ఈ సూచనల్ని పరిగణలోకి తీసుకుని పార్లమెంట్‌ ద్వారా ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేసేందుకు పూనుకోవాలి. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పునాది. ప్రజాభిప్రాయం వ్యక్తమయ్యే ఈ క్రతువు లోపభూయిష్టంగా ఉంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్ధం ఉండదు. ఎన్నికల సంఘాన్ని స్వతంత్రసంస్థగా తీర్చిదిద్దడం మొదలైతే మొత్తం  ప్రక్రియ కూడా సంస్కరించడానికి వీలు కలుగుతుంది. అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడం, ఎన్నికల్లో డబ్బు పాత్ర తగ్గించడం, నల్లధనం, కండబలం లాంటివి ప్రభావం చూపకుండా కట్టడి చేయడం, పార్టీలు అలవికాని హామీల్ని గుప్పించడం, కులమతాల విభజనతో లాభపడాలని చూడడం లాంటివి అరికట్టడం అన్నవి ఎన్నికల సంఘానికి పెద్ద సవాళ్లు. వాటిని ఎదుర్కొనే సత్తా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వీలు ప్రస్తుతానికి ఆ సంఘానికి లేదు. అందుకే ఎన్నికల సంస్కరణలకు ఈ సూచనలు మొదటి అడుగులు.   
  • డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img