Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విశాఖ ఉక్కును కాపాడుకుందాం రండి

చలసాని వెంకట రామారావు

‘‘కుక్కను చంపాలంటే పిచ్చి ఎక్కిందని చెప్పాలని’’ నానుడి ఎప్పటినుండో ఉంది. ఇది అక్షరాలా విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో నిజం కాబోతున్నది. విశాఖ పట్నంలో ప్రభుత్వరంగంలో 1970లో నెలకొల్పిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంటు దేశ అవసరాలకు ఉపయోగపడే నాణ్యమైన ఉక్కును అందిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకపోయినా, గనులు కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఎన్ని ఆటుపోట్లు, ఇబ్బందులు వచ్చినా వాటి నన్నింటిని అధిగమించి ఈ కర్మాగారం స్వయంపోషకంగా గత 50సంవత్సరాలకుపైగా ప్రభుత్వ రంగంలో ఒక ముఖ్యమైన సంస్థగా ఎన్నో విజయాలను సాధించింది. అయినా కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యూహాత్మక అమ్మకం పేరుతో వైజాగ్‌స్టీల్‌ ప్లాంటును నూటికి నూరుశాతం అమ్మాలనే నిర్ణయాన్ని అమలుపరచే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ అసంబద్ధ నిర్ణయాన్ని ప్లాంటులోని అన్ని కార్మిక సంఘాలు గత రెండు సంవత్సరాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష ఆందోళన నిర్వహిస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుతోపాటు విశాఖపోర్టు, నావల్‌ డాక్‌యార్డు, షిప్‌యార్డు, హెచ్‌.డి.పి.ఎల్‌, బి.హెచ్‌.ఇ.ఎల్‌, డి.బి.ఎల్‌, ఎన్‌.ఏ.డి, పవర్‌సెక్టార్‌, టెలికాం, ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వరంగసంస్థలను, ప్రభుత్వ బ్యాంకులను, ఇన్సూరెన్స్‌ కంపెనీలను, రక్షణ రంగంలోని ఆయుధ కర్మాగారాలను, బొగ్గు వగైరా గనులను, భూ గర్భంలోని ఆయిల్‌, గ్యాస్‌ పైప్‌లైన్లు, కేబుల్‌లైన్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. రైల్వే, విమానయాన, నౌకా, రవాణా రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాన్ని, కార్మికుల హక్కులపై దాడిని నిరసిస్తూ దేశ వ్యాపితంగా కార్మికవర్గం ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించింది.
విశాఖ ఉక్కు కర్మాగారం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 73లక్షల టన్నులు, అంటే రోజుకు 21 వేల టన్నులు ఉక్కును ఉత్పతి చేయాలి. కానీ గత కొంతకాలంగా విశాఖ ఉక్కును నష్టాల పాలుచేసే ప్రయత్నంలో భాగంగా ఒక బ్లాష్ట్‌ ఫర్నేస్‌ను మూసివేసి ఉత్పత్తిని తగ్గించారు. బొగ్గు కొరతను ఒక కారణంగా యాజమాన్యం చెబుతున్నా వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే కుట్రదీనిలో దాగుందని కార్మిక సంఘాలు ప్రకటిస్తున్నాయి. నష్టాల నుంచి ఫ్యాక్టరీని గట్టెక్కించేందుకు కార్మికులు త్యాగాలు చేసేందుకు సిద్ధపడినా ప్రభుత్వం స్పందించడంలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫ్యాక్టరీ నిర్వహణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని మూసివేస్తామని ప్రకటిస్తున్నారు. వర్కింగ్‌ క్యాపిటల్‌ లేక ఆర్థిక ఒడుదుడుకులు ఎదుర్కొంటూ కేంద్రం సహాయం అర్థించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
రాష్ట్ర ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ అంటే విశాఖ ఉక్కు కర్మాగారం 32మంది ప్రాణత్యాగంతో సాధించుకున్నాము. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో ఆనాడు విద్యార్థిలోకం, అభ్యుదయ కాముకులు, వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఉద్యమం నిర్వహించారు. ప్రజాఉద్యమం వేడికి చలించిన నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విశాఖ ఉక్కును ఆమోదించారు. కేవలం 5వేల కోట్లరూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమకు పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం ఈ పరిశ్రమకు నాడు రైతులు కారుచౌకగా ఇచ్చిన భూముల విలువ నేడు లక్షల కోట్లకు చేరింది. భూములు ఇచ్చిన నిర్వాసితుల సమస్యలుసైతం నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. నిర్వాసితులందరికి ఇంకా ఉపాధి కల్పించడం కూడా పూర్తి కాలేదు. నేడు విశాఖ ఉక్కు కర్మాగారం విలువ 3లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా. ఈ పరిశ్రమ ప్రభుత్వానికి ఇప్పటివరకు 60వేల కోట్లు రూపాయలు పన్నుల రూపేణా చెల్లించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ వల్ల లక్షమందికిపైగా ఉపాధిని పొందుతున్నారు. ఇంతటి బృహత్‌ ప్రయోజనాలు కలిగిస్తున్న విశాఖ ఉక్కును ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం ఆంధ్రులు జీర్ణించు కోలేకపోతున్నారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లేక లక్షల సంఖ్యంలో మన సాంకేతిక నిపుణులు విదేశాలకు వలసలు పోతుంటే ప్రభుత్వం ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కూడా మూసివేయడం, అమ్మివేయడం ఎటువంటి దేశభక్తో అర్థం కావడంలేదు.
‘‘తిలా పాపం తలాపిడికడు’’ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తుంటే రాష్ట్రప్రభుత్వం సైతం రాష్ట్రంలోని అతి ఏకైక భారీ పరిశ్రమగా ఉన్న విశాఖ ఉక్కును కాపాడేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించడంలేదు. కనీసం అఖిలపక్ష ప్రతినిధివర్గాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లాలనే డిమాండ్‌ను కూడా ఆమోదించడంలేదు. ఉక్కు కార్మికులు ఉద్యమానికి ప్రభుత్వపరంగా ఎటువంటి మద్దతు ఇవ్వడంలేదు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించే ఎటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేయడంలేదు. కనీసం రాష్ట్రప్రభుత్వం తరఫున కొంతనిధిని కేటాయించి ఈ పరిశ్రమ ఇన్‌సాల్వెన్సీనబ్యాంక్‌ రప్టసీ (ఐబిఎస్‌) వెళ్ల కుండా మూత చెడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సుమారు గత రెండు సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ఉద్యోగులు, పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు, రాష్ట్రప్రజలు,కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. విశాఖలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు, విశాఖ పౌరసమాజం పెద్దఎత్తున ఆందోళన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనీస స్పందన లేకుండాఉంది. విశాఖ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను గౌరవించ కుండా ప్లాంటు ప్రైవేటీకరణచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గత ఎనిమిదేళ్ల్లుగా అధికారంలో ఉన్న మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలోని సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకు కారు చౌకగా అప్పగిస్తోంది. ప్రజావ్యతిరేకతను, దేశవ్యాపితంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెలు, మహాపడావ్‌ వంటి ఆందోళనలు నిర్వహించినా, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది.
ఐకమత్యమే బలం, ఎంత బలవంతమైన సర్పమైనా చలిచీమల చేతికిచిక్కి వచ్చినట్లు శ్రామికవర్గం కళ్లుతెరిస్తే పాలకులు దిగి రావల్సిందే. ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ, కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకత్వంలోని విశాఖ పరిక్షణ రాష్ట్ర సమితిల నేతృత్వంలోని ‘విశాఖ ఉక్కు పరిరక్షణలకు ఉద్యమం జరుగనుంది. ఈ ఉద్యమంలో అన్ని విద్యార్థి, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు పెద్దసంఖ్యలో పాల్గొనాలి. ఐక్య గళంతోయావత్‌ రాష్ట్రం స్పందిస్తే ఆంధ్రుల అత్మగౌరవ పతాక విశాఖ ఉక్కును ప్రభుత్వరంగంలో కాపాడు కోవడం పెద్ద సమస్యకాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఈ కర్మాగారాన్ని కాపాడుకుందాం రండి.
ఏఐటీయూసీ ఎపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
సెల్‌: 94995 2093

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img