Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

టీకా ఉత్పత్తికి వామపక్ష దేశాల సహకారం

సాత్యకిచక్రవర్తి

కొవిడ్‌19 మహమ్మారి బారిన పడి ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందినందున ఈ మహమ్మారి నియంత్రణకు వేగంగా పరిశోధకులు టీకాలను అభివృద్ధిపరిచారు. వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి రాకపోతే ఇది ప్రపంచం నుండి తొలగిపోదు. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి చెందిన దేశాలు టీకాలను ఉత్పత్తి చేసి ముందుగా తమ సమాజాలలోని ప్రజలకు అందించాయి. ప్రపంచంలోని పేద దేశాలకు అభివృద్ధి చెందిన ధనిక దేశాలు టీకాలను ఉచితంగా అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికి ప్రయోజనం లేకపోయింది. ఇటీవల జి7 గ్రూపు ధనిక దేశాల నాయకులు సమావేశమై పేద దేశాలకు టీకాలను అందిస్తామని ప్రకటించి ఒక వ్యూహాన్ని రూపొందించారు. ఈ వ్యూహం అత్యంత లోపభూయిష్టంగా ఉందని నిపుణులు విశ్లేషించారు. ఇదే సమయంలో లాటిన్‌ అమెరికాలోని అయిదు వామపక్ష దేశాలు సమావేశమై అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థ చేస్తున్న కృషిలో తాము భాగస్వాముల మవుతామని ప్రకటించాయి. టీకా ఉత్పత్తి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తిలోను తాము ఇతర దేశాలకు సహకరిస్తామని ప్రకటించాయి.
మెక్సికో, అర్జెంటైనా, క్యూబా, బొలీవియా, వెనిజులా దేశాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భారతదేశం నుంచి కేరళ ప్రభుత్వ ప్రతినిధి అలాగే కెన్యా ప్రతినిధి కూడ పాల్గొన్నారు. సీపీఎమ్‌, సీపీఐలతో కూడిన వామపక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం కేరళను పాలిస్తున్నది. కరోనా మహమ్మారి విస్తరణ సమయంలో ఆరోగ్య భద్రతా చర్యలను తీసుకోవటంలో కేరళ ప్రభుత్వం ప్రశంసనీయమైన కృషి చేసిందని ఈ సమావేశం అభినందించింది. వామపక్ష దేశాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రోగ్రెసివ్‌ ఇంటర్నేషనల్‌ ( పిఐ) హర్షించింది. డెమొక్రసీ ఇన్‌ యూరోప్‌ మూవ్‌మెంట్‌ (డిఐఇఎం), అమెరికాలో శాండర్స్‌ ఫౌండేషన్‌లు కలిసి పిఐని ఏర్పాటు చేశాయి. సాండర్స్‌ ఫౌండేషన్‌ ప్రపంచ రాజకీయాలలో ప్రధాన పాత్ర వహించాలన్న లక్ష్యం కలిగి ఉంది. మితవాద దేశాలు రూపొందించుకున్న నయా ఉదారవాద కార్యక్రమానికి ప్రత్యామ్నాయాన్ని అందించే కృషిలో పిఐ క్రియాశీలంగా పనిచేస్తుంది. ధనిక దేశాలు ప్రాధాన్యతా క్రమంలో పేద దేశాలకు ఉచితంగా టీకాలను పంపిణీ చేయాలన్న విధానాన్ని అమలు చేయించేందుకు బెర్ని శాండర్స్‌ క్రియాశీల పాత్ర వహిస్తున్నారు.
వామపక్ష ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై ‘‘టీికా వివక్ష’’ కు తక్షణ ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 85శాతం సంపన్న, ఎగువ మధ్యతరగతి ఆదాయాలు గల దేశాలకు మాత్రమే టీకాలు అందాయి. తక్కువ ఆదాయం గల దేశాలకు కేవలం 0.3శాతం డోసులు మాత్రమే అందాయి. ఇంత నత్తనడకగా టీకాలను ప్రజలకు అందించినట్లయితే మరో అయిదు దశాబ్దాలకు పైగా ప్రపంచంలో ఈ మహమ్మారి కొనసాగే అవకాశాలు ఉంటాయని పిఐ ఒక ప్రకటనలో తెలిపింది. మహమ్మారిని పూర్తిగా నిరోధించేందుకు ఉత్పత్తిని, పంపిణీని వేగవంతం చేయటానికి అయిదు కీలక విభాగాలపై దృష్టిని కేంద్రీకరించాలని ఈ అయిదు లాటిన్‌ అమెరికా దేశాలు నిర్ణయించాయి. టీకా సాంకేతికతలో పారదర్శక భాగస్వామ్యం, కొవిడ్‌ టీకాలు అందుబాటులో ఉండేలాగా ధరల నిర్ణయం, స్వదేశీ వినియోగానికి ఆమోదం తెలిపే రెగ్యులేటరీ వ్యవస్థలో భాగస్వామ్యం, టీకాలువైద్య పరికరాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిసికట్టుగా పెంపొందించటం, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రోత్సహించే బడా ఔషధ ఉత్పత్తిపై పెత్తనం చెలాయించే వ్యవస్థను ఒక్కటై తిరస్కరించటం. ఈ మేరకు కుదిరిన ఒప్పందం సంతోషం కలిగిస్తుందని ఈ సమావేశ సమన్వయ కర్త వర్ష గండికోట నెల్లుటియ వ్యాఖ్యానించారు. మన మనుగడనే ప్రశ్నిస్తున్న టీకా వివక్షను అధిగమించేందుకు ద్విగుణీకృత కృషి చేయాలన్నారు. ఇందులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగాలని కోరారు.
జాతీయత నుండి అంతర్జాతీయతకు, పోటీ నుండి సహకారానికి, దాతృత్వం నుండి సంఫీుభావానికి ప్రభుత్వాలు, సంస్థలు, కంపెనీలు, ప్రజలు నిరంతర కృషి చేయాలని వర్ష పిలుపునిచ్చారు. చైనా, రష్యాలు టీకాను అంతర్జాతీయతగా మలచటంలో ముందున్నాయని, ఈ దేశాలు లైసెన్సులను , సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు కూడ అందించాయని ఈ సమావేశ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కృషిలో చైనా భాగస్వామి అయితే హర్షించి ఆహ్వానం పలకాలని పిఐ కోరుతున్నది. ఈ నిర్ణయాలు వాస్తవ రూపం దాల్చేందుకు శాండర్స్‌ ఫౌండేషన్‌ విస్తృతంగా సమావేశాలు జరిపి వివిధ తరగతులతో చర్చించనున్నది. అమెరికా సుదీర్ఘకాలంగా దిగ్బంధం చేసినప్పటికీ క్యూబా టీకాల ఉత్పత్తిలో ప్రశంసనీయమైన కృషి చేసిందని సమావేశం హర్షం తెలిపింది. అనేక ఆఫ్రికా దేశాలకు క్యూబా ఆరోగ్య రంగంలో ఎంతగానో సహాయం చేసింది. వియత్నాంకి తాము ఉత్పత్తి చేసిన అబ్డాలా టీకాను సరఫరా చేస్తున్నట్టు క్యూబా తెలిపింది. వియత్నాం సొంతంగా నాలుగు రకాల టీకాలను తయారుచేసింది. క్యూబా తయారుచేసిన టీకా మనుషులపై మూడు దశల ప్రయోగాలలో విజయవంతం పొందింది. మూడోదశలో 19`80 ఏళ్ల వయస్కులైన 48వేల మందిపై ప్రయోగం చేసినట్లు క్యూబా ఆరోగ్యమంత్రి జోస్‌ఎంజెల్‌పోర్టల్‌మిరిండా తెలిపారు. పదికోట్ల అబ్డాలా టీకాలను ఒక ఏడాదిలో ఉత్పత్తి చేయగలమని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img