Friday, April 26, 2024
Friday, April 26, 2024

నూనె గింజల ఉత్పత్తి పెంపే పరిష్కారం!

బొల్లిముంత సాంబశివరావు

దేశంలో నిత్యావసర సరుకులతో పాటు వంట నూనెల ధరలు నిరంతర పెరుగుదల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు భరించలేని భారంగా మారింది. ప్రపంచంలో అమెరికా తర్వాత 39.46 కోట్ల సేద్యపు భూములు భారతదేశంలో ఉన్నాయి. బ్రిటిష్‌ వలస పాలనలో దేశం నుండి వంట నూనెలు విదేశాలకు ఎగుమతులు జరిగేవి. దేశీయ పాలకులు ఎగుమతి నుంచి దిగుమతికి దేశాన్ని మార్చారు. దిగుమతుల కోసం 75 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చుపెడుతున్నారు. పంటల ఉత్పత్తిలో పాలకులు అనుసరిస్తున్న విధానాల వలన వాటి సమతుల్యత దెబ్బతిన్నది. 1980 వరకు ధాన్యంతో పాటు మినుము, పెసర, కంది, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, ఆముదం మొదలైన పంటలు రైతాంగం పండిరచే వారు. ఈ పంటల్లో కొంత భాగం అట్టిపెట్టుకొని కుటుంబ అవసరాలకు వాడుకునేవారు. వేరుశనగ, నువ్వులు, ఆముదం గానుగ పట్టించి వినియోగించేవారు. ఆహారానికి సంబంధించిన పప్పులను, నూనెలను స్వయంగా సమకూర్చుకోవటం వలన మార్కెట్లో వాటి కొనుగోళ్లు చాలా తక్కువగా ఉండి ధరలు అందుబాటులో ఉండేవి. అపరాలు, నూనె గింజల సాగు గణనీయంగా పడిపోయి దిగుమతులు చేసుకోవాల్సిన పరి స్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నూనెల దిగుమతి వూహించని విధంగా పెరిగింది. దిగుమతితో పాటు ధరల పెరుగుదల ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 2.67 కోట్ల హెక్టార్లలో నూనె గింజల పంటలు సాగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, సాంకేతిక పరిజ్ఞానం, పంటలకు న్యాయమైన ధరలు, మార్కెట్‌ సౌకర్యం కల్పించడంలో పాలకుల వైఫల్యం వలన నూనె గింజల సాగు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మేలు రకం విత్తనాలు అందకపోవడం వలన దిగుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. బ్రెజిల్‌ దేశంలో సోయా చిక్కుడు హెక్టారుకు 2.80 టన్నులు ఉంటే భారతదేశంలో 1.13 టన్నులు మాత్రమే. అమెరికాలో వేరుశనగ పంట హెక్టారుకు 3.80 టన్నులు ఉంటే, భారతదేశంలో 1.13 టన్నులు మాత్రమే. ఫ్రాన్స్‌లో పొద్దుతిరుగుడు పంట 2.41 టన్నుల సగటు దిగుబడి ఉంటే, భారతదేశంలో అందులో మూడవ వంతు కూడా లేదు. ఈ పంట ప్రపంచ సగటు 1.5 టన్నులు ఉంటే, భారతదేశంలో 710 కిలోలు మాత్రమే.
రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం సాంప్రదాయ నూనె గింజల రైతులకు కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. 1986లో నూనె విత్తనాల సాంకేతిక పరిజ్ఞాన కార్యక్రమము (ఆయిల్‌ సీడ్స్‌ టెక్నాలజీ మిషన్‌ ) చేపట్టి, ఆ పథకం ద్వారా రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాలు, ఎరువులు, డ్రిప్‌ స్పెక్లర్‌ వంటి పరికరాలు అందించడంతో పాటు రైతులకు అనుకూలమైన ధర లభించేలా చేసింది. ఈ కొద్దిపాటి ప్రోత్సాహంతోనే దేశంలోనూ, రాష్ట్రంలోనూ నూనె గింజల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 1985లో దేశంలో నూనె గింజల ఉత్పత్తి 10.83 మిలియన్ల టన్నులు ఉండగా 1987 నాటికి 24.35 మిలియన్‌ టన్నులకు పెరిగింది. ఫలితంగా నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి బాటలో పయనిస్తూ నూనెల దిగుమతి నామమాత్రానికే పరిమితమైంది. ఈ ప్రోత్సాహకం కొనసాగి ఉంటే నేడు నూనెల దిగుమతి అవసరం ఉండేది కాదు.
నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పేరుతో ఆయిల్‌ ఫాం పంట సాగు పెంపు ప్రమాదకరమైంది. దీన్ని పెంచాల్సిన అవసరం కూడా లేదు. దేశంలో సాంప్రదాయ నూనె గింజల పంటలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే రైతులు నూనె గింజల ఉత్పత్తిని ఎలా పెంచింది 1986లో రుజువైంది. మోదీ ప్రభుత్వం అలాంటి విధానం చేపట్టకుండా విదేశీ పంట ఆయిల్‌ ఫాం సాగును ప్రోత్సహించటం బహుళజాతి సంస్థల ప్రయోజనాలు కాపాడటానికే. మోదీ ప్రభుత్వ విధానాల వలన దేశంలో సాంప్రదాయ నూనె గింజల పంటలు కనుమరుగయ్యే ప్రమాదం వుంది. నూనెలకు పూర్తిగా విదేశాలపై ఆధారపడాలి. అందువలన మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ సాంప్రదాయ నూనె గింజల పంటలను రైతాంగం కాపాడుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img