Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

పుస్తకపఠనమే ఆయన జీవనం

చెన్నమనేని రాజేశ్వరరావు

‘‘మూర్తిగారూ, మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు?’’ ఈ ప్రశ్న ఇకమీదట నాకు వినపడదు. ఫోన్‌ చేసిన ప్రతిసారీ ఈ ప్రశ్న అడిగే చెన్నమనేని రాజేశ్వరరావు సోమ వారం రాత్రి పదిన్నర ప్రాంతంలో శాశ్వతంగా కన్నుమూశారు. రాజేశ్వరరావు మరణంతో తెలంగాణ సమాజం ఒక అరుదైన మేధావినీ, ఒక నిరంతర అధ్యయనశీలినీ, ఒక వరిష్ఠ పాత్రికేయుణ్ణీ కోల్పోయింది. వారానికి ఒకసారైనా ఫోన్‌ చేయకుండా ఉండేవారు కాదు. ఫోన్‌ చేసిన తర్వాత తక్షణ విషయం ప్రస్తావించి, ‘ఇప్పుడేం చదువుతున్నారు?’’ అని అడిగేవారు. రామచంద్రగుహా రచించిన ‘ఇండియా ఆఫ్టర్‌ గాంధీ’ తాజా ఎడిషన్‌ చదువుతున్నాను అని చెబితే ఆ పుస్తకం తాను కూడా కొన్నాననీ, కొన్ని పేజీలు చదివాననీ చెప్పడంతో పాటు ఆయన ఇటీవల చదివిన పుస్తకాలలో ఏవి బాగా నచ్చాయో, నేను తప్పనిసరిగా చదవవలసిన పుస్తకాలు ఏమిటో చెప్పేవారు. పుస్తకాల పురుగుకు పర్యాయపదం రాజేశ్వరరావు. మార్కెట్‌లోకి వచ్చిన ప్రతి మంచి పుస్తకం ఆయన దగ్గర ఉండాల్సిందే. ప్రస్తుతం చదువుతున్న పుస్తకం గురించి మాట్లాడుతూ అదే రచయిత లోగడ రచించిన గ్రంథాల గురించీ, అదే అంశంపైన ఇతర రచయితలు రాసిన పుస్తకాల గురించి సాధికారికంగా మాట్లాడేవారు. ప్రత్యక్షంగా కలిసినా, టెలిఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడినా ఆయనతో మాట్లాడటం ఒక ‘ఎడ్యుకేషన్‌.’
నాలుగేళ్ళ కిందట ఈ లోకం విడిచివెళ్ళిన విశాలాంధ్ర సంపాదకుడు, అద్భుతమైన మేధావి, తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలపైన అధికారం కలిగిన చక్రవర్తుల రాఘవాచారికి రాజేశ్వరరావు ప్రియమిత్రుడు, వియ్యంకుడు. అంజలి ఘటించడానికి వచ్చిన వెల్చేరు కొండలరావు అన్నట్టు రాఘవాచారి పోయిన తర్వాత రాజేశ్వరరావులో జోష్‌ తగ్గింది. ఇదివరకటి కళ, ఉత్సాహం, ఒరవడి లేవు. రోజులు వెళ్ళదీస్తున్నారు. హెచ్‌ఎం టీవీ వెళ్ళిరావడం పనిగా పెట్టుకొని పుస్తకాలతో, స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నారు. ఇటీవల కాళ్ళకి పెడిక్యూర్‌ చేయించుకోవడంతో మొదలైన సమస్య ప్రాణంతీసేదాకా వదిలిపెట్టలేదు. ఆ మసాజ్‌వల్ల కాళ్ళు వాచాయి. రక్తప్రసరణలో అంతరాయం వచ్చింది. ఆస్పత్రికి వెళ్ళి వైద్యం చేయించుకొని, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సమస్య వచ్చింది. ఎక్కువకాలం తాను కష్టపడకుండా,తనవారిని కష్టపెట్టకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ధన్యజీవి. హైదరాబాద్‌ పంజగుట్టలో తొలి జర్నలిస్టు కాలనీలో రాఘవాచారి, రాజేశ్వరరావు ఇరుగుపొరుగున ఉండేవారు. వారిద్దరి మధ్యా అనుబంధం పెనవేసుకుంది. పరస్పరం అభిమానించు కున్నారు. గౌరవించుకున్నారు. రాఘవాచారి భార్య జ్యోత్స్నకూ, రాజేశ్వర రావు అర్ధాంగి అంజలికీ మధ్య, రెండు కుటుంబాల మధ్య గాఢ మైన స్నేహంకుదిరింది. రాజేశ్వరరావుకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. రాఘవాచారికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె విజయవాడలో ఉండగా స్కూటర్‌ ప్రమాదంలో మరణించింది. పెద్ద కుమార్తి అనుపమ వైద్యురాలు. రాజేశ్వరరావు రెండో కొడుకు సంజయ్‌ డాక్టర్‌ అనుపమను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. జ్యోత్స్న ద్వారానే రాజేశ్వరరావు మరణవార్త నాకు తెలిసింది. చాలామంది ప్రముఖులు రాజేశ్వరరావుకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి.
ఎనభైమూడేళ్ళకిందట 1939లో మాధవరావు, చిలకమ్మ దంపతులకు కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో వెదిర గ్రామంలో పుట్టిన రాజేశ్వరరావు ముగ్గురు అన్నదమ్ములలో మధ్యముడు. పట్టభద్రులైన తర్వాత రాజేశ్వరరావు మాజీమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు వీ.బీ.రాజు ఆధ్వర్యంలో నడిచే ఆంగ్లదిన పత్రిక డెయిలీన్యూస్‌లో విలేకరిగా 1963లో చేరి జర్నలిజం ప్రస్థానం ఆరంభించారు (ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అక్కడ సహోద్యోగి). అదే సంవత్సరం మేనమామ కుమార్తె అంజలిని ప్రేమించి నిరాడంబరంగా గుడిలో పెళ్ళి చేసుకున్నారు. తర్వాత ఆంధ్రపత్రిక దిల్లీ విలేఖరిగా 1965 నుండి 1982 వరకూ పనిచేశారు. అంతవరకూ తెలుగు పత్రికలకు దిల్లీలో ప్రత్యేకంగా విలేకరులు ఉండేవారు కాదు. పీటీఐ, యూఎన్‌ఐ వార్తాసంస్థలు పంపిన వార్తలే శరణ్యం. ఇంగ్లీషు పత్రికలకు పనిచేసే విలేకరులే అడపాతడపా వార్తలూ, వ్యాఖ్యలూ రాసి తెలుగు పత్రికలకు పంపేవారు. ఒక తెలుగు పత్రికకు వార్తలు రాయడంకోసం ప్రత్యేకంగా దిల్లీలో నియుక్తుడైన తొలి పాత్రికేయుడు రాజేశ్వరరావు. ఆ తర్వాత రామకృష్ణ (ఆంధ్రజ్యోతి), ఆదిరాజు వెంకటేశ్వరరావు ఉదయం) వంటి పాత్రికేయులు దిల్లీ కేంద్రంగా పని చేశారు. అనంతరం తెలుగు పత్రికలకు దిల్లీలో బ్యూరోలే వెలిశాయి. రాఘవాచారి కూడా విశాలాంధ్ర సంపాదకుడుగా చేరడానికి ముందు దిల్లీలో వామపక్ష భావాలు కలిగిన ఇంగ్లీషు పత్రిక ‘పేట్రియట్‌’కు విలేకరిగా పనిచేశారు. దిల్లీ నుంచి వచ్చిన తర్వాత రాజేశ్వర రావు రాష్ట్ర విద్యున్మండలి (ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు-ఏపీఎస్‌ఇబీ)లో అధికారిగా 1982 నుంచి 83 వరకూ పనిచేశారు. ‘ఉదయం’లో ప్రత్యేక ప్రతినిధిగా 1984 నుంచి 90 వరకూ పనిచేశారు.
జర్నలిస్టుగా ముక్కుకు సూటిగా వ్యవహరించేవారు. సత్యనిష్ఠ పాటించే వారు. రాజీపడే మనిషికాదు. ఆ క్రమంలో యాజమాన్యానికి ఇబ్బంది కలిగిందని భావించి రాజీనామా చేశారు. ఎనభైఏళ్ళు దాటిన తర్వాత కూడా బోయినపల్లి నివాసంలోనూ, జూబిలీహిల్స్‌లోని హెచ్‌ఎం టీవీ కార్యాలయంలోనూ చుట్టూ పుస్తకాలు పెట్టుకొని చదువుతూ కనిపించే వారు. తాజా పరిణామాలపైన వ్యాఖ్యానించేవారు. సమాజం గురించీ, మనుషుల ప్రవర్తన గురించీ, విలువల గురించే ఆయన తాపత్రయం. సమాజం నుంచి ఏమీ ఆశించకుండా హితవు కోరే అసలైన మేధావి. అనేక పదునైన వ్యాసాలు రచించి, వివిధ పత్రికలలో ప్రచురించిన రాజేశ్వరరావు లేని లోటు తీరనిది. ఇద్దరు మిత్రులు రాఘవాచారి, రాజేశ్వరరావులు నాలుగేళ్ళ వ్యవధిలో ఈ లోకం విడిచిపెట్టి పోవడం విషాదం.
కొండుభట్ల రామచంద్రమూర్తి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img