Friday, April 26, 2024
Friday, April 26, 2024

బీజేపీ విషానికి విరుగుడు లెఫ్ట్‌`కాంగ్రెస్‌ జోడీనే!

ఆషిస్‌ బిశ్వాస్‌
దేశవాప్తంగా ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ హవానే కనిపిస్తోంది. ఆ పార్టీ దూకుడుకు కళ్ళెం వేయాలని చిన్నాచితకా పార్టీలన్నీ వెంపర్లాడు తున్నాయి కానీ అన్నీ ఒక్కటయ్యేందుకు మాత్రం వెనకాడుతున్నాయి. ఆ లోపమే బీజేపీకి మరింతగా కలసి వస్తోంది. ఒక్కో అడుగూ ముందుకేస్తూ దేశాన్నంతటినీ కబళించేయాలని చూస్తోంది. మతోన్మాదాన్ని మోసుకొస్తున్న, ప్రజా సమస్యలను పెంచేస్తున్న ప్రమాదకరమైన బీజేపీని అడ్డుకోవాలన్నా, ఈ విషానికి విరుగుడు కుదరాలన్నా అందుకు ఉన్న ఏకైక మార్గం వామపక్షాలుకాంగెస్‌ పార్టీ జోడీ కట్టడమే. ఇవి ఐక్యంగా కలిసి ముందుకు సాగాల్సిందే. త్రిపురలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలు చెబుతున్న పాఠం ఇదే. బీజేపీ ఎంతగా విస్తరిస్తున్నా ఇప్పటికీ దానిని అడ్డుకోగలిగిన శక్తి వామపక్షాలుకాంగ్రెస్‌ కూటమికే ఉందని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నది విశ్లేషకుల విశదీకరణ.
త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది కానీ అది సునాయాస విజయం కాదు, ఆపసోపాల గెలుపే. ఇందుకు కారణం ఇక్కడ వామపక్షం, కాంగ్రెస్‌ కలసికట్టుగా (అవగాహనతో) ఉండడమే. ఈ పార్టీల ఓట్లు బీజేపీ ఓట్ల శాతాన్ని తగ్గించాయన్నది నిశిత పరిశీలనలో తేలిన వాస్తవం. ఈ ఎన్నికల్లో బీజేపీకి దీటుగా పోటీ చేసిన పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పూర్తిగా చతికిలపడిపోయింది. జాతీయ రాజకీయాల్లోనూ బీజేపీని ఎదుర్కొనేది తామేనంటూ ఇటీవల కాలంలో హల్‌చల్‌ చేస్తున్న ఈ పార్టీ త్రిపుర ఉప ఎన్నికల్లో మాత్రం తన సత్తా ఏ మాత్రం చూపించలేకపోయింది. టీఎంసీ రాజకీయ తప్పిదాన్ని ఈ ఎన్నికల ఫలితాలు ఎత్తి చూపించాయి. టీఎంసీ అభ్యర్థులకు అసలు డిపాజిట్లే దక్కకపోవడం ఆ పార్టీకి అవమాన కరమే. అయినప్పటికీ ఏ మాత్రం జంకూగొంకూ లేకుండా ఈ పార్టీ అగ్ర నాయకులు ఆత్మవిశ్వాసంతో బీజేపీకి సవాళ్ళు విసురడం విశేషం. ఈ ఎన్ని కల ఫలితాలను చూసి మురిసిపోనక్కరలేదని బీజేపీని హెచ్చరించారు కూడా.
అంతర్గతంగా చూస్తే ఈ ఎన్నికల చేదు ఫలితాలు పశ్చిమబెంగాల్‌లోని టీఎంసీ సీనియర్‌ నాయకులకు కంట్లో నలుసులా వేధిస్తున్నాయి. పార్టీలో రెండో స్థాయి నాయకుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ నుండి నేరుగా చీవాట్లు ఎదుర్కొంటున్నారు. త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం నాలుగు స్థానాల్లోనూ బరిలోకి దిగిన టీఎంసీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన అభిషేక్‌ బెనర్జీ నేతృత్వంలో ముమ్మరంగా ప్రచారం సాగించింది. ఫిర్హాద్‌ హకీమ్‌, మనాస్‌ భుయాన్‌, సయోనీ ఘోష్‌ లాంటి ప్రముఖులను ప్రచారానికి తీసుకొచ్చింది. స్థానికంగా పార్టీలో పట్టున్న వ్యక్తిగా బెంగాల్‌ మాజీ మంత్రి రజీబ్‌ బెనర్జీ అగర్తలలో గత కొన్ని నెలలుగా ప్రచారం సాగించారు. అయినా త్రిపుర ఎన్నికల ఫలితాలు తిరగబడ్డాయి.
ఈ ఎన్నికల్లో ఒక సీటు కూడా సాధించుకోలేని టీఎంసీకి వచ్చిన ఓట్ల శాతమూ అతి తక్కువే, కేవలం 2.72 శాతం. పార్టీ తరపున పోటీ చేసిన నలుగురు అభ్యర్థుల్లో ఇద్దరికి వెయ్యి ఓట్లు రావడమే కష్టమైపోయింది. బీజేపీకి 45.73 శాతం ఓట్లు రాగా సీపీఎంకి 20.76 శాతం, కాంగ్రెస్‌కి 24.80 శాతం, ఫార్వర్డ్‌ బ్లాక్‌కి 2.46 శాతం ఓట్లు లభించాయి. అగర్తల నుండి పోటీ చేసిన పన్నా దేవ్‌ని ఈ ఓటమిపై అడిగిన ప్రశ్నకు ఆయన ‘నో కామెంట్‌’ అని తప్పించుకున్నారు. అభిషేక్‌ బెనర్జీ, అతని అనుచరులు మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఠీవిగానే మాట్లాడుతున్నారు. బీజేపీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. బహుశా… ఎంతటి సంక్లిష్ట సమయంలోనైనా సడలని ఆత్మ విశ్వాసంతో వ్యవహరించే తమ నాయకురాలు మమతా బెనర్జీనే అనుసరిస్తు న్నారు కాబోలు! తమ పార్టీ ఓటమి గురించి అసలు ఊసెత్తని ఈ నాయకులు త్రిపురలో పాలక బీజేపీ భయోత్పాతంతో కూడిన ప్రచారాన్ని సాగించిందని, రాష్ట్ర పోలీసులూ పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆరోపించారు. అయినా భయపడేదేమీ లేదని త్రిపురలో బీజేపీని ఓడిరచే పోరాటం కొనసాగు తుందని అభిషేక్‌ బెనర్జీ ప్రకటించారు. ఇక్కడ నాలుగు స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మూడు సీట్లను గెలుచుకుంది. కొత్త ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా తిరిగి ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది.
టీఎంసీ ఎందుకు ఓడిరది?
ఇంతకుముందు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఎంసీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఆ స్థానమూ లేదు. అప్పుడు గెలిచిన టీఎంసీ అభ్యర్థి తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఇక్కడ విషయమేమంటే మున్సిపల్‌ ఎన్ని కల్లో తల ఎత్తుకునేలా దాదాపుగా 23 శాతం ఓట్లను గెలుచుకున్న టీఎంసీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో తలవంచుకునేలా అత్యల్పంగా 2.7 శాతం ఓట్లకు ఎందుకు పడిపోయింది? కొన్ని నెలల వ్యవధిలోనే ఎందుకింత మార్పు వచ్చింది? తక్షణం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి.
వీటిపై మమతా బెనర్జీ, టీఎంసీ నాయకులు ఎవరూ నోరు మెదపడం లేదు కానీ త్రిపురలో విశ్లేషకులు మాత్రం ఇప్పటికే వివరణనిచ్చారు. ఇక్కడ కీలకమైన వ్యక్తి స్థానికంగా ప్రముఖుడు, మాజీ బీజేపీ నాయకుడు సుదీప్‌ రాయ్‌ బర్మన్‌. ఇప్పుడు (ఉప ఎన్నికల్లో) ఇతను కాంగ్రెస్‌ టిక్కెట్‌ మీద బార్డోవాలి స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించాడు. తాను ప్రతిష్ఠా త్మకంగా తీసుకున్న ఈ పోరులో ముమ్మర ప్రచారం చేయనప్పటికీ తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై మంచి మెజారిటీనే సాధించారు. చెప్పుకోవలసిన అంశమే మంటే బీజేపీలో కొంతకాలం అసమ్మతివాదిగా ఉన్న రాయ్‌ మున్సిపల్‌ ఎన్నికల సమయంలో టీఎంసీ ప్రచారానికి సాయమందించారు. ఆయా ప్రాంతాలు, అక్కడ ఎదురయ్యే సమస్యలు, స్థానిక రాజకీయాల మతలబులు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల బలాబలాలు, గుట్టుమట్లు తదితరాలన్నింటి గురించి మున్సిపల్‌ ఎన్నికల సమయంలో రాయ్‌ టీఎంసీకి విలువైన సమాచారాన్ని అందించారు. రాయ్‌ సలహాలు, సూచనలతో టీఎంసీ మున్సి పల్‌ ఎన్నికల్లో స్థానికంగా ఉండే సెంటిమెంట్లు, భావోద్వేగాలకు అనుగుణంగా ప్రచారం సాగించి తన బలాన్ని కొంతైనా పెంచుకోగలిగింది.
ఉప ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారింది. రాయ్‌ బర్మన్‌ బీజేపీ నుండి కాంగ్రెస్‌లోకి వచ్చారు. టీఎంసీని విడిచిపెట్టేశారు. టీఎంసీలో కాకుండా పాత పార్టీ కాంగ్రెస్‌లో చేరేందుకే తాను ఎందుకు ప్రాధాన్యత నిచ్చానంటే…వామపక్షపార్టీలు, కాంగ్రెస్‌ లాంటి లౌకికవాద పార్టీల ఓట్లు చీలిపోయేలా చేసే తన వ్యూహాలతో టీఎంసీ, బీజేపీకే సాయమందించడం వల్లేనని అగర్తలలో మీడియాకు రాయ్‌ వివరించారు. బీజేపీ అవినీతి, దుష్పరిపాలనకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
దీనినిబట్టి అర్థమయ్యేదేమంటే, ఉప ఎన్నికలకు ముందు చేసిన ప్రచా రానికి టీఎంసీ కొద్ది నెలల ముందు మాదిరిగా రాయ్‌ బర్మన్‌ సాయాన్ని తీసు కోలేదు. ఈ రెండు ఎన్నికల ఫలితాల్లో ఎంత తేడా ఉందో అందరం చూశాం.
బీజేపీ విషయానికొస్తే నాలుగు స్థానాల్లోనూ గెలిచిన ఈ పార్టీకి ఓట్ల శాతం చూస్తే 50 శాతం కూడా లేదు. మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు దక్కించుకుంది. ఇందుకు కారణం కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల ఓట్లే. ఈ రెండిరటి సంయుక్త ఓట్ల శాతం బీజేపీ విజయాన్ని సంక్లిష్టం చేశాయి.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లోనూ బీజేపీని నిలువరించేందుకు, ఓడిరచేందుకు వామపక్ష/కాంగ్రెస్‌ కూటమికి అక్కరకొచ్చింది ఎన్నికల సర్దుబాటేనన్నది త్రిపురలో సుస్పష్టమైంది’’ అని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. దేశంలోనూ, వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు లౌకిక శక్తులు ఎంచుకోవలసని మార్గమిదే. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, వామపక్షాలు జాతీయస్థాయిలో ఒక్కటి కావాలి. ఇప్పటి నుండే ఈ పార్టీలు అవగాహనతో కలసి పనిచేస్తే వచ్చే ఏడాది (2023) ఈ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఈ కూటమి సవాల్‌ చేయగలదు, ఓడిరచగలదు, నిలువరించగలదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img