Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

12 గంటల పనిపై సమరశీల పోరు అవశ్యం

రావులపల్లి రవీంద్రనాధ్‌

మానవ జీవితంలో 8 గంటలు పని, 8 గంటలు ఆట పాట వినోదం, 8 గంటల విశ్రాంతి అవసరం. సరైన విశ్రాంతి మానసిక ఆనందం ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎంత శ్రమ అయినా చేస్తాడు. కాని పెట్టుబడిదారు మనిషిని యాంత్రికంగా మార్చి అదనపు లాభాలను ఆర్జించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రభుత్వాలు అందుకు చట్టపరంగా అండదండలిస్తాయి.
నేడు మోదీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను కార్పొరేట్‌ వర్గాలకు అనుకూలంగా మార్చింది. రెండు శతాబ్దాలుగా పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటాలు చేసి సాధించుకున్న 40కి పైగా ఉన్న కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చి జులై 1 నుంచి అమలు చేయనున్నది. కాని 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చి కార్మికుడిని యజమానికి బానిసగా తయారు చేస్తున్నది. కార్మికునికి 48 గంటలు అంటే 4 రోజులు మాత్రమే పని ఉంటుందని, అదనపు సౌకర్యాలు ఉంటాయని దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. కానీ 8 గంటలు పని విధానం పెట్టుబడిదారి వర్గం దయాదాక్షిణ్యాలపై వచ్చింది కాదన్న విషయాన్ని మోదీ ప్రభుత్వం విస్మరిస్తున్నది. పారిశ్రామిక విప్లవం వచ్చిన అనంతరం పెట్టుబడిదారుడు కార్మికుడిని యంత్రానికి బానిసను జేశాడు. ప్రధమంలో యంత్రాలపై కక్ష్య పెంచుకున్న కార్మికుడు వాటిని ధ్వంసం చేశాడు. క్రమంగా కార్మికోద్యమం ప్రారంభమై కార్మికునిలో చైతన్యం పెరిగిన తరువాత పెట్టుబడిదారి విధానంపై ఉద్యమించాడు. నియమిత పనికాలం లేకుండా కార్మికుడి చేత 16 గంటలకు పైగా పని చేయించుకునేవారు. దీనికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం మహత్తర పోరాటం జరిగింది.
ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర అనేక దేశాలలో సమరశీల కార్మికోద్యమాలు జరిగాయి. బ్రిటన్‌లో 1838 నుండి 1857 వరకు బాప్టిస్టు ఉద్యమం పేరిట కార్మికులు సుదీర్ఘ కాలం ఉద్యమం జేశారు. అమెరికాలోని చికాగోలో 1886లో మే 1న టెక్స్‌టైల్‌ పరిశ్రమలో పనిచేసే కార్మికులు 8 గంటలు పని విధానంతో పాటు కార్మిక వర్గాల హక్కుల కొరకు భారీ ప్రదర్శన జేశారు. దానిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. కాల్పులు జరిపారు. పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా తిరిగి మే 4న హే మార్కెట్‌లో గుమికూడిన కార్మికులపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురు కార్మికులను పొట్టనపెట్టుకున్నారు. మరో ఏడుగురిని అరెస్ట్‌ చేసి విచారణ జరిపి ఉరిశిక్ష వేశారు. 1887 లండన్‌లో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ చికాగో పోరాటం కార్మిక స్ఫూర్తిగా 1888 మే 1వ తేదీన మేడేగా గుర్తించి ఆనాటి నుండి అమలు చేస్తున్నారు. 8 గంటలు పని విధానం కొరకు కార్మిక పోరాటాలు పతాకస్థాయికి చేరడంతో తదనంతర కాలంలో ప్రపంచ వ్యాపితంగా అమలుకు వచ్చింది.
భారతదేశంలో బ్రిటీష్‌ వలస పాలనలో16 గంటల పని విధానం ఉంది. స్త్రీలు, పిల్లలు సైతం అమానవీయంగా దోపిడికి గురయ్యారు. దీనికి వ్యతి రేకంగా 1862లో హౌరాలో రైల్వే పోర్టు కార్మికులు 1200 మంది సమ్మె జేశారు. దీనికి మద్దతుగా బాంబే, మద్రాస్‌, కలకత్తా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 1942లో వైస్రాయ్‌ కౌన్సిల్‌లో లేబర్‌ మెంబర్‌గా ఉన్న బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 8 గంటలు పని విధానాన్ని ప్రతిపాదన జేశారు. అంతి మంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1948లో బ్రిటీష్‌ పాలకులు పెట్టినట్టే డిస్ఫ్యూట్‌ స్థానంలో ఇండస్ట్రియల్‌ డిస్ఫ్యూట్‌ చట్టాన్ని తీసుకువచ్చి 8 గంటల పని విధానానికి చట్టబద్దత కల్పించారు. పారిశ్రామికం రంగంలో శాస్త్ర సాంకేతిక విప్లవం వచ్చిన తరువాత పని పరిస్థితులు, పని కాలం, కార్మిక వర్గ హక్కులకు సంబంధించి కార్పొరేట్‌ వర్గాలకు అనుకూలంగా ప్రభుత్వం ఇష్టా రీతిన చట్టాలను మారుస్తూ వస్తున్నది. సెజ్‌ ప్రత్యేక ఆర్ధిక మండళ్లు ఏర్పాటు చేసి యూనియన్‌ ఏర్పాటు నుండి పనిగంటల వరకు చట్ట నిబంధనలన్నింటిని గాలికొదిలేశారు. తక్కువ వేతనాలు, పనిగంటలు పెంపు చేసి మహిళలను ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారు. ఇదేమిటని నోరెత్తినా, యూనియన్‌ ఏర్పాటు చేసినా బతుకుతెరువు కోల్పోవాల్సిందే.
ప్రపంచీకరణ ఆర్ధిక విధానాలలో భాగంగా 1990 తరువాత ప్రైవేటీకరణ విచ్చలవిడిగా చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశాభివృద్ధికి తోడ్పడిన ప్రభుత్వరంగ పరిశ్రమలన్నింటిని గత కాంగ్రెస్‌, నేటి బీజేపీ ప్రభుత్వాలు ఆదానీ లాంటి కార్పొరేట్‌ వ్యక్తులకు కారుచౌకగా ఇస్తున్నారు. ఫలితంగా పర్మినెంట్‌ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్‌ లేదా క్యాజువల్‌ శ్రామికులను నియమించు కుంటున్నారు. నేడు దేశవ్యాపితంగా 90 శాతంపైగా అసంఘటిత కార్మికులు న్నారు. సంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు నామమాత్రంగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే పారిశ్రామిక చట్టాలు ఏమాత్రం వీరికి వర్తించవు. పని భధ్రతకు హామీ లేని పరిస్థితుల్లో కార్మికుడు లేదా కూలి లేదా ఉద్యోగి యజమాని ధనదాహానికి, దాష్టీకానికి బలికాక తప్పదు. పాలకవర్గాలు, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌, ఉన్నతోద్యోగులు కార్పొరేట్‌ వర్గాలకు మద్దతిస్తాయి తప్ప కార్మికుడికి సహకరిస్తాయనుకోవడం భ్రమ. కార్మికులకు అండగా కార్మిక చట్టాలు కొంతమేర సహకరిస్తున్న సందర్భంలోనే పారిశ్రామిక యజమానులు వాటిని పక్కన పెడుతున్నప్పుడు చట్టాలే కార్మికునికి అనుకూలంగా లేనప్పుడు ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. వారానికి 48 గంటలు అంటే నాలుగు రోజులు పని చెప్పడం బాగానే ఉంది. మూడు రోజులు హాయిగా ఉండవచ్చన్న భ్రమ కొంతమందికి ఉండవచ్చు. కుటుంబ భారం, పిల్లల చదువులు, ఖర్చులతో సతమతమవుతున్న కార్మికులు, ఉద్యోగుల్లో వారానికి నాలుగు రోజులే కావచ్చు మానసికంగా, శారీరకంగా 12 గంటలు పని విధానం ఎంతో ఒత్తిడి కలిగిస్తుంది. కార్మికుడు ప్రతిరోజు కొంతసమయం భార్యా పిల్లలతోటి, వినోద కార్యక్రమాలలో కొంతసమయం గడిపినప్పుడే మనిషిలో మానసికోల్లాసం వస్తుంది. శక్తి వస్తుంది. యధావిధిగా పని చేయగలుగుతాడు.
అసలు ఈ చట్టాలు సక్రమంగా అమలు జరుగుతాయన్న గ్యారంటీ ఏమిటి? 4 కోడ్‌లలో యూనియన్‌ ఏర్పాటు చేసుకోవడంలోనే కార్మిక వ్యతిరేకత ఉంది. కార్మిక సంఘాల ఏర్పాటులోనే అనేక ఆంక్షలున్నప్పుడు పోరాట స్ఫూర్తి కలిగిన కార్మిక సంఘాలు ఎన్ని ఏర్పడతాయి? 60 సంవత్సరాలు దాటిన శ్రామికులకు ఈ చట్ట నిబంధనలు వర్తిస్తాయా? ఇవన్ని సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.
కాబట్టి ప్రభుత్వం తీసుకువచ్చే లేబర్‌ కోడ్‌లు, ప్రత్యేకించి 12 గంటల పని విధానం కార్పొరేట్‌ యజమానులకు అనుకూలం, కార్మికులకు వ్యతిరేకం. ప్రధానంగా వామపక్షాలు బలహీన పడటం. కార్మికోద్యమాలు చైతన్యవంతంగా, వర్గ దృక్పథంతో పోరాడలేకపోవడం మోదీ ప్రభుత్వానికి బలం చేకూరింది. అంతమాత్రాన ఏమీ చేయలేమన్న నిరాశకు లోనుకారాదు. సంవత్సరం పాటు జరిగిన రైతాంగ ఉద్యమం, 500 రోజులకు పైగా జరుగుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం, అమరావతి రాజధాని కొరకు జరుగుతుతున్న మహిళా ఉద్యమం కార్మికోద్యమానికి స్ఫూర్తినిస్తున్నాయి. బలమైన కార్మికోద్యమాన్ని నిర్మించడం ద్వారా మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ఓడిరచాలి.

వ్యాసరచయిత : ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img