Friday, April 26, 2024
Friday, April 26, 2024

యుద్ధ ప్రమాదంలో ప్రపంచ దేశాలు

బుడ్డిగ జమిందార్‌

స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో మంగళవారం (ఈ నెల 28వ తేదీ) నాటో సదస్సు ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకూ జరగనున్న ఈ సదస్సు నాటో మిలిటరీ కూటమి విస్తరణకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలను తీసుకోనుంది. ఐరోపాలో లక్షలాది నాటో సైనికులను పెంచనుంది. మరొకవైపు నాటో కూటమిని మొదటిసారిగా ఆసియాపసిఫిక్‌ ప్రాంత దేశాలకు సభ్యత్వం ఇచ్చి విస్తరించే ప్రణాళికలు తయారవుతున్నాయి. ప్రస్తుతం యూరపులోనున్న 40 వేల నాటో సంసిద్ధత దళాలను ఒకేసారి 3 లక్షల వరకూ పెంచుతామని నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌బర్గ్‌ ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అన్నాడు. అలాగే లెక్కలేనన్ని యుద్ధ ట్యాంకు లను, విమానాలను రష్యా సరిహద్దుకు పంపిస్తామన్నాడు. రష్యాచైనాలతో నూతన వ్యూహాత్మక పోటీకి సంసిద్ధమై, ప్రతిస్పందిస్తామని స్టోల్టెన్‌బర్గ్‌ తెలియ జేసాడు. ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకొని రష్యాతో యుద్ధం చేస్తూ, శాంతి చర్చలకు ఒప్పుకోనివ్వకుండా యూరపు కల్లోలానికి కారణమైన నాటో కూటమి ప్రస్తుతం యూరపులో భారీగా మిలిటరీ మోహరింపునకు సన్నద్ధం అవుతూనే, ‘‘మా భద్రత, మా ఆసక్తులకు, విలువలకు చైనా విసిరే సవాళ్ళను స్వీకరించ టానికి ఆసియాపసిఫిక్‌ దేశాలకు కూడా నాటోను వ్యాప్తి చేస్తాం’’ అని నాటో ప్రధాన కార్యదర్శి ప్రకటించాడు. చైనా దగ్గరకు వెళ్ళటం మా విధానాల మార్పు అని చెప్పుకొచ్చాడు. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ రిపబ్లిక్కులయిన లాట్వియం, లిథూనియా, ఎస్టోనియా దేశాలు నాటో సభ్యత్వం తీసుకొన్నాయి. ప్రస్తుతం ఆయా దేశాల్లో ఉన్న సైనిక శిబిరాలకు బ్రిగేడ్‌ హోదా కల్పిస్తామని నాటో అంటోంది. ‘ఏ దేశాన్నైనా (రష్యాను) ఎదుర్కోటానికి (దాడి చేయటానికి) అమెరికా, ఫ్రాన్స్‌, యు.కె. వంటి పాశ్చాత్య నాటో దేశాలు మొత్తం యూరపులో 3 లక్షలకు మించి సైన్యం కల్గి ఉండి, ఆ దేశాల నౌకలు, యుద్ధ విమానాలతో సహా మూకుమ్మడి దాడిని గంటల వ్యవధిలో చేస్తాయని’ స్టోల్టెన్‌బర్గ్‌ రష్యాపై ఉసి గొల్పుతున్నాడు. గత ఎనిమిది సంవత్సరాలుగా నాటో మిలిటరీ ఖర్చును ఆ దేశాల జీడీపీ నుండి వెచ్చిస్తున్న 2 శాతాన్ని ఇంకా పై పైకి పెంచు తామంటున్నాడు. ఇదిలా ఉండగా అమెరికా యుద్ధ సామాగ్రిని ఉక్రెయిన్‌కు పంపిస్తూనే ఉంది. మధ్యతరగతి శ్రేణుల రాకెట్ల నుండి ఉన్నత శ్రేణుల క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించటానికి ప్రణాళికలు రూపొందించి, ఉక్రెయిన్‌ జ్వాలలకు ఆజ్యం పోస్తున్నది. అక్కడ ఎంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా తన దేశానిది కాదు కదా అని అమెరికా ఆలోచిస్తోంది. ఇటువంటి క్షిపణులతో పాటుగా క్షిపణుల రక్షణ వ్యవస్థ బ్యాటరీలను కూడా ఉక్రెయిన్‌లో మోహరించే ప్రయత్నంలో ఉంది. నాటో కూటమి రష్యాతో యుద్ధంలో పాల్గొనదని అధ్యక్షుడు బైడెన్‌ చాలాసార్లు చెప్పినా, ఆచరణలో ఉక్రెయిన్‌ మిలిటరీ ముసుగున అనేకమంది నాటో సైనికులు, సలహాదారులు, శిక్షణలు ఇచ్చే జనరల్స్‌ను ఉక్రెయిన్‌కు నాటో పంపింది. మరొకపక్క రష్యాకు చెందిన వందలాది వందల కోట్ల డాలర్లను విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటానికి కంకణం కట్టుకొన్న పశ్చిమదేశాలు 1918 తర్వాత మొదటిసారిగా రష్యా చెల్లించవల్సిన వాయిదాను తీర్చలేని స్థితికి తీసుకురాగలిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మోటుగా, మిలిటరీగా బలంతో ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా, దీనికి ప్రపంచ ప్రజాస్వామ్య విధానం అని పేరు పెట్టుకొని, ఎదురు తిరిగిన దేశాలపై ఆంక్షల ప్రభావం చూపుతున్నది. ఉక్రెయిన్‌లో యుద్ధంలో పాల్గొంటున్న నాటో ఇప్పటివరకూ విజయాలను సాధించలేకపోయింది. తూర్పు డోనబాస్‌ ప్రాంతమంతా రష్యా ఆధీనంలోకి రావటంతోపాటు, నల్ల సముద్ర తీర ప్రాంతాలు 90 శాతం రష్యా సేనలు ఆక్ర మించాయి. బలమైన అణ్వస్త్ర దేశమైన రష్యాను కాదని యూరపులో అమెరికా ఏమీ చేయలేని స్థితి. దీనికి తోడు వాణిజ్యపరంగా యించుమించు అగ్రగామిగా ఉన్న చైనాతో సహా అమెరికా మిత్రదేశాలు కయ్యానికి దిగుతున్నాయంటే వాటికున్న అభద్రతను సూచిస్తున్నది. అణుయుద్ధంలో విజేతలు ఉండరని తెల్సి కూడా యుద్ధాన్ని నాటో ప్రేరేపించటాన్ని ‘పెట్టుబడిదారుడు తనని ఉరి తీస్తాడని తెలిసి కూడా ఉరితాళ్ళను తయారు చేసి లాభాపేక్షకు అమ్మజూస్తాడని’ కార్ల్‌ మార్క్స్‌ అన్నట్లుగా ఉంది. యుద్ధ ప్రేరేపణతో లాభపడేది తాత్కాలికంగా యుద్ధ కంపెనీలు, కార్పొరేట్లు మాత్రమే. తీవ్రంగా నష్టపోయేది ప్రపంచ ప్రజలు. ముఖ్యంగా కార్మిక కర్షక సామాన్య ప్రజానీకం మాత్రమే. ఉక్రెయిన్‌ యుద్ధ ఫలితంగా యూరపు ఇంధన సమస్య తీవ్ర స్థాయికి చేరుకొంది. తొందరలోనే ప్రపంచ ఆర్థికమాంద్యం సంభవించవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాటో విస్తరణ ఏ పరిస్థితులకు దారి తీస్తుంది?. మాడ్రిడ్‌ నాటో సమావేశాల సందర్భంగా వేలాదిమంది ప్రజానీకం ‘నాటో వద్దు యుద్ధం వద్దు శాంతి కావాలి’ అని బ్యానర్లు చేబట్టి ప్రదర్శనలు చేశారు. స్పెయిన్‌లో అనేక నగరాల్లో కూడా ప్రదర్శనలు జరిగాయి. అమెరికా మిలిటరీ స్థావరాల్ని దేశంలో ఎత్తివేసి మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయండని నినాదాలు చేసారు. రష్యాఉక్రెయిన్‌ వివాదం ద్వారా నాటో యుద్ధ కూటమి ఐక్యంగా బయ టకు కనబడటానికి ప్రయత్నిస్తోంది. కానీ అంతరంగాన నాటో సభ్యదేశాల మధ్య లుకలుకలున్నాయి, చర్చల ద్వారా ఉక్రెయిన్‌ యుద్దాన్ని ఆపాలని ఒత్తిడి వస్తోంది. ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలను నాటోలో చేరకుండా టర్కీ అడ్డుకొంటోంది. యుద్ధ ఖర్చంతా సామాన్య ప్రజలకు చెందవల్సిన అవసరాలకు ఖర్చుపెట్టే జాతీయ బడ్జెట్టు నుండి తీసి ఖర్చు చేస్తున్నదే. తద్వారా ఆర్థిక ద్రవ్యోల్బణం పెరుగుతోంది. రికార్డు స్థాయిలో నిరుద్యోగం, ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు రానున్న చలి కాలంలో యూరపులోని నివాసాలు వేడి చేసుకోలేక గజగజ వణికే ప్రమాదముంది. కొనుగోలు శక్తి పడిపోయి, జీవన ప్రమాణాలు పడిపోతుంటే నాటో విస్తరణ ఉరితాళ్ళను అమ్మటానికేనన్నట్లుగా ఉంది.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం
నాయకులు, 9849491969.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img