Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బీసీలకు ఒరిగిందేమిటి?

డా. అఖిలమిత్ర

సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించడం లేదు. కులాల కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం ద్వారా ఆయా కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను కింది స్థాయిలో అర్థం చేసుకుని పరిష్కరించే అవకాశం కలుగు తుంది. మిగతా కులాలకు ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా, సంచార జాతుల కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీరుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటే ఈ కులాల్లో సమగ్ర అభివృద్ధికి పునాదులు పడతాయి. యాంత్రీకరణతో కార్పొరేట్‌ ప్రాబల్యం పెరిగిపోతోంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బతో కుల వృత్తులు,చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. కరోనా కల్లోలంతో దెబ్బతిన్న కుల వృత్తుల కుటుంబాలకు కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి చేయూత అందిస్తా మనే ప్రకటన కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దలనుంచి రావడంలేదు.

భారతదేశంలో ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసి లు) దీర్ఘకాలంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల సమూహం. భారత ప్రభుత్వం ఓబిసిలను ప్రత్యేక వర్గంగా గుర్తిస్తుంది, వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్‌వంటి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఓబిసిలు విద్య, రాజకీయాలు, వ్యాపారంలో సహా వివిధ రంగాలలో అణచివేతకు గురయ్యారు. విద్య, వైద్యం ఉపాధి రంగాలలో ప్రభుత్వాల చేయూత లేకపోవడంతో అప్పులపాలై జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. వారిలో డెబ్భై శాతం ఇప్పటికీ పేదరికంలో జీవిస్తున్నారు. స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవు. వివక్ష , హింసకు గురవుతున్నారు. కొన్ని ఓబిసి కమ్యూనిటీలు, సమూహాలు, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వంటి ఇతర వర్గాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నందున, నిర్ణయాత్మక విధానాల ప్రయోజనాలు కూడా సంవత్సరాలుగా పలుచనయ్యాయి. ఓబిసిల ఆందోళనలను పరిష్కరించడానికి రిజర్వేషన్‌లపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని ఓబీసీ కమ్యూనిటీలను రిజర్వేషన్‌ జాబితాలో చేర్చాలని, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని వాదిస్తున్నారు.
దేశంలో ఓబిసిల వివిధ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించి నప్పటికీ, అనేక సవాళ్లు మిగిలి ఉన్నాయి. ఎంతో ఆర్భాటంగా ఓబీసీల అభివృద్ధికోసం ఏర్పాటుచేసిన 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించి మూడు సంవత్సరాలవుతుంది. మొత్తం 139 బీసీ కులాలకు గాను ప్రస్తుతం 56 కార్పొరేషన్లు సృష్టించి 728 చైర్మన్‌, డైరెక్టర్ల పదవులను ఎవరి కులపరిధిలో వారికి ఇచ్చారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించగా ఛైర్మన్‌, డైరెక్టర్‌ పదవుల్లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి చాల జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. బడుగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ డైరెక్టర్ల ఎంపికలో అగ్ర వర్ణాలు ప్రధాన భూమిక పోషించారు. కులాల పుట్టుక, జీవన శైలి, సామాజిక స్థితిగతుల గురించి ఏమాత్రం తెలియనివారు కార్పొరేషన్ల క్రియాశీలక సభ్యులను ఏర్పాటుచేస్తే ఇలా అఘోరిస్తాయి. అగ్ర వర్ణానికి చెందిన వారిని మాత్రం రాష్ట్రంలో ఉన్న కీలకమైన పదవులను, సంపద లభించే పదవులను ఇచ్చుకోవడంతోపాటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, హైకోర్టు జిల్లా కోర్టుల జీపీలను, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, పారిశ్రామిక మౌలికసదుపాయాలు, సమాచార కమిషనర్ల, సలహాదారులుగా నియమించారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న శాఖలు, ఆదాయ వనరులున్న శాఖల నామినేటెడ్‌ పదవులు అగ్ర వర్ణానికి 720 పైగా ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, ప్రాజెక్టులు, స్కిల్‌డెవెలప్మెంట్‌, మీడియా, టెంపుల్‌ కమిటీలు, మార్కెట్‌ కమిటీలు, విశ్వవిద్యాలయాల పాలకమండలి సభ్యులు, రాయలసీమ, కోస్తా , ఉత్తరాంధ్ర ఇన్‌చార్జులు, స్థానికంగా ఉన్న రేషన్‌ షాపులు, ఆహార పంపిణీ, వంట ఏజెన్సీ, డిష్‌, కేబుల్‌ నెట్‌, రవాణా ఏజెన్సీ, కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్లు, డిసిసిబి, డిసిఎంఎస్‌ చైర్మన్లు అది ఇది అని కాదు లాభం వచ్చే అన్ని రంగాల్లో అగ్ర వర్ణం వారు తిష్టవేశారు. బీసీ కులాల అభివృద్ధికి పాటు పడుతున్నామని ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆచరణలో ఈ కులాల అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులను ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరిస్తోంది. సమాజం ఎప్పటికప్పుడు మారుతుంది. ప్రజల్లో కూడా దానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో యాంత్రీకరణ పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి.
ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలకూ విస్తరిస్తోంది. ఈ పరిణామ క్రమంలో కులవృత్తులు, చేతివృత్తులు తమ ఆస్థిత్వాన్ని కోల్పోతున్నాయి. ఇంతవరకు ఈ వృత్తులపైనే ఆధారపడిన కులాలు, వర్గాలకు యాంత్రీకరణ, కార్పొరేటీకరణ దక్కాలి. కానీ ప్రస్తుతం వ్యవస్థలో అలా జరగడం లేదు. స్టీల్‌, ఐరన్‌ పరిశ్రమలతో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాలు తమ వృత్తులను కోల్పోయాయి. ప్లాస్టిక్‌ పరిశ్రమ కారణంగా మేదరి, కుమ్మరివృత్తులు మరుగున పడ్డాయి. జేసీబీలు, హిటాచీ మెషిన్లతో వడ్డెర్ల బతుకులు ఆగమై కూలీలుగా మారారు. ట్రాక్టర్లు, మిల్లులు రావడంతో వడ్రంగి, కమ్మరి పని దెబ్బతింది. డ్రై క్లీనింగ్‌ షాపులువల్ల చాకలి, నేతమిల్లులు రావడంతో నేత వృత్తి, బ్యూటీపార్లర్లు, హేర్‌ కటింగ్‌ సెలూన్ల రాకతో నాయిబ్రాహ్మలు , రెడీమేడ్‌ దుస్తులతో దర్జీలు, జ్యూయెలరీ షాపులతో విశ్వ బ్రాహ్మణుల వృత్తులు దెబ్బతిన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతి దరఖాస్తుదారునికి సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు నాలుగేళ్లుగా కొత్త రుణాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి లక్షల మంది ఎదురు చూస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. కులాల సమస్యలపై అవగాహన ఉన్న వారు తమకు కావలిసినపథకాలను డిజైన్‌ చేయ గలరు, కానీ కార్పొరేషన్ల చైర్మన్‌, డైరెక్టర్ల నియామకం అస్తవ్యస్తంగా తమ చెప్పుచేతల్లో ఉన్న వారికి ఇచ్చారు.
సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించడం లేదు. కులాల కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం ద్వారా ఆయా కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను కింది స్థాయిలో అర్థం చేసుకుని పరిష్కరించే అవకాశం కలుగు తుంది. మిగతా కులాలకు ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా, సంచార జాతుల కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీరుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటే ఈ కులాల్లో సమగ్ర అభివృద్ధికి పునాదులు పడతాయి. యాంత్రీకరణతో కార్పొరేట్‌ ప్రాబల్యం పెరిగిపోతోంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బతో కుల వృత్తులు,చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. కరోనా కల్లోలంతో దెబ్బతిన్న కుల వృత్తుల కుటుంబాలకు కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి చేయూత అందిస్తా మనే ప్రకటన కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దలనుంచి రావడంలేదు. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇవ్వకపోగా..బీసీలకు రూ.లక్ష- రూ.2 లక్షల రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదు. కానీ, బడా కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల రుణాలు ఇస్తున్నారు. వారు వాటిని కట్టకపోతే మాఫీ చేస్తున్నారు. పేదలకు రుణాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా బ్యాంకులు తమ వైఖరి మార్చుకుని బీసీలకు సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలి. అందుకు బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి దరఖాస్తుదారుకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img