Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భీతిగొల్పుతున్న ఆర్థికసంక్షోభం

డా. సోమ మర్ల

అమెరికా, ఐరోపాల్లో బ్యాంకులు వరుసగా కుప్పకూలి పోతూ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడవచ్చునని భీతి చెందుతున్నారు. అమెరికాలో మొదట సిలికాన్‌ వ్యాలి బ్యాంకు (ఎస్‌వీబీ), ఆ తర్వాత సిగ్నేచర్‌ బ్యాంకు, క్రెడిట్‌సూయిస్‌లు, తాజాగా అతి పెద్ద యూరోపియన్‌ క్రెడిట్‌ డచ్‌ బ్యాంకు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అమెరికాలో ఇటీవల వడ్డీరేట్లు పెంచడంతో బ్యాంకుల్లో ఆర్థికసంక్షోభం తలెత్తింది. అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థ బీటలు వారడంతో 2008లో వలెనే ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధిలాగా ఆర్థిక సంక్షోభం రావచ్చునన్న భయాందోళనలు విస్తరించాయి. 2008లో లేమన్‌బ్రదర్స్‌ ఆర్థికంగా నిలువులోతుల్లో కూరుకుపోయింది. దీని పర్యావసనాలు త్వరలో భారత ఆర్థికవ్యవస్థపైన ప్రభావం చూపనున్నాయి. గత దశాబ్దికాలంలో ఉత్పాదరహిత ద్రవ్య ఆర్థిక పెట్టుబడులు నిల్వఉండటంవల్ల ఆర్థిక నియమాలను ఉల్లంఘించి పరిమితికిమించి నోట్లను ముద్రించడం నేడు ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వ్యవస్థ వడ్డీరేట్లను దాదాపు వడ్డీలేని స్థాయికి తగ్గించింది. ప్రజలు తమ వద్దగల అదనపు డబ్బును ఎస్‌వీబీ లాంటి చిన్న, మధ్యతరహా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు. ఫలితంగా అమెరికా బ్యాంకుల్లో డిపాజిట్లు 13 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 18 ట్రిలియన్‌ డాలర్లకు అపారంగా పెరిగాయి. రుణాలు తీసుకొని పరిశ్రమలద్వారా ఉత్పత్తి పెంచేవారు తగ్గడంతో చిన్న, మధ్య తరహా బ్యాంక్‌లు, స్టార్టప్‌లు, క్రిప్టో కరెన్సీలు, కొనుగోళ్లకు అప్పులిచ్చాయి. మిగులుగాఉన్న డబ్బుతో అమెరికా ఫెడరల్‌ సెక్యూరిటీ బాండ్లను కొనుగోలు చేశాయి. ప్రభుత్వం జారీచేసే బాండ్‌ రుణానికి హామీగా ఉంటుంది. నిధుల వ్యయానికి, కర్తవ్యాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం పెరుగుదలను నిలు వరించేందుకు ఫెడరల్‌ బ్యాంకు వడ్డీరేట్లను పెంచింది. ఫలితంగా బాండ్ల విలువ పడిపోయింది. ఫెడరల్‌ వడ్డీరేట్లు పెరగడంలో ఎస్‌విబి బాండ్ల విలువ మార్కెట్‌లో తగ్గిపోయింది. ప్రతి 25 బేసిక్‌ పాయింట్లు లేదా 0.25శాతం పాయింట్ల ఆధారంగా బాండ్ల విలువ బిలియన్‌ డాలర్లు పడిపోయింది. ఫెడరల్‌ ఫండ్స్‌ రేటు ఇప్పుడు 450 బేసిక్‌ పాయింట్లకు పెంచారు. ఎస్‌విబి కుప్పకూలిన తర్వాత ప్రస్తుతం బ్యాంకు కేవలం 42 బిలియన్‌ డాలర్లపై నడుస్తున్నది. దీనితో ఎస్‌విబి తర్వాత సిగ్నేచర్‌, సూయిజ్‌ క్రెడిట్‌, ప్రపంచవ్యాప్తంగా ఇతర బ్యాంకులు సంక్షోభంలో పడిపోయాయి.
ఫెడరల్‌ బాండ్లకు అమెరికా యుద్ధపరిశ్రమలో వాటి ఆర్థిక పెట్టుబడులకు మధ్య సహజమైన అవినాభావ సంబంధం ఉంది. ఇటీవలికాలంలో జరుగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధంలాంటి ‘‘యుద్ధక్రీడల్లో’’ ఫెడరల్‌ బాండ్ల రూపంలో పెట్టుబడులు పెరిగాయి. ప్రస్తుతం బుడగపేలిపోయింది. స్టార్టప్‌లు ఆగిపోతున్నాయి. కొనసాగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధానికి అనేక బిలియన్‌ డాలర్లు సహాయం చేసేందుకు ఫెడరల్‌ బాండ్లను వినియోగించు కుంటున్నారు. ఇది ప్రస్తుత బ్యాంకుల సంక్షోభానికి దారితీసింది. ఉత్పాదకరంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సమాజంలో సంపద పెరుగుతుంది కానీ ఆయుధాల ఉత్పత్తి ద్వారా, స్పెక్యులేషన్‌ లేదా స్టాక్‌ మార్కెట్ల ద్వారా సంపద పెరగదు. ఇవన్నీ ఉత్పాదకరహితమైనవి. సమాజంలో వీటికి విలువలేదు. ప్రస్తుతం అమెరికా ఆర్థికవ్యవస్థలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసేందుకు ఫెడరల్‌ వ్యవస్థ వడ్డీరేట్లను పెంచింది. ఫలితంగా బాండువిలువ పడిపోయింది. చిన్న, మధ్యతరహాబ్యాంకుల సంపద అపారంగా తగ్గిపోయింది. బ్యాంకులన్నీ కుప్పకూలి పోతాయన్న భయంతో డిపాజిట్‌దారులు తమ డబ్బును తీసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. డిపాజిట్‌ దారులకు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని దేశ అధ్యక్షుడు బైడెన్‌ హామీ ఇచ్చినప్పటికీ సంక్షోభం ఇంకా ముదురుతోంది. ప్రస్తుతం ఆందోళనకరమైనస్థాయిలో ఈ సంక్షోభం ఐరోపా బ్యాంకులకు విస్తరించింది.
భారత ఆర్థికవ్యవస్థపై ప్రభావం: భారత ఆర్‌బీఐ అమెరికాలో సెక్యూరిటీలలో పెట్టిన పెట్టుబడులు ఆగస్టులో 9.2 బిలియన్‌ డాలర్ల నుంచి 2022నాటికి 2021.2 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి(ఈటీఐజీ, డాటా, టీఓఐ, 2022, ఆగస్టు 24వ తేదీ). రిస్క్‌ తీసుకునేందుకు ఇష్టపడని విదేశీ పెట్టుబడి దారులు ప్రస్తుత ఆందోళన తెలిపే పరిస్థితుల్లో సురక్షిత మార్గాలను ఎంచుకుంటారు. మన దేశంలో ఎఫ్‌డీఐలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. మన స్టాక్‌ మార్కెట్లనుండి విదేశీ పెట్టుబడిదారులు పశ్చిమ దేశాల బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లిపోతారు. దీని ఫలితంగా మన రూపాయివిలువ మరింత పడిపోతుంది. సురక్షితమార్గాలకోసం చూసే ధనికులు బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. మనదేశ బంగారం మార్కెట్‌లో బంగారం ఖరీదు పెరుగుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆర్థికమాంద్యం తలెత్తవచ్చునన్న ఆందోళనతో ఎగుమతులు గణనీయంగా తగ్గిపోతాయి.
కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఎగుమతులే మన ఆర్థికవ్యవస్థను రక్షించాయి. అమెరికా దీర్ఘకాలం మాంద్యంలో పడిపోతే మనదేశంలో పరిస్థితి మరింత దిగజారవచ్చు. అమెరికాలో వడ్డీరేట్లను మరింతపెంచితే అంతిమంగా ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు గల అన్నిదేశాలకు ద్రవ్యోల్బణం విస్తరిస్తుంది. తద్వారా మన దేశంలోనూ ద్రవ్యోల్బణం ప్రస్తుతం ఉన్న 6.5శాతం నుంచి ఇంకా పెరుగుతుంది. 4శాతానికి తగ్గించాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్‌ మహామ్మారి ప్రభావం నుంచి మన ఆర్థికవ్యవస్థే ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దేశంలో ప్రైవేటు పెట్టుబడులు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. (ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నిరంతరం ప్రైవేటు పెట్ట్టుబడిదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తూనే ఉన్నారు). ఎగుమతులు తగ్గుతున్నాయి. దేశీయ డిమాండ్లు మరింత పడిపోతున్నాయి. అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఆందోళన ప్రకంపనాలు భారతదేశం సహా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక సంక్షోభం మరింత పెరగవచ్చు.
2008లో లేమన్‌ బ్రదర్స్‌ ఆర్థికపతనం కొనసాగించే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం. పెట్టుబడీదారీవర్గాలు ఒక దశ వరకు ఆర్థిక సంక్షోభం నుంచి బైటపడవేసేందుకు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఆ తరువాత ఈ సంక్షోభం ఇతర ప్రాంతాల్లో మరింత తీవ్రంగా కనిపించవచ్చు. ఉత్పాదక రహిత ఆర్థిక పెట్టుబడుల ప్రతికూల ప్రభావాలు ఈ అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కొనసాగుతున్న యుద్దక్రీడలకు నాటో దేశాలు, అమెరికా సామ్రాజ్యవాదులు సహాయం చేయడంవల్ల సామాన్యప్రజల బతుకులు మరింత దుర్భరమవుతాయి. కార్మికులు ఫ్రాన్స్‌, బ్రిటన్‌(రైల్వే,ఆరోగ్య, కార్మికుల సమ్మెలు) లలో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కార్మికవర్గ సంక్షేమంపై తీవ్రమైన దాడిని ప్రతిఘటించడమే నిరసనప్రదర్శనలు పెట్టుబడీదారీవ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో కార్మికులు తప్పనిసరిగా అపారంగా నష్ట పోతున్నారు. ప్రస్తుత బ్యాంకింగ్‌ సంక్షోభం నుంచి బైట పడేందుకు సామ్రాజ్యవాదులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శాంతికోసం ఎలుగెత్తుతున్న నినాదాలను వినిపించు కొని తక్షణం రష్యా`ఉక్రెయిన్‌, తైవాన్‌ తీరంలో జరుగుతున్న యుద్ధక్రీడలను నిలిపివేయాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img