Friday, April 26, 2024
Friday, April 26, 2024

హిందూ కాశీ తాలి బనారస్‌!

పురాణం శ్రీనివాస శాస్త్రి

కృష్ణుడికి మీసములుండెడివా? వెనకటికి ఓ సారి కొడవటిగంటి గారు ఒకానొక జ్యోతి మంత్లీ కృష్ణాష్టమి సంచికలో ప్రశ్నించారు. ఒకప్పుడు ఉండేవని చెప్పుకొచ్చారు. సింహం గెడ్డం గీసుకుంటుందా? గీసుకోదని చెప్పాడు ఓ తెలుగు హీరో ఓ సినిమాలో. తాను గీసుకోవడంతో వచ్చింది తేడా… లేప్పోతే సింహంలాంటోణ్ణి అని ప్రగల్భించాడు. ‘సింహానికి రాయడం వస్తేగానీ, వేటగాణ్ణి కీర్తించే కథలు ఆగవు’ అంటుంది ఓ ఆఫ్రికన్‌ సామెత. అంటే సింహం తన సహజ ప్రవృత్తిని కీర్తించేవాళ్ళని ఆపుతుంది. మొత్తానికి చదువు సహజ ప్రవృత్తిని, స్వభావాన్ని మార్చుతుందని ఒప్పుకోవాలి. చదువుకున్న వాళ్లు మారిపోతారు స్వభావ రీత్యా కాబట్టి చదువు వద్దు అనడం లేదు. ఆడవాళ్ళే చదువుకోవద్దు అనడం ఎలా రైటు? తాలిబన్‌లు స్త్రీ విద్యకు వ్యతిరేకం. అసలు స్త్రీ అనే పదాన్నే ద్వేషిస్తారు. పాటనీ, గాలి పటాన్నీ, బొమ్మనీ, శిల్పాన్నీ కూడా వారు ద్వేషిస్తూ అందుగురించి గొప్ప ఫీలవుతారు. మన సంఫీుయులు కూడా గాలిపటం, సంగీతం గురించి ఏమోగానీ స్త్రీలకి రోడ్డు మీద ఏం పని అంటారు. అఫ్గాన్‌లో తాలిబన్‌ దుష్టరాజ్యం ఈ మధ్య మళ్లీ ప్రకోపించిన సమయంలోనే ఆరెస్సెస్‌ అగ్రసేనుడు అదే ప్రశ్న వేసాడు. పరిపాలన గులాంలకి వదిలేసి ఆరారగా స్త్రీ ద్వేషాన్ని ప్రదర్శించడం ఆయనకి అలవాటు. స్త్రీని ద్వేషిస్తే ఓ పనైపోతుంది అన్నట్టు ఆరారగా రొదపెడతారు. మనుషులు రోడ్డు మీదికి వచ్చేది పనుల కోసం, చదువు కోసం. కాబట్టి ఆడాళ్లు ఇంటిపనికి అంకితమై, పురుషుడికి సేవ చేస్తూ, చదువు కోసం రోడ్డెక్కకుండా ఉంటే ఇంత విశాలంగా రోడ్లు వేయాల్సిన పని ప్రభుత్వానికి తప్పుతుందన్నది అసుంటోళ్ళ లాజిక్‌. అసలు దేశమే లేకపోతే పాలన ఫెయిల్యూర్‌ కనబడదు. దేశమంటే మనుషులోయ్‌ అన్నాడు మరి గురజాడ. మైనారిటీ వాళ్లు, ముఖ్యంగా ముస్లింలు కూడా భోజనాలు చేయబట్టే దేశానికి ఆహార కొరతొచ్చిందంటారు యాగీలు మరిగిన సంఫీులు. అసలు అందరికీ అన్నం పెట్టమనే సెక్యులరిజం వద్దు.. హిందూ కంచాలే నింపే మతవాదం ముద్దు వారికి. అలాగే ఆడవాళ్లు కూడా చదువుకొని ఉద్యోగాలు చేయకుండా ఉంటే నిరుద్యోగం పేట్రేగేదా అనడుగుతారు. అసలు వాళ్లే రోడ్డెక్కకపోతే ట్రాఫిక్‌ జామ్‌లు, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి కదా అని పరిష్కారాలూ, మిరియాలూ నూరుతారు. బస్సులో రద్దీ తగ్గదా అంటారు. దీన్నే అభివృద్ధి నిరోధక ఆలోచన అంటారు. ఆ మాట చెబితే అభివృద్ధి ఎందుకు మా పార్టీ నిధికి అవసరం తప్ప అంటారు. మతాన్ని తిని, మతాన్ని తాగి, మతాన్ని కక్కే వాళ్ళకి అభివృద్ధి వద్దు ‘అంతా’ అనే పదం బదులు ‘కొంత’ డిష్నరీలో చేర్చాలని వాదిస్తారు. లోకస్సమస్తాం సుఖినోభవన్తు కాదు ` హిందూ లోకస్సమస్తాం సుఖినోభవన్తు అని పాఠ్యపుస్తకాల్లో సూక్తి మార్చేసి ఏమిట్రా ఇదంటే హిందూ ఉద్ధరణ పొమ్మంటారు.
హిందూ ఉద్ధరణ ఎందుకు అంటే ‘అందుకు’ అని జవాబు. అందుకంటే ఎందుకని అడిగితే క్రోనీ లాలన, తాలిబనీకరణ, విదేశీ వ్యవహారాల క్షాళన. ఈలలు వేస్తూ అమ్మబోయే ఆస్తులను చూపిస్తారు. అన్నట్టు తాలిబన్లతో చర్చల పర్వం ఏలినోరు తెరిచారట!
పాటనీ, గాలి పటాన్నీ నిషేధిస్తామని హామీ ఇచ్చే ఉంటారు. ఇక మహిళ అరికాలి కింద మంటలు సరేసరి. ఆరారగా రేపుతూనే ఉన్నారు. అంబానీ, అదానీ గాలిపటాల దుకాణాలు తెరిచేదాకా, పాటలతో కోటలు కడదామనుకునే దాకా గాలిపటం, పాట నిషిద్ధం.
‘హిందూ ఛాందసులంతా మా వాళ్లే. తాలిబన్‌ కరచాలనంతో ముస్లిం ఛాందసులు కూడా కలిస్తే రేపు ఎన్నికల్లో ఢోకా ఉండదు’ అని ‘గులాంద్వయం’ చెవుల్లో సంఫీుయుల కూత.. గానాన్ని నిషేధిస్తాం కాబట్టి ఇవి ఊహాగానాలు కావు! నిజ ధ్వజాలు…! ఇక హిందూ కాశీ తాలి బనారస్‌ అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img