Friday, April 26, 2024
Friday, April 26, 2024

హిట్లర్‌, మోదీల మధ్య సారూప్యతలు

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

జర్మన్‌ పార్లమెంటు భవనం రీచ్‌ స్టాగ్‌ను 27.02.1933 న దహనం చేశారు. దీనికి హిట్లర్‌ కమ్యూనిస్టులను నిందించారు. ఈ కాల్చివేతను కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి వాడుకోవచ్చని నాజీలే రీచ్‌ స్టాగ్‌ను కాల్చారు. హిట్లర్‌ దహనసూత్రంతో ఇటలీ ఫాసిజం జర్మనీలోకి దూకింది. సోషలిస్టు శిబిర పతనంతో ప్రపంచమంతా వ్యాపించింది.
1932 నవంబర్‌ ఎన్నికల్లో 230 స్థానాలు వచ్చిన నాజీ పార్టీకి పార్లమెంటులో ఆధిక్యతలేదు. నేషనలిస్టులతో మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పరిచి 30.01.1933 న హిట్లర్‌ ఛాÛన్సలర్‌ అయ్యాడు. 31 పార్టీల మద్దతుతో వాజపేయి మన ప్రధాని అయినట్లు. 4.2.1933 న పత్రికాగోష్టులను, ప్రతిపక్షాలతో సమావేశాలను, ఊరేగింపులను హిట్లర్‌ నిషేధించాడు. మోదీకి ఇందులోనూ హిట్లరే ఆదర్శం. ఆధిక్యతా రాహిత్యాన్ని హిట్లర్‌ సహించలేదు. పార్లమెంటు లేకుండా ఏకఛత్రాధిపత్యం పొందాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో రీచ్‌ స్టాగ్‌ కాలిపోయింది. ఇది కమ్యూనిస్టుల పనని, వారి విప్లవ ప్రణాళికలకు సంకేత మని నాజీ పత్రికలు ఘోషించాయి. అమెరికా స్వాతంత్య్ర ఫాక్స్‌ మూవీ న్యూస్‌ రీల్‌ కూడా హిట్లర్‌ కథనాన్నే ప్రతిబింబించింది. ఈ ఘటనను కమ్యూనిస్టుప్రత్యర్థుల వ్యతిరేకప్రచార సాధనంగా వాడుకున్నాడు హిట్లర్‌ 28.02.1933 న అధ్యక్షుడు పాల్‌వాన్‌ హిండెన్‌బర్గ్‌ను ఒప్పించి అత్యవసరాదేశం ‘రీచ్‌ స్టాగ్‌ అగ్ని ప్రమాద చట్టం’ చేయించాడు. ఇది శాసనప్రక్రియలను రద్దు చేసింది. భావప్రకటన, పత్రికా స్వేచ్ఛలు, సమావేశ హక్కు వంటి వ్యక్తి స్వేచ్ఛలను, పౌరస్వేచ్ఛలను స్తంభింపజేసింది. పోలీసుల పరిమితులను తొలగించింది. వ్యక్తిగత గోప్యతలను అతిక్రమించింది. చట్ట పరిధులను దాటి గృహనిర్బంధాలను, ఇళ్ల సోదాలను, ఆస్తుల, సంపదల జప్తులను అనుమతించింది. నేరంచెప్పకుండానే ప్రతిపక్ష నాయకులను నిర్బంధించి జైలు పాల్జేసే, రాజకీయ సంస్థలను, సాహిత్యప్రచురణలను నిషేధించే అధికారాలను పాలకులకు ఈ చట్టం కట్టబెట్టింది. (మోదీ ఉన్మాదీకరించిన ఉపా చట్టం ఇలాంటిదే) రాష్ట్ర, స్థానిక చట్టాలను అతిక్రమించే, ఆ ప్రభుత్వాలను కూలదోసే అధికారా లను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. (ఇండియాలో ఇదే జరుగుతోంది) కమ్యూనిస్టు, సోషలిస్టు ప్రజాప్రతినిధులను పార్లమెంటు నుండి బహిష్కరించింది. ఈ చట్టం నాజి నియంతృత్వానికి మూలం. ప్రాథమిక హక్కులు లేని పోలీసు రాజ్యంగా మారింది జర్మని. రాజకీయ ప్రత్యర్థులను బంధించ డానికి నాజీలు నిర్బంధ శిబిరాలను స్థాపించారు.(పౌరసత్వ సవరణచట్టం అమలులో అసోంలో ఏర్పర్చిన రేపు దేశ వ్యాపితంగా స్థాపించబోయే పౌరసత్వరహిత ప్రజల తాత్కాలిక శిబిరాలు ఇలాంటివే) ఈ ఆదేశం ప్రజల, దేశ రక్షణల పేరుతో ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చింది. ప్రశ్నించేవారిని, ప్రభుత్వ, ప్రభుత్వాధికారుల చర్యలపై అవిధేయత తెలిపేవారిని, ప్రజలను రెచ్చగొట్టేవారిని ఒకనెల జైలుశిక్ష లేదా 150నుండి 15,000 రీచ్‌మార్కుల జరిమానాతో శిక్షించవచ్చు.
దేశాధ్యక్షుని, ప్రభుత్వాధినేతల అపహరణకు, హత్యా యత్నానికి పాల్పడేవారికి 15ఏళ్ల జైలు/జీవితఖైదు/మరణ శిక్ష విధించవచ్చు (హిట్లర్‌కు నచ్చని పనులన్నీ రెచ్చగొట్టే చర్యలే. ఆయన చంపాలనుకునే వారు అపహరించేవారు, హత్యచేసే వారు) కమ్యూనిస్టులపై హిట్లర్‌ ఆరోపణలు అబద్దాలు. నిర్ణయాత్మక చర్యలతో హిట్లర్‌ కమ్యూనిజం నుండి దేశాన్ని రక్షించాడని అతని ప్రచాం ప్రభావంతో ప్రజలు నమ్మారు. విద్య, సంస్కృతి, చట్టం, ఆర్థిక న్యాయం వగైరా వ్యవస్థలన్నీ నాజి నియంత్రణ లోకి వచ్చాయి. నేడు భారత రాజ్యాంగ, రాజ్యాంగేతర, ప్రజాస్వామ్య, ప్రజా సంక్షేమ సంస్థలన్నీ సంఫ్‌ు నేతల ఆధీనంలో ఉన్నట్లు. హిట్లర్‌ ప్రచార ఉచ్చులోపడి క్రైస్తవ కాథలిక్‌, ప్రొటెస్స్టాంట్‌ మతగురువులు అధిక సంఖ్యలో హిట్లర్‌కు మద్దతు పలికారు.
భుజ్‌ భూకంపం తర్వాత గుజరాత్‌ ముఖ్యమంత్రి కేశుభాయ్‌ పటేల్‌ ఆరోగ్యం, ప్రజాదరణ క్షీణించాయని 2001లో బిజెపి మోదీని ముఖ్యమంత్రిగా నియమించింది. తన స్థానాన్ని పదిలపర్చుకోడానికి ఆయన పథకం రచించాడు. రీచ్‌స్టాగ్‌ ఘటనల తేదీలలోనే 27.02.2002న సబర్మతిరైలు ఎస్‌ 6, సీట్‌ నం. 72 ప్రయాణీకుడు గుజరాత్‌ గోధ్రా స్టేషన్‌లో బోగీకి నిప్పుపెట్టాడు. 59 మంది అయోధ్యయాత్రికులు చనిపోయారు. బదీనికి మోదీ ముస్లింలను నిందించారు. 28.02.2002న విశ్వహిందుపరిషత్‌ గుజరాత్‌ సమ్మెకు పిలుపునిచ్చింది. మోదీ సర్కార్‌ అడ్డుచెప్పలేదు. ఆయన, గుజరాత్‌ బిజెపి అధ్యక్షుడు, జిల్లా అధికారుల సలహాలను ధిక్కరించి శవాలను గోద్రా నుండి అహ్మదాబాద్‌ వరకు ఊరేగించారు. సంఫ్‌ు సభ్యులను రెచ్చగొట్టే ఉపన్యాసాలు పేల్చారు. 3నెలలపాటు జరిగిన మారణహోమంలో 3 వేలమంది ఎక్కువగా ముస్లింల ప్రాణాలు, వందల ముస్లిం మహిళల మానాలు పోయాయి. కోట్ల రూపాయల ముస్లింల ఆస్తులు బూడిదయ్యాయి. మోదీ హిందు హృదయ సామ్రాట్‌ అయ్యారు. ఆ ప్రభావంతో ప్రధాని అయ్యారు. దేశంలో ‘రీచ్‌ స్టాగ్‌ అగ్నిప్రమాద చట్టం’ అమలవుతోంది.
జర్మనీ కమ్యూనిస్టు 24 ఏళ్ల మారినస్‌ వాన్‌డర్‌ లూబ్‌, రీచ్‌స్టాగ్‌ను కాల్చాడని హిట్లర్‌ అభియోగించాడు. రాజద్రోహ నేరంపై న్యాయమూర్తులు లూబ్‌కు మరణశిక్ష విధించారు. 10.01.1934న ఆయన తల నరికారు. అధ్యక్షుని ఆదేశానికి నెలలోపే హిట్లర్‌ ‘1933 అనుమతి చట్టం’ను ఆమోదింప జేశాడు. పార్లమెంటు, అధ్యక్షుల అనుమతి లేకుండా సొంత ఆదేశాలు జారీచేసే నిరంకుశ అధికారాలు పొందాడు. ఈ చట్టం నాజి పార్టీని ఏకైక రాజకీయ పార్టీగా ప్రకటించింది. హిట్లర్‌ మిడిసిపాటు మింటికి ఎగిసింది. ప్రభుత్వ యంత్రాగంలో పనిచేసేవారందరినీ నాజి పార్టీ సభ్యులుగా నిర్బంధించింది. నాజి పార్టీ దేశంలో ప్రజల జీవితాల్లో ప్రతి రంగాన్ని నియంత్రించింది. 1933లో హిట్లర్‌ అధికారానికి వచ్చినపుడు 4,700 జర్మన్‌ పత్రికల్లో నాజీల వాటా 3 శాతమే. ప్రతిపక్షాలను రద్దుచేసి ఆ పార్టీల, కమ్యూనిస్టుల, సోషలిస్టుల పత్రికలను నాజీలు సొంతం చేసుకున్నారు. నాజీ సైనికదళం ప్రత్యర్థులను బంధించింది. నిర్బంధకేంద్రాలు, సమీకరణ శిబిరాల్లో కుక్కింది. నాజీ దుండగులు ప్రతిపక్షాల కార్యాలయాలను, ప్రచురణాలయాలను ఆక్రమించారు. కొన్ని పత్రికలను బలవంతంగా కొన్నారు. మిగిలిన స్వతంత్ర పత్రికలు హిట్లర్‌కు అనుకూలంగా మారాయి. 04.10.1933 సంపాదకుల చట్టం ద్వారా సంపాదకులను, పాత్రికేయులను జాతి శుద్ధిచేశారు. యూదులు, ఆర్యేతరులు దేశం విడిచిపోయారు. ప్రభుత్వాన్ని ‘‘బలహీనపరిచే’’ దేశవిదేశీ అంశాలను పత్రికలు ప్రచురించరాదు. ఈ నియమాలను ఉల్లంఘించిన పాత్రికేయుల ప్రాణాలు పోయాయి. మన పత్రికారంగం నేడు ఈ స్థితిలోనే ఉంది.
అధ్యక్షుడు పాల్‌ వాన్‌ హిండెన్‌బర్గ్‌ మరణం తర్వాత ఆగస్టు 1934లో హిట్లర్‌ దేశాధ్యక్షుడు, ప్రభుత్వాధినేత, నాజి పార్టీ నాయకుడు అయ్యాడు. (రాజ్యాంగ సవరణతో మోదీకి దఖలుపడబోయే పదవులివే) సైన్యం హిట్లర్‌కు అతి విధేయతను ప్రకటించింది. (నేటి మన సైన్యాధిపతుల లాగా) హిట్లర్‌ నియంతృత్వ నిర్వహణలో స్త్రీలు కీలకపాత్ర పోషించారు. శుద్ధజాతి సూత్రంలో అపరిమిత ఆర్య శిశువులను కనడానికి హిట్లర్‌ జనాభా విధానం స్త్రీలను ప్రోత్సహించింది. (సంఫ్‌ు మగాళ్ళు హిందుస్త్రీలను ఇలాగే ఆదేశిస్తున్నారు) యూదులను, ఆటవికులను అశుద్ధజాతీయులుగా ప్రకటించారు. నిర్మూలించారు. (సంఫ్‌ు ముస్లింలను, క్రైస్తవులను విదేశీయులుగా ప్రకటించింది. వేధిస్తోంది.) నాజి పార్టీ రాజ్య రహస్య పోలీసులు (గెస్టపొ), భద్రతాదళ సేవకులు హిట్లర్‌ విమర్శకులను చంపారు. బజరంగ్‌ దళ్‌, ధర్మ, రామ, హనుమాన్‌ సేనలు, గోరక్షణ వగైరా సంఫ్‌ు సంస్థలు ఈ పనులే చేస్తున్నాయి.
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయకార్యదర్శి, 9490 20 4545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img