Friday, April 26, 2024
Friday, April 26, 2024

సుప్రీం కమిటీపైనా సంఫ్‌ు మీడియా సందేహం!

ఎం కోటేశ్వరరావు

తప్పనిసరి పరిస్థితి ఏర్పడి తప్పు చేసినట్లు ఒక వేళ గౌతమ్‌ అదానీ అంగీకరించినా అతని మద్దతుదారులైన కాషాయదళాలు మాత్రం ఒప్పుకొనేట్లు కనిపించటం లేదు. అదానీ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక సృష్టించిన సంచలనం, ఆ కంపెనీల వాటాల విలువ పతనం గురించి తెలిసిందే. ఆ నివేదిక ఆరోపణల మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆరుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం మాజీ న్యాయమూర్తి ఎఎం సప్రే ఛైర్మన్‌గా ఎస్‌బిఐ మాజీ ఛైర్మన్‌ ఓ ప్రకాష్‌ భట్‌, ఇన్ఫోసిస్‌ సహ ప్రారంభకుడు నందన్‌ నీలేఖని, ప్రస్తుతం ఎన్‌బిఎఫ్‌ఐడి ఛైర్మన్‌గా, గతంలో ఐసిఐసిఐ, బ్రిక్స్‌ బాంకు, ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌గా పనిచేసిన కెవి కామత్‌, ప్రముఖ లాయర్‌ సోమశేఖర సుందరేశన్‌, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జెపి దేవధర్‌ సభ్యులుగా ఉన్నారు. దాన్ని తాము స్వాగతిస్తున్నామని నిజం వెల్లడౌతుందని అదానీ ఒక ప్రకటనలో స్పందించారు. సుప్రీంకోర్టు కమిటీ తటస్థంగా వ్యవహరిస్తుందా అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే నేషనలిస్ట్‌ హబ్‌ అనే మీడియా పోర్టల్‌ ప్రశ్నించింది. సభ్యులుగా ఉన్నవారికి గతంలో ఆర్థికనేరాలకు పాల్పడినవారు కొందరితో, మోదీని విమర్శించే సంస్థలతో కాంగ్రెస్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, తటస్థంగా ఉండి నివేదిక ఇస్తారా అన్న అనుమానాలను రేకెత్తించింది. దాని మీద ఇవ్వరు ఇవ్వరు అంటూ వెంటనే స్పందనలు.
దేశంలో ఇప్పుడు జరుగుతున్న తీరు తెన్నులను బట్టి జనం ప్రతిదాన్నీ అనుమానిస్తున్నపుడు ఏ కమిటీనివేసినా దానిలో ఉన్నవారిని అనుమానించటం సహజం. తానెలాంటి తప్పు చేయలేదని అదానీ తలకిందులుగా తపస్సు చేస్తున్నప్పటికీ, నరేంద్రమోదీ మద్దతుగా ఉన్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినా పక్కన పెట్టేసి హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికను స్టాక్‌మార్కెట్లో మదుపుదార్లు నమ్మారు. తమ వాటాలను తెగ నమ్ముకొన్నారు. నెల రోజులు దాటినా జరిగిన నష్టంలో మార్పు లేదు. అడ్డగోలుగా పెంచి పెద్దచేసినా, ఇబ్బందులు వచ్చినపుడు నరేంద్రమోదీ కూడా అదానీని కాపాడలేరని కూడా స్టాక్‌మార్కెట్‌ మదుపుదార్లలో ఉన్నట్లు ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో సంఘపరివార్‌ సంస్థ సుప్రీం కమిటీ మీద అనుమానాలను ఎందుకు రేకెత్తించినట్లు? భీమ కొరేగాంకేసులో మాదిరి దర్యాప్తుసంస్థే స్టాన్‌స్వామి, ఇతరుల కంప్యూటర్లలో తప్పుడు సమాచారాన్ని చొప్పించి దాన్నే సాక్ష్యంగా చూపేందుకు సిద్ధమైిన దారుణం తెలిసిందే. అదానీ కంపెనీల్లో అలాంటి దానికి అవకాశం లేదు. వివరాలను ఇప్పటికే ధ్వంసం చేయగా మిగిలిన వాటి నుంచే అక్రమాలకు పాల్పడిరదీ లేనిదీ కమిటీ నిర్ధారిస్తుంది. లేదూ ఒకదానికొకటి పొంతనలేని సమాచారం ఇస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టుకు అందిస్తుంది. సెబీ కూడా దర్యాప్తు జరుపుతున్నది. ఒక నియంత్రణ సంస్థగా సెబీ తీరు తెన్నుల వైఫల్యం గురించి కూడా సుప్రీం కమిటీ విచారణ జరుపుతుంది. తమ కమిటీకి సహకరించాలని సెబీని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కమిటీలో వెలుగుచూడనివి సెబీ నివేదికలో లేదా సెబీలో రానివి సుప్రీం కమిటీ నివేదికలో చోటు చేసుకోవచ్చు. ఆ రెండు నివేదికలూ బహిర్గతమైన తరువాత గతంలో దర్యాప్తు జరిపిన హిండెన్‌బర్గ్‌ లేదా ఆ రంగంలో నిపుణులైన వారు లేవనెత్తే అంశాలను కూడా సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇంత జరగాల్సి ఉండగా ఇంకా ఆలూలేదూ చూలూ లేదు కొడుకుపేరు సోమలింగమా అన్నట్లుగా సంఘపరివార్‌ మీడియా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తున్నట్లు? హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు కమిటీ విచారించటం లేదు. మన దేశంలో తిమ్మినిబమ్మిని చేసినట్లు వచ్చిన ఆరోపణల మీదనే అది పరిశీలన జరుపుతుంది. విదేశాల్లోని డొల్లకంపెనీలు, నిధుల మళ్లింపు వంటి వాటి మీద ఏదైనా అనుమానం వచ్చే సమాచారం దొరికితే దాన్ని సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా మీడియా ఎక్కువ చేసి రాస్తున్న వార్తల వలన స్టాక్‌మార్కెట్‌ ప్రభావితమై మదుపర్లు నష్టపోతున్నందున అదానీ`హిండెన్‌బర్గ్‌ వివాదం గురించి వార్తలపై నిషేధం విధించాలన్న పిటీషన్‌దారుల్లో ఒకరైన ఎంఎల్‌ శర్మ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సహేతుకమైన వాదనలు వినిపించండి తప్ప నిషేధాన్ని అడగవద్దని చెప్పింది.
ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్‌చేసిన జెపిసికి మోదీ సర్కార్‌ అంగీకరించి ఉంటే సుప్రీంకోర్టు కమిటీ ఉందేదీ కాదు, దాని మీద నేషనలిస్ట్‌ హబ్‌కు సందేహాలు లేవనెత్తే అవకాశం వచ్చి ఉండేది కాదు. జెపిసి పక్షపాతంగా పని చేసే అవకాశమే లేదు. ఎందుకంటే దానిలో అత్యధికులు అదానీని కంటికి రెప్పలా కాపాడుతున్న బిజెపి లేదా మిత్రపక్షాల సభ్యులే ఉంటారు. అయినా మోదీ ఎందుకు నిరాకరించినట్లు? ఏ పార్టీ వారు ఎందరని కాదు, ఎవరెందరున్నా అడిగిన సమాచారాన్ని కమిటీకి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వలేదని సభ్యులు రాస్తారు. మెజారిటీ ఒక నివేదికను ఆమోదించినా, దానితో విబేధించేవారు కూడా మరొక నివేదికను ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ రెండూ బహిరంగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎవరు అదానీని కాపాడేందుకు పూనుకున్నది, ఎవరు అక్రమాలను వెలికి తీసేందుకు చూసిందీ యావత్‌ ప్రపంచానికి తెలుస్తుంది. ఇదే మోదీని భయసెట్టి ఉంటుంది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల మీద వత్తిడి తీసుకురారా, బెదిరించరా అంటే ఈ దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. అదీ ప్రభుత్వం వైపు నుంచే ఉంటుంది. మన ప్రజాస్వామ్యానికి ముంచుకు వస్తున్న ముప్పు అదే! తమ ముందు దాఖలైన కేసుల్లో సుప్రీం నోటీసులు ఇచ్చిన తరువాత గానీ కేంద్రం కదలలేదు. కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తూ తమ ప్రతిపాదనలను ఒక మూసివేసిన కవరులో పెట్టి సుప్రీంకోర్టుకు అందించింది. దాని అర్దం ఏమిటి? మేము చెప్పిన వారితో చెప్పిన పద్దతుల్లో విచారణ జరిపించాలని సుప్రీంను ప్రభుత్వం ఆదేశించటమే. పారదర్శక విచారణ జరగాలంటూ సదరు కవరును సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిజానికి కేంద్రానికి అంతకంటే అవమానం మరొకటి లేదు, బహుశా ఈ పరిణామాన్ని ఊహించి ఉండరు. ఇంతకీ ఆ కవరులో నరేంద్రమోదీ సర్కార్‌ రాసిన అంశాలేమిటి అన్నది ఇప్పటి వరకు వెల్లడికాలేదు. ఇక అవకాశాలు లేవు. తరువాత అవి లీకైనా కేంద్రం తోసిపుచ్చే అవకాశం ఉంటుంది. మాజీ మంత్రి పి చిదంబరం అరెస్టయిపుడు బెయిలు కేసులో ఇడి సమర్పించిన సీల్డు కవర్‌ మీద ఆధారపడిన దిల్లీ హైకోర్టును 2019 లో సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తమ మనస్సులను సంతృప్తిపరచుకొనేందుకు న్యాయమూర్తులకు సీల్డు కవర్‌లోని అంశాలను చూసేందుకు అధికారం ఉన్నపుడు కోర్టు విచారణలో వాటిలో కనుగొన్న వాటిని నమోదు చేయకూడదని పేర్కొన్నది. రాఫెల్‌ విమానాల కొనుగోల వివరాలు రహస్యం అని ప్రభుత్వం చెప్పటాన్ని కోర్టు అంగీకరించింది. 2జి స్పెక్ట్రం కేసులో కూడా అదే జరిగింది.
నయా ఇండియా పత్రికలో ఆర్‌ఎస్‌ఎస్‌పై శంకర్‌ సహారా మండిపాటు దాని మద్దతుదార్లలో గూడుకట్టుకొని ఉన్న అసహనాన్ని వెల్లడిస్తున్నది. జర్మనీ, అనేక దేశాల్లో హిట్లర్‌ మూకలు యూదుల పట్ల అనుసరించిన వైఖరిని మన దేశంలో ముస్లింల పట్ల ఇంకా పూర్తిగా ఎందుకు అనుసరించటం లేదన్న దుగ్ధ సంఘపరివార్‌ శ్రేణుల్లో పెరుగుతున్నదని శంకర్‌ వాదనల తీరు వెల్లడిస్తున్నది. తమ అజెండాతో ముందుకుపోతే మొదటికే మోసం వస్తుందని తటపటాయిస్తున్నారు, మత విద్వేషాన్ని ఇంకా ఎక్కిస్తే తప్ప అమలు జరపటం సాధ్యం కాదని సంఘపరివార్‌ భావిస్తున్నది, అందుకే ఆ కార్యక్రమాన్ని మరింతగా వేగిరపరుస్తున్నది తప్ప వైదొలగలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img