Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మతం వద్దు, గతం వద్దు, మారణహోమం వద్దు

డాక్టర్‌ దేవరాజు మహారాజు

కఠినమైన, సంక్లిష్టమైన అంశాలతో మెదడు బద్దలు కొట్టుకునే బదులు, చాలా సరళమైన సామాన్యమైన అంశాలమీద దృష్టి పెడితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. మొట్టమొదట ఒక చిన్న విషయం గమనిద్దాం. ప్రపంచంలో జన జీవనాన్ని అస్తవ్యస్తంచేస్తూ జరుగుతున్న హింసకు కారణాలేవో బేరీజు వేసుకుందాం. జరుగుతున్న హింసలో ఎక్కువ శాతం ధర్మం పేరుతో జరుగుతూ ఉంది. ‘ధర్మం’ అనే లేబుల్‌ తగిలించుకుని జరుగుతూ ఉంది. కానీ, అదంతా ‘ధర్మస్థాపన’ కోసం కాదు. ఉగ్రవాదులైనా, సంప్రదాయవాదులైనా తాము తమ ధర్మాన్ని ప్రతిష్టాపించడానికి హింసకు పాల్పడుతున్నామని చెప్పుకుంటున్నారు తప్పిస్తే, ఆ హింస సమాజంలో నైతిక విలువలు, జీవన మూలాలు కాపాడడానికి ఏ విధంగానూ ఉపయోగపడడం లేదు. ఈ విషయాన్ని రుజువు చేయడానికి మనం మన దేశంలోని మూడు ప్రధానమైన మతాలు చెప్పే నైతిక సూత్రాల్ని విశ్లేషించుకుందాం.
హిందూమతం ఏం చెపుతోంది? ‘వసుధైౖక కుటుంబకం’ అని చెపుతుంది. ప్రపంచంలోని మనుషులందరూ తమ కుటుంబంలోని వారే అని అర్థం. అలాంటి భావన ఉన్నప్పుడు వీరు ముస్లింలను, క్రైస్తవుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని ఇంకా అన్యమతస్థుల్ని ద్వేషించవచ్చా? ద్వేషించకూడదు కదా? పుష్యమిత్రుడికాలం నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా అలా జరిగిందా? జరగనప్పుడు ఇక ఆ మతమెందుకూ? ఇక క్రైస్తవుల నైతిక సూత్రం ‘లవ్‌ ద నైబర్‌’’ అంటే పొరుగు వాణ్ణి ప్రేమించమని అర్థం. పొరుగువారు ఎవరూ? అంటే నువ్వు ఉండే ఇంటికి నాలుగువైపులా ఉన్న 77 కుటుంబాలు పొరుగువారే అవుతారు. అలా అని వారి మతమే చెపుతోంది. అలా చూసుకుంటూపోతే విస్తృతమైన పరిధిలో ప్రపంచ పౌరులందరూ మన పొరుగువారే. అలా అయినప్పుడు ద్వేషించడానికి, పగతీర్చు కోవడానికి ఎవరూ ఉండరు. ఉండకూడదు కూడా. పొరుగువారు హిందువులో, ముస్లింలో అయితే ద్వేషించవచ్చని అందులో లేదు. పొరుగువారు ఎవరైనా సరే, వారు ఏ ధర్మం, ఏమతం పాటించేవారైనా సరే, ప్రేమించమనే ఉంది. మతాల, కులాల ప్రసక్తి అక్కడ లేనేలేదు. ‘పొరుగువారు’ అన్నదే అక్కడ ప్రధానం. విశ్వజనీనమైన ఈ భావనకు మన తెలుగుకవి గురజాడ అప్పారావు కూడా స్పందించారు. ‘స్వంత లాభము కొంతమానుకుని పొరుగువారికి తోడు పడవోయ్‌’ అని అన్నారు కదా?
ఇక మూడవది ఇస్లాం ‘జిస్‌ వ్యక్తీ కే పడోసి భూకే పేట్‌ రహతా హై/ ఉస్‌ కేలియే జన్నత్‌ క దర్వాజే కబీ నహీ ఖులేంగే’ అన్నది ఇస్లాం మత నైతిక సూత్రం. ఇందులో జన్నత్‌(స్వర్గం) అనే పదం వల్ల ఇది ముస్లింల సూత్రమని స్పష్టంగా తెలుస్తోంది. నీ పొరుగువాడు ఆకలితో నకనకలాడుతూ ఉంటే, నీకోసం స్వర్గ ద్వారాలు ఎలా తెరుచుకుంటాయ్‌. అనే ప్రశ్న ఉంది. అందులో ఇక్కడ మనం చెప్పుకున్న సూత్రాలు ఒక దానికి ఒకటి వ్యతిరేకం కాదు. ఒకే విషయాన్ని వేరువేరు రకాలుగా చెప్పుకున్నట్లుగా ఉంది. మానవత్వాన్ని పరిరక్షించుకోవడమే మానవుడి ముఖ్య ధ్యేయమని ఈ మూడు మతాలే కాదు, ఇతర అన్ని మతాలూ చెప్పాయి. ఈ భావనలన్నీ మానవతను నిర్వచించడానికి ఉపయోగించిన అత్యున్నతమైన పరిభాషని మనకు అనిపించడం సహజం!
ఇలాంటి పరిస్థితుల్లో ఏ మతానికి సంబంధించినవారైనా, పైన చెప్పుకున్న నైతికసూత్రాలు ఆధారంగా హింసకు పాల్పడరు. హింసకు పూనుకోవడానికి కారణం ధర్మంకాదు. మతం కాదు. ఏ మతమూ ఇతర మతస్థుల్ని కొట్టి చంపమని చెప్పలేదు. మరి ఎందుకు హింసకు/ఉగ్రవాదానికి పాల్పడుతున్నారూ? అంటే తమ అస్థిత్వాన్ని ప్రదర్శించుకోవడానికి! తన ఆధిక్యతను అధర్మంగా స్థాపించు కోవడానికి!! అని చెప్పుకోవల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి ధర్మప్రసక్తీ లేదన్నది వాస్తవం. ఇక్కడ మనకు రెండువిషయాలు కనిపిస్తున్నాయి. 1.మోరాలిటీ(నైతికత) 2.ఐడెంటిటీ(అస్థిత్వం) నైతికతప్రకారం చూస్తే అన్నిమతాల సూత్రాలు ఒకేవిధంగా ఉన్నాయి. కాబట్టి వారు మొరాలిటీ విషయంలో గొడవలు పడడంలేదు. హింసకు దిగడం లేదు. రాజకీయాలు చేయడంలేదు. కానీ, తన అస్థిత్వాన్ని, ఆధిక్యతను నిలుపుకోవడానికి అక్రమమార్గాల్లో హింసకు పాల్పడుతున్నారు.
వివిధ మతాలవారు వివిధ రకాల దుస్తులు ధరిస్తున్నారు. వివిధ మత గ్రంధాలు చదువుతున్నారు. వారి పవిత్ర గ్రంధాలు కూడా వేరువేరుగా ఉన్నాయి. వారు దర్శించే ధార్మికకేంద్రాలు వేరు. వారి పూజాపద్ధతులువేరు. సంప్రదాయాలు, ఆచారాలు వేరు. పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా వారు అనుసరించే వేడుకలు, పండగలు, కర్మకాండలు అన్నీ వేరువేరుగా ఉన్నాయి. వీటిలో వేటివల్లా వివిధ మతస్థులమధ్య భేదాభిప్రాయాలు లేవు. ఎవరిపండుగలు వారు జరుపు కుంటున్నారు. ఎవరి జాతరలు వారు జరుపుకుంటున్నారు. ఒక్కోసారి కొందరు ఇతర మతస్థుల వేడుకల్లో, పండగల్లో కూడా స్నేహభావంతో పాలుపంచు కుంటున్నారు. ఈ రకమైన అవగాహనకు ముఖ్యంగా భారతదేశంలో ప్రాముఖ్యం ఉంది. ఈ దేశప్రజల్ని ముస్లింలు పరిపాలించినా, క్రైస్తవులు పరిపాలించినా మత పరమైన ఘర్షణలు మతం ఆధారంగానో, లేక ధర్మం ఆధారంగానో జరుగలేదు. కేవలం అస్థిత్వ స్థాపనకు, తమ ‘పై చేయి’ని నిలుపుకోవడానికి చేసినవే! వాటివల్ల సమాజం దెబ్బతిన్నదేగాని, ఎప్పుడూ ఎక్కడా ఏ మంచీ జరగలేదు.
కొన్ని సంఘటనలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అప్ఘానిస్థాన్‌లో తాలిబన్‌లు గౌతమ బుద్ధుడి ప్రతిమను ధ్వంసం చేశారు. కారణం ఏం చెప్పారంటే ఇస్లాం విగ్రహపూజకు వ్యతిరేకం కాబట్టి ఆ విగ్రహం ధ్వంసం చేశామన్నారు. హిందు దేవాలయాల్లో దేవ దేవతలకు పూజలు చేసినట్లు అఫ్గానిస్థాన్‌లోని ఆ పెద్ద బుద్ధుడి విగ్రహానికి నిత్యం అక్కడ ఎవరూ పూజలు చేసేవారు కాదు. అయితే ఏదో దొంగసాకుతో తమ ఆధిక్యతను నిలుపుకోవడానికి, తమను అక్కడ ఎవరూ అడ్డుకోలేరన్న ధీమాతో చేశారు. ప్రతిమల్ని పగల గొట్టమని ఇస్లాం మతం ఎక్కడా చెప్పలేదే? భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు రథయాత్ర పేరుతో దేశమంతా తిరిగాడు. ఆయనే మన్నాడూ? ‘నా భగవంతుడైన రాముడు ప్రస్తుతం బాబ్రీమసీదు ఉన్నచోట పుట్టాడు. అది అతని జన్మస్థలం. అక్కడ మందిరం కట్టనంతకాలం రాముడిపై తనకుగల భక్తి పూర్తికాదు’’(జబ్‌తక్‌ వహా మందిర్‌ నహీ బనావూ తబ్‌ తక్‌ మేరా రామ్‌ బక్తీ పూరా నహీ హోగా) అని, ఆయనగారు రథయాత్ర సందర్భంగా దేశప్రజల చెవులు పగులగొట్టాడు కదా? తర్వాత కాలంలో బాబ్రీమసీదునే కూల గొట్టాడు. ఇతర మతస్థుల కట్టడాల్ని కూలగొట్టమని ఏ హిందూ పురాణాల్లోనైనా చెప్పారా? ఎక్కడా చెప్పలేదే? ఇక్కడ జరిగింది కూడా అదే! ఒక దొంగ సాకుతో, వక్రబుద్ధితో తమ ఆధిపత్యాన్ని సమాజంలో అక్రమంగా స్థాపించుకోవడానికి చేసిన కుట్రదాడి! ఇందులో రహస్యమేమీలేదు. రాముడి జన్మస్థలం బాబ్రి మసీదు ఉన్నచోటేనని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవనిసుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. పైగా బాబ్రీ మసీదు అడుగున తవ్వకాల్లో బైటపడ్డవన్నీ హిందూ దేవాలయాలు, ఆనవాళ్ల్లు కావనీ, అవి బౌద్ధారామాల ఆనవాళ్లని అర్కియాలజిస్టులు పరిశీలించి చెప్పారు. మతద్వేషాన్ని ఏ మతమూ పనిగట్టుకుని ప్రచారం చేయలేదు. కుత్సిత బుద్ధితో కొందరు దుండగులు మతం పేరుతో, ధర్మస్థాపనపేరుతో మానవ హననానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోఉన్న రాజకీయపార్టీ దాన్నే ఇంకా కొనసాగిస్తోంది. దీన్ని దేశ ప్రజలు తప్పకుండా అడ్డుకోవల్సిఉంది. ఒకప్పటి గంగా జమునా తహజీబ్‌ను నిలుపుకోవాల్సి ఉంది.
మతం మాటున దాక్కునిఇతర మతస్థుల్ని దొంగ దెబ్బ తీయడం మానాలి! మనుషుల్ని విడగొట్టే మతాలెందుకూ అనే ప్రశ్న నేటి తరాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉంది. కులమతాల్ని వదిలేసి మనుషులు మనుషులుగా హాయిగా హుందాగా బతకొచ్చు కదా? అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి తన గేయంలో ‘మతం వద్దు గతం వద్దు మారణహోమం వద్దు’ అని అన్నారు. అంతేకాదు. ‘మతమన్నది నా కంటికి మసకైతే/మతమన్నది నా మనసుకు మబ్బయితే/మతం వద్దు గితం వద్దు మాయా మర్మం వద్దు/ ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే/కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే/మతంవద్దు గతంవద్దు మారణహోమంవద్దు/మతమన్నది లోకానికి హిత మైతే/ హిందువులం ముస్లింలం అందరమూ మానవులం/అందరమూ సోదరులం’ అని కూడా నొక్కిచెప్పారు కృష్ణశాస్త్త్రి, మతాలుమనుషుల్ని సన్మార్గంలో పెట్టలే నప్పుడు అవి విఫలమైనట్టేకదా అని మనమంటున్నాం. అలాంటప్పుడు వాటిని వదిలేస్తే వచ్చే నష్టం ఏముందనీ? ఇక్కడ ఇంతియాజ్‌మహ్మద్‌ అనే నాస్తికుడు చెప్పిన అంశంగూర్చి సీరియస్‌గా ఆలోచించాలి. ‘ఒకవేళ 190కోట్ల మంది ముస్లింలు, వారి మసీదుల్లో, 100కోట్ల మంది హిందువులు వారి దేవాలయాల్లో, 250కోట్ల మంది క్రైస్తవులు వారి చర్చిల్లో మూకుమ్మడిగా కేవలం ఒకేఒక్క మనిషి కాన్సర్‌తగ్గాలని ప్రార్థించారని అనుకోండి. ఆ ప్రార్థనలు ఫలిస్తాయా? ఫలించవు కదా! అన్ని కోట్ల మంది తప్పుడు నెంబర్‌కు ఫోన్‌ చేస్తున్నట్టే కదా? అదే ఎవరో ఒకరు ఆసుపత్రికి ఫోన్‌చేసి, అతణ్ణి తరలించారనుకోండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.’ ఇదీ వాస్తవం!! కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img