Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎరుపెక్కిన కనిగిరి

అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా సీపీఐ మహాసభలు

జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది పాల్గొన్న సీపీఐ శ్రేణులు
భారీ ర్యాలీ
ఆకట్టుకున్న డప్పుల ప్రదర్శన
విప్లవగేయాలతో ఉత్తేజపరిచిన కళాకారులు
ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విశాలాంధ్ర ` కనిగిరి : కనిగిరి ఎర్రజెండాతో ఎరుపెక్కింది. సీపీఐ జిల్లా 16వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన సీపీఐ జిల్లా 16వ మహాసభలు శుక్రవారం సాయంత్రం భారీ ర్యాలీ ప్రదర్శనతో ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత రాత్రి నుంచే జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడుతున్నా దానిని సైతం లెక్కచేయకుండా వాహనాలు ఏర్పాటు చేసుకొని ఎవరికివారే స్వచ్ఛందంగా కనిగిరి పయనమయ్యారు. శుక్రవారం సాయంత్రం పార్టీ శ్రేణులు ఎర్రజెండాను చేతపట్టి కనిగిరికి చేరుకోవడంతో కనిగిరి ప్రధానవీధులన్నీ ఎర్రజెండా మయమైంది. ముందుగా కనిగిరిలోని కందుకూరు రోడ్డులో ఆర్‌అండ్‌బి అతిథిగృహం వద్దకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీ అగ్రభాగాన డప్పు కళాకారులు నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఒకరిమీద ఒకరు నిల్చోని మరీ ప్రదర్శించిన డప్పు ప్రదర్శనకు అందరూ మంత్రముగ్దులయ్యారు. ఆర్‌అండ్‌బి అతిథిగృహం నుంచి వైయస్‌ఆర్‌ రోడ్డు మీదుగా ఎంఎస్‌ఆర్‌ రోడ్డు, కనిగిరి, ఒంగోలు, బస్టాండ్‌ మీదుగా పామూరు రోడ్డు నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బహిరంగవేదిక వద్దకు ర్యాలీ సాగింది. ర్యాలీలో రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు, మహిళలు సీపీఐ జెండా పట్టుకొని క్రమపద్దతిలో ఒకరితరువాత ఒకరు నిల్చోని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కనిగిరి పురవీధుల్లో చూపరులను బాగా ఆకట్టు కుంది. అనంతరం సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రాంగణంలో జరిగిన బహిరంగసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయగా మాజీ ఎంఎల్‌సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీజే చంద్రశేఖర్‌రావు, రావుల వెంకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కరవాది సుబ్బారావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రానాయక్‌ తరలివచ్చారు. ఈ సభకు సీపీఐ కనిగిరి నియోజకవర్గం కార్యదర్శి ఎస్‌డి యాసిన్‌ అధ్యక్షత వహించారు. సభ ప్రాంగణం ముందు ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవగేయాలు అందరినీ ఆకట్టు కున్నాయి. కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీపీఐ రాజీలేని పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీపీఐ శాఖ మహాసభల దగ్గర నుంచి జాతీయ మహాసభలు జరుపుకోబోతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల మహాసభలు పూర్తయ్యాయని ఆగస్టు 15 లోగా అన్ని జిల్లా మహాసభలు పూర్తి చేసి ఆగస్టు నెల ఆఖరులో విశాఖపట్నంలో మూడు రోజుల పాటు సీపీఐ రాష్ట్ర మమాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం విజయవాడలో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు ప్రపంచ దేశాల నుంచి సీపీఐ కమ్యూనిస్టు పార్టీ నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దారాధత్తం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పులతో దివాలా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రైల్వేజోన్‌, విశాఖ స్టీల్‌, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు సాధించుకోవడంలో ముఖ్యమంత్రి ఘోరంగా వైఫల్యం చెందారని తెలిపారు. వీటిని ఆడక్కపోగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూ రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులందరూ ఐక్యంగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల విధానాలపై పోరాడాలని కోరారు. ప్రశ్నించే గొంతునొక్కే విధంగా ప్రభుత్వాలు వ్యవహ రిస్తున్న తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజా హక్కులను ప్రశ్నించడం వారి హక్కు అని అన్నారు. అలాంటివారిపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుందని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి రానున్న రోజుల్లో పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసి 52 సంవత్సరాలు పూర్తవుతున్నా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని అన్నారు. విద్య, వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరదని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఏ ఒక్క పరిశ్రమ కూడా అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు అండగా ఉండాలని దానికి అందరూ నాయకత్వం వహించాలని కోరారు. ఈ సభకు సీపీఐ కనిగిరి నియోజకవర్గం కార్యదర్శి ఎస్‌డి యాసిన్‌ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎంఎల్‌సి పీజే చంద్రశేఖర్‌రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌ వెంకటరావు, వి హనుమారెడ్డి, పీవీఆర్‌ చౌదరి, అందె నాసరయ్య, కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు, ఎస్‌డి మౌలాలి, డి శ్రీనివాస్‌, కేవీ కృష్ణగౌడ్‌, కె వీరారెడ్డి, కాశిం, డి ఆంజనేయులు, ఎస్‌ రావమ్మ, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి ఎం వెంకయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న డప్పు ప్రదర్శన

సీపీఐ జిల్లా 16వ మహాసభల సందర్భంగా కనిగిరిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన భారీ ప్రదర్శనకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిమంది తరలివచ్చారు. ఈ సందర్భంగా కొత్తపట్నంకు చెందిన ప్రేమానందం డప్పు బృందం ర్యాలీ ప్రారంభంలోను, ర్యాలీ అగ్రభాగాన నిర్వహించిన డప్పుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా డప్పు కళాకారులు ఒకరిపై ఒకరు నిల్చోని గాలిలో డప్పులను వాయించడం విశేషంగా నిలిచింది. డప్పులు వాయిస్తూ నృత్యాలు చేయడం, ర్యాలీ ప్రారంభం నుంచి చివరివరకు డప్పులతో వివిధ విన్యాసాలు ప్రదర్శించారు. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ రామకృష్ణ నేతృత్వంలో డప్పుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
విప్లవగేయాలు ఆలపించిన ప్రజానాట్యమండలి బృందం

సీపీఐ మహాసభల సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళాకారులు ఆల పించిన విప్లవగేయాలు అందరినీ మంత్ర ముగ్ధు లను చేశాయి. వీరితో పాటు ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రానాయక్‌ గళం కలపడంతో విప్లవగేయాలకు అనూహ్య స్పందన లభించింది. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.రామకృష్ణతో పాటు ముత్తన అంజయ్య, నల్లూరి మురళితో పాటు ఇతర కళాకారులు ఆలపించిన విప్లవగేయాలు అందరినీ ఆకర్షించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img