Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలుగు అకాడమీ కనుమరుగు

ఇకపై తెలుగు, సంస్కృతం అకాడమిగా పేరు మార్పు
ఏపీ సర్కార్‌ మరో వివాదాస్పద నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
రాష్ట్ర ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును మారుస్తూ మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. దాదాపు అర్ధ శతాబ్దం క్రితం 1968లో ఏర్పాటైన తెలుగు అకాడమిని, ఇకపై తెలుగు,సంస్కృత అకాడమీగా పేరు మారుస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది అకాడమీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌లో నలుగురి నియామకం కూడా చేసింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డి. భాస్కర్‌ రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకులు డాక్టర్‌ నేలరాజ్‌ కుమార్‌, గుంటూరు జేకేసీ కాలేజి తెలుగు రిటైర్డ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం. విజయశ్రీ, ఎస్‌ఎంఎస్‌ బీఈడీ కళాశాలకు చెందిన లెక్చరర్‌ కప్పగంతు రామకృష్ణలను అకాడమీ బోర్డు సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ మురళీధర్‌ శర్మను అకాడమీలో పాలకవర్గ సభ్యులుగా, యూజీసీ నామినీగా నియమిస్తూ రాష్ట్ర ఉన్నత శాఖ స్పెషల్‌ చీఫ్‌

సెక్రెటరీ సతీష్‌ చంద్ర జీవో జారీ చేశారు. తెలుగుసంస్కృత అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియమించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో సైతం తెలుగు భాషను గుర్తించి, గౌరవిస్తుండగా, అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న తెలుగు అకాడమిని మరో భాషతో మిళితం చేస్తూ పేరు మార్పు చేయడం తెలుగు భాషను కించపర్చడమేనని విమర్శిస్తున్నారు.
తెలుగువారిని అవమానించేలా ఉంది`మండలి బుద్దప్రసాద్‌
తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత ఆకాడమీగా మార్చటాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విచిత్రమైనదిగా అభివర్ణించారు. ఈ నిర్ణయం ముమ్మాటీకీ తెలుగువారిని అవమానించటమేనన్నారు. తెలుగు భాషకు ఒక ప్రత్యేకమైన సంస్థ అవసరమని భావించి 1968లో పీవీ నరసింహారావు ఏర్పాటు చేసిన తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాషకు సంబంధించి అనేక పరిశోధనలు జరిగాయని గుర్తు చేశారు. తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కలపడం ద్వారా భాషకు ఎనలేని నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ లక్ష్యాలు, ఆదర్శాలు ఈ ప్రభుత్వానికి తెలియదని, తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయటం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పటికే తెలుగు ప్రాథమిక విద్య స్థాయిలో నిరాదరణకు గురవుతోందన్నారు. ఇప్పుడు అకాడమీ విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా మరింత నష్టం వాటిల్లుతుందన్నారు. తెలుగుకు, సంస్కృతానికీ వేర్వేరుగా ఆకాడమీలు ఉన్నప్పుడు మాత్రమే పరిశోధనలకు, భాష, సాహిత్య అభివృద్ధికి వీలు కలుగుతుందన్నారు. ఇప్పటికే తెలుగుకు సంబంధించి అన్ని సంస్థలు నిరాదరణకు గురవుతున్నాయని, అకాడమీ విషయంలో ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయాలన్నారు.
పేరు మార్చి సాధించే ప్రయోజనం ఏమిటి? పవన్‌ కళ్యాణ్‌
తెలుగు అకాడమి పేరు మారుస్తూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు భాష అభివృద్ధి కోసం, విద్యా విషయకంగా తెలుగు వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడమీ అస్తిత్వాన్ని దూరం చేసేలా పేరు మార్చారు. పేరు మార్చడం ద్వారా సాధించే ప్రయోజనం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. సంస్కృత భాష అభివృద్ధి కోసమే పేరు మార్పు అనుకొంటే ప్రత్యేకంగా సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయవచ్చు. ఢల్లీి ప్రభుత్వం అధ్వర్యంలో ఉన్న సంస్కృత అకాడమిలాంటిది ఇక్కడా ప్రారంభించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అకాడమి పేరు మార్పు నిర్ణయాన్ని తక్షణమే పునఃపరిశీలించాలి. తెలుగు అకాడమి అస్తిత్వాన్ని కాపాడేందుకు తెలుగు భాషాభిమానులు, భాషా శాస్త్రవేత్తలు ముందుకు రావాలని పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img