Friday, April 26, 2024
Friday, April 26, 2024

పట్టభద్రుల ఎన్నికల బరిలో దుప్పల

-ఇండిపెండెంట్ గా పోటీ
విశాలాంధ్ర – శ్రీకాకుళం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు ప్రముఖ వాణిజ్య వేత్త,ఉన్నత విద్యావంతుల కుటుంబానికి చెందిన దుప్పల రవీంద్రబాబు ప్రకటించారు.బుధవారం ఉదయం స్థానిక ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయం ప్రకటిస్తూ,శ్రీకాకుళం జిల్లా సమస్యలను ప్రస్తావించే కరపత్రాన్ని విడుదల చేశారు.ఉత్తరాంధ్ర కష్ట ,నష్టాలను శాసనమండలిలో ప్రస్తావించే ,ప్రశ్నించే గొంతునవుతానని,అందుకు మేధావి వర్గం అండ దండలు అందించాలని కోరారు.ఎ.యిలో బి.ఇ,ఎంబిఏ చదువుకున్న రవీంద్రబాబు ప్రస్తుతం వాణిజ్యవేత్తగా ఉంటూ,తన తండ్రి పేరిట ట్రస్ట్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.గతంలో బీజేపి పార్టీలో వున్నప్పుడు ,శ్రీకాకుళం ఎంపి అభ్యర్థిగా పోటీచేశారు.శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంకు డైరక్టర్ గా పనిచేశారు .మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు ,ప్రముఖ రచయిత నల్లి ధర్మారావు ఆయన కుటుంబ నేపధ్యాన్ని వివరించారు .రవీంద్రబాబు తండ్రి కృష్ణమూర్తి శ్రీకాకుళం గిరిజన ,రైతాంగ సాయిధ పోరాటంలో పాల్గొన్నారని,చండ్ర పుల్లారెడ్డి అనుచరునిగా వుంటూ,సికింద్రాబాద్ కుట్ర కేసులో ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించారని చెప్పారు.జైలు నుంచి విడుదలైన తరువాత జర్నలిస్టుగా జీవితం కొనసాగిస్తూ,అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు .రవీంద్రబాబు కుటుంబం ఉన్నత విద్యావంతుల కుటుంబం అని వివరించారు .ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన రవీంద్రబాబు ,సిక్కోలు జలసాధన , సంరక్షణ సమితి అధ్యక్షునిగా,ఒడిశాతో గల నదీ జలాల వివాదాలపై ఉద్యమం నడిపారని చెప్పారు.కరపత్రం విడుదల కార్యక్రమంలో మీడియా సంఘాల నాయకులు ఎన్.ఈశ్వరరావు ,చింతాడ అప్పలనాయుడు ,ఎంవి మల్లేశ్వరరావు ,చింతాడ కృష్ణారావు ,జివి నాగభూషణ్,శ్రీనివాస్ తో పాటు,జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శిష్టు రమేష్,ఉపాధ్యాయ సంఘ నాయకుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img