Monday, May 6, 2024
Monday, May 6, 2024

జాయింట్ కలెక్టర్ ఆనంద్ కు ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా అధికారులు


మొదటి మన్యంజిల్లా జాయింట్ కలెక్టరుగా ఆయన స్థానం పదిలం
విశాలాంధ్ర – పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లాలో ఏడాది పాటు దిగ్విజయంగా సేవలు అందించిన జాయింట్ కలెక్టర్ ఆనంద్ మంచి సేవా స్ఫూర్తి కలిగిన వ్యక్తని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. బదిలీపై వెళుతున్న జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ కు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాఅధికారులు, రెవిన్యూశాఖ అధికారులు, సిబ్బంది ఆద్వర్యంలో ఘనంగా సత్కరించారు. జిల్లాబృందంలో ఒకముఖ్యసభ్యుడిగా జాయింట్ కలెక్టర్ ఉండి జిల్లాలో కీలకమైన స్థానాన్ని దక్కించుకున్నారని చెప్పారు. జిల్లాలో భూసేకరణ, రీసర్వే, ధాన్యం సేకరణలో మంచి పనితీరు కనబరిచారని తెలిపారు. ధాన్యంసేకరణలో తీసుకున్న చొరవకు రైతుల తరపున కూడా కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. జనవరి 20 నాటికి లక్ష్యంమేరకు ధాన్యం కొనుగోలు పూర్తిచేశారని, చెల్లింపులు కూడా పూర్తిఅయ్యాయన్నారు. మంచి ప్రణాళికతో, సరైనతీరులో పనులు చేసారని చెప్పారు. మంచిసామర్థ్యం కలిగిన అధికారిగా, వ్యక్తిగా ఉండి మంచి సూచనలు, సలహాలు ఇచ్చేవారని ఆయన పేర్కొన్నారు. రీసర్వే పూర్తిచేసి 18వేల పత్రాలను కూడా పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆయన సేవలను కొనియాడారు.పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఆనంద్ మంచి దృక్పథం కలిగిన వ్యక్తన్నారు. వేగవంతమైన పనులకు నిలువుటద్దంగా నిలుస్తారని చెప్పారు. పనితనం, చాకచక్యంలో విశిష్ట శైలికలిగిన వ్యక్తిగా కొనియాడారు. జిల్లారెవిన్యూ అధికారి జె. వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ది పనులకు భూసేకరణ, అప్పగింత పనులను త్వరితగతిన చేపట్టారన్నారు. రీసర్వే వేగవంతం కావడానికి ఎంతో కృషిచేశారని ఆయన పేర్కొన్నారు. పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ పాలనాపరమైన అనేక అంశాలను జాయింట్ కలెక్టర్ వద్దనుండి మంచి మార్గదర్శత్వం పొందామని అన్నారు. ఆయన సేవలను కొనియాడారు.
బదిలీపై వెళ్తున్న సన్మాన గ్రహీత, జాయింట్ కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పార్వతీపురంలో పనిచేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. జిల్లాలో పనిచేయడం గొప్పఅనుభూతిని ఇచ్చిందన్నారు. జిల్లాలో మంచిబృందంతో పనిచేసిన అదృష్టం ఉందని ప్రశంసించారు. అందరి నుండి మంచి సహకారం లభించిందన్నారు. కొత్త జిల్లాలో అందరూ కలిసికట్టుగా పనిచేయడం ఇక్కడ మరువలేనిదని కొనియాడారు. ఇక్కడ ప్రజలు, రైతులు ఎంతో మంచివారని, వారికి సేవచేసిన అదృష్టం మరువలేనిదని తెలిపారు.
రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, రెవిన్యూ సంఘం సభ్యులు సూర్యనారాయణ, శ్రీరామమూర్తి, తహశీల్దార్ శివన్నారాయణ, గ్రామరెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు నాయుడులు జాయింట్ కలెక్టర్ సేవలను కొనియాడారు. ఏదిఏమైనా జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఆనంద్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటు ప్రజలు, రైతులు, పిర్యాదుదారులు, అటు అధికారులు ఎవరు ఎప్పుడు వెళ్ళిన ఓపికతో సమస్యని విని పరిష్కారం కోసం ఆయన నిరంతరం ఆలోచన చేసేవారు. స్పందనలో పిర్యాదుదారులుఆయనను కలిస్తే సమస్యను వెంటనే సంబంధిత అధికారులకు మాట్లాడి పరిష్కారం చేస్తారని అందరూ చెప్పేవారు. అన్నింటి కంటే ధాన్యం కొనుగోలు విషయంలో, డబ్బులు చెల్లింపులో ఆయన పాత్ర కీలకంగా చెప్పవచ్చును. ఆయన బదిలీ జిల్లా ప్రజలకు, రెవెన్యూ శాఖకు తీరని లోటని మాత్రం చెప్పక తప్పదు.
ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథరావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజులవీణ, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ,జిల్లా సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్ మూర్తి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయ గౌరి, జిల్లా గ్రామపంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా రవాణా అధికారి సి. మల్లిఖార్జునరెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి టి.వి.ఎస్.సుధాకర్, క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు, జిల్లా పరిశ్రమల అధికారి పి. సీతారాం, ఆర్.బి.ఎస్.కె ప్రాజెక్టు అధికారి డా. ధవళ భాస్కరరావు, జిల్లాలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img