Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిక్కోలు ఆవిష్కృతం

  • జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్

విశాలాంధ్ర – శ్రీకాకుళం: జిల్లా ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సిక్కోలు ఆవిష్కృతం అవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పిలుపునిచ్చారు. స్వచ్ఛత వైపు ఒక్క అడుగు కార్యక్రమం శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ కార్యక్రమం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి బయలుదేరిన ర్యాలీ స్థానిక గుడి వీధిలోని నాగావళి రివర్ వ్యూ పార్క్ వరకు కొనసాగింది. అనంతరం నగరపాలక సంస్థ కమీషనర్, స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులతో కలిసి నాగావళి నది తీర ప్రాంతంలో గల చెత్తను కలెక్టర్ సేకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో మూడున్నర లక్షలు జనాభాకు గాను ఐదు వందల మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఉన్నారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని తెలిపారు . ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడు సరాసరి సుమారు వంద గృహాల నుండి చెత్తను సేకరించాల్సి ఉందని ఇది సాధ్యపడదని, కాని వందమంది కూడా పారిశుద్ధ్య కార్మికులకు తోడుగా ఉంటే సాధ్యమవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో చెత్త కనిపించదని, మన దేశంలోనే చెత్త కనిపించడం సిగ్గుచేటుగా భావించాలని అన్నారు. మన దేశస్తులు ఇతర దేశాల్లో బాధ్యతగా వ్యవహరిస్తారని, కాని ఇక్కడ ఆ బాధ్యతను ఎందుకు తీసుకోమో మనకు మనమే ప్రశ్నించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చిన్న , పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ బాధ్యతగా గుర్తెరిగి చెత్తను పారద్రోలేందుకు ఒక్క అడుగు ముందుకు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ భాగస్వాములు అయినప్పుడే స్వచ్ఛ సిక్కోలు ఆవిష్కృతం అవుతుందని కలెక్టర్ వివరించారు. ఇది నిరంతర కార్యక్రమమని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలన్నారు. వార్డు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇదే స్ఫూర్తితో ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ అభిలషించారు. స్వచ్ఛ సిక్కోలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సిక్కోలుకు నా వంతు కృషి చేస్తానని సంతకాలు చేయాలని కోరుతూ, కలెక్టర్ తొలి సంతకాన్ని చేశారు. అనంతరం స్వచ్ఛ శ్రీకాకుళం ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొని అధికారులు అందరితో కలిసి ప్రతిజ్ఞ చేశారు.నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నామని అందులో భాగంగా స్వచ్ఛ సిక్కోలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. స్వచ్ఛ శ్రీకాకుళంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లెక్స్ బ్యానర్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. అందులో భాగంగా భూమిలో ఇమిడిపోయే బ్యానర్లను ప్రప్రథమంగా ఈ కార్యక్రమంలో వినియోగించడం జరిగిందని వివరించారు. అలాగే నగరంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీ బ్యానర్లలో భూమిలో ఇమిడిపోయే బ్యానర్లను తయారుచేసేలా ఫ్లెక్సీ యజమానులతో మాట్లాడటం జరిగిందని కమీషనర్ కలెక్టరుకు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల సంచాలకులు యార్లగడ్డ గీత శ్రీకాంత్, నటుకుల మోహన్, హారికా ప్రసాద్, సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి, లయన్స్ క్లబ్ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img