Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పరిహారంతో ప్రాణాలు తిరిగి వస్తాయా?: హైకోర్టు

హైదరాబాద్‌: పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు లాకప్‌లో మరియమ్మ మృతి ఘటనపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి గత నెలలో రీపోస్ట్‌ మార్టం పూర్తయిందని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మృతురాలి కుటుంబానికి రూ.15లక్షల పరిహారం, ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసినట్లు వివరించారు. ‘దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా’ అని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘పరిహారంతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా’ అని ప్రశ్నించింది. ఆలేరు మేజిస్ట్రేట్‌ నివేదిక అందిన తర్వాత విచారణ జరుపుతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. నివేదిక అందిన 4వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరియమ్మ లాకప్‌ డెత్‌పై విచారణ సెప్టెంబరు 15కి వాయిదా వేసింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడేనికి చెందిన మరియమ్మను జూన్‌ 18న రూ.2 లక్షల దొంగతనం కేసులో అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను విచారించి రూ. 1.35 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బుల కోసం మరియమ్మను ఠాణాకు పిలిపించి ప్రశ్నించారు. విచారణ సమయంలో ఆమె స్పృహ కోల్పోవడంతో పోలీసులు స్థానిక ఆర్‌ఎంపీకి చూపించారు. తర్వాత భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img