Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ముందు నీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూడు..హరీష్‌ రావుకు నిర్మలా సీతారామన్‌ కౌంటర్‌

బీజేపీ-టీఆర్‌ఎస్‌ కేంద్రంగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ పర్యటనలో భాగంగా కేసీఆర్‌ సర్కార్‌ను ఆమె టార్గెట్‌ చేశారు. బాన్సువాడలో రేషన్‌ షాప్‌ తనిఖీలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై ఆగ్రహం చెందిన ఆమె కలెక్టర్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు రేషన్‌ బియ్యం అంతా కేంద్రం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ చేరలేదని రుజువు చేస్తే నా పదవికి రాజీనామా చేస్తా.. చేరిందని తెలితే మీరు రాజీనామా చేస్తారా అంటూ సవాల్‌ విసిరారు.
ఈ క్రమంలో కామారెడ్డి జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా తెలంగాణ మంత్రులపై ఇవాళ నిర్మలా సీతారామన్‌ మాటలతో విరుచుకుపడ్డారు. ఒక ప్రశ్న అడిగితే నన్ను ప్రశ్నిస్తావా.. చెప్పేవాడికి చెబుతున్నా అంటూ కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధారిలో రైతులతో సమావేశమైన ఆమె.. శుక్రవారం తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారని ధ్వజమెత్తారు. ముందు నీ రాష్ట్రంలో ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారో చూడు అంటూ హరీశ్‌రావు టార్గెట్‌గా కామెంట్స్‌ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతులకు ఇవ్వాలని మంత్రి నిర్మల సీతారామన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా.. రైతుల కోసమే కదా అంటూ ప్రశ్నించిన నిర్మలాసీతారామన్‌, ఎవరు ఎక్కువ ఇచ్చారు ఎవరు తక్కువ ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు అంటూ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు జొన్న పంట వెయ్యొద్దు అని బెదిరిస్తుంది అని నిర్మల సీతారామన్‌ మండిపడ్డారు. వారి పంట కేంద్రం కొనుగోలు చేయడం లేదని ప్రచారం చేస్తుందని, ఇక వరి వేస్తే ఉరే అంటూ బెదిరింపు రాజకీయాలకు తెరతీసింది అని మండిపడ్డారు. రైతులపై మీకంత ప్రేమ ఉంటే రైతుల ఆత్మహత్యలు దేనికి చేసుకుంటున్నారు చెప్పండి ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలలో ఎంత రుణమాఫీ అయింది లెక్కలు చెప్పిన నిర్మలా సీతారామన్‌ కేంద్రం తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం ఏం చేసిందనేది ఏకరువు పెట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img