Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విచారణకు కవిత దూరం

. రాలేనని ఈడీకి లేఖ
. న్యాయవాదితో అధికారులకు పత్రాల అందజేత
. 20న హాజరు కావాలని మళ్లీ సమన్లు
. దిల్లీలో రోజంతా హైడ్రామా

న్యూదిల్లీ: దిల్లీ మద్యం కేసులో తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి గురువారం లేఖ రాశారు. విచారణకు కొన్ని గంటల ముందు ఆమె తన లేఖను అధికారులకు ఈ-మెయిల్‌లో పంపారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు ఉన్న కారణంగా ఈడీ ముందు హాజరు కాలేనని ఆమె పేర్కొన్నారు. మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 11న జరిగిన విచారణలో ఈడీ అధికారులు అడిగిన పత్రాలను తన న్యాయవాది భరత్‌ ద్వారా కవిత పంపారు. అయితే, ఆమె విజ్ఞప్తిని ఈడీ అధికారులు మన్నించారు. మార్చి 20వ తేదీన విచారణకు రావాల్సిందిగా మరోసారి నోటీసులు పంపారు. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనకు పంపిన సమన్లు కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాను పిటిషన్‌ దాఖలు చేశానని, ఇది విచారణలో ఉందని ఈడీకి కవిత తెలిపారు. ‘మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించొద్దు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధమే. అధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చు. ఈ నెల 11న జరిగిన విచారణకు పూర్తిగా సహకరించా. ఈడీ ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలు చెప్పాను. ఈ నెల 11న రాత్రి 8గంటల వరకు విచారించారు. ఇవాళ మళ్లీ రావాలని 11వ తేదీన సమన్లు ఇచ్చారు. వ్యక్తిగతంగా రావాలని సమన్లలో పేర్కొనలేదు. నా ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నా. మీరు అడిగిన వివరాలు భరత్‌ ద్వారా పంపాను. నా హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ఈ నెల 24న నా పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది’ అని కవిత తన లేఖలో పేర్కొన్నారు.దిల్లీ మద్యం కేసులో కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది. తాను నేడు విచారణకు హాజరుకాలేనని, మరో రోజు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొనడంతో మరో తేదీని ఖరారు చేస్తూ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న దాదాపు ఎనిమిది గంటల పాటు కవితను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు…16న మరోసారి విచారణకు రావాలని అదే రోజు సమన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, మళ్లీ హాజరుకావాలంటూ జారీ చేసిన సమన్లను సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన వ్యాజ్యంపై తక్షణ విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేపడతామని సీజేఐ స్పష్టం చేశారు. ఈ నెల 16న హాజరు కావడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిరచలేదు. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సైతం కోర్టు నిరాకరించింది. కవిత ఈరోజు ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో సమావేశం అనంతరం ఈడీకి ఈ మెయిల్‌ పంపారు.
అరుణ్‌ పిళ్లే ఈడీ కస్టడీ పొడిగింపు
ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అరుణ్‌ పిళ్లై కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ వాదనలు వినిపిస్తూ.. ‘ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరితో కలిపి పిళ్లైని ప్రశ్నించాల్సి ఉంది. 10 రోజుల కస్టడీలో పిళ్లై ముందు హోటల్‌ రికార్డులు, పత్రాలు ఉంచి విచారణ చేశాం. కొందరు నిందితులు, సాక్షులను కలిపి జరుపుతున్న విచారణ ఇంకా పూర్తి కాలేదు. అందుకని ఆ వ్యక్తులను మరోసారి విచారణకు రావాలని ఆదేశించాం. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కవిత ఇవాళ్టి ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ పరిస్థితుల్లో పిళ్లై కస్టడీ పొడిగించాల్సి ఉంటుంది’ అని కోర్టుకు ఈడీ వివరించింది. వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు.. మరో మూడు రోజుల పాటు పిళ్లై కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కవితను ఈడీ వేధిస్తోంది: న్యాయవాది భరత్‌
ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారులు అన్యాయంగా కేసులుపెట్టి వేధిస్తున్నారని ఆమె తరపు న్యాయవాది భరత్‌ అన్నారు. అనారోగ్యం అని అసత్యప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహిళను ఇంటి వద్దే విచారించాలని తెలిపారు. విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలో ఈడీ చెప్పలేదన్నారు. కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్‌ ఈ నెల 24న విచారణకు రానుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తదుపరి ఆదేశాల ప్రకారమే తాము ముందుకెళ్తామని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img