Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

మోదీతో రాజ్యాంగానికి ముప్పు

బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన మద్దతు సిగ్గుచేటు
రాష్ట్రానికి బీజేపీ అడుగడుగునా మోసం
జంగాల నామినేషన్‌ కార్యక్రమంలో నారాయణ

విశాలాంధ్ర – గుంటూరు: మతోన్మాద రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన వంతపాడటం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు పార్లమెంట్‌ సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌ మంగళవారం కలెక్టరేట్‌లో తన నామినేషన్‌ దాఖలు చేశారు. తొలుత శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగానికి, సెక్యులరిజానికీ ప్రమాదం ఏర్పడిరదని హెచ్చరించారు. మోదీ ఎలాగైనా తిరిగి ప్రధాని కావాలని చూస్తున్నారని, ఏకసూత్ర ప్రణాళిక అమలుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు దేశం కోసం అనేక త్యాగాలు చేశాయని, బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం సాగించి విజయం సాధించాయని గుర్తుచేశారు. కానీ దేశం కోసం బీజేపీ ఏమి చేసిందని నారాయణ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా పనిచేశాయని, దేశం కోసం త్యాగాలు చేసిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో ఏడాదికి రూ.45 వేల కోట్లు కోల్పోవడానికి ప్రధాన ముద్దాయిలు ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, జగన్‌మోహన్‌ రెడ్డి అని చెప్పారు. మోదీతో చంద్రబాబు అధికారిక పొత్తు పెట్టుకుంటే… జగన్‌ అనధికార పొత్తు కొనసాగిస్తున్నారని, వారిలో ఎవరికి ఓటు వేసినా అది మోదీకి వేసినట్లేనని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమిని గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ప్రజాస్వామ్యవాది జంగాల అజయ్‌కుమార్‌ గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయనకు కాంగ్రెస్‌, సీపీఎం మద్దతుగా నిలిచి… ఆయన గెలుపునకు కృషి చేయడం హర్షణీయమన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ మత ప్రాతిపదికన దేశాన్ని నిలువునా చీల్చడానికి మోదీ కుట్రపన్నారని విమర్శించారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా హిందువులను రెచ్చగొట్టి ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. మోదీ నాగరిక సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మోదీ ప్రమాదకర వ్యాఖ్యలపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, జగన్‌మోహన్‌రెడ్డి కనీసం స్పందించకపోవడం దారుణమని నిందించారు. మోదీ వ్యాఖ్యలను వారు బలపరుస్తారా… వ్యతిరేకిస్తారా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధాని రైతులను చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి నిలువునా ముంచారన్నారు. ఒకరు అరచేతిలో వైకుంఠం చూపి త్రీడి వేస్తే, మరొకరు రాజధాని భూములకు విలువ లేకుండా చేశారని విమర్శించారు. రాజధానితో పాటు రాష్ట్రాన్ని ముంచే ఇటువంటి వారికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. గుంటూరు జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థిని, మంగళగిరిలో సీపీఎం అభ్యర్థిని, మిగిలిన ప్రాంతాలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో నూతన ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ప్రోత్సహించాలని ప్రజలను ఆయన కోరారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత విధానాలతో దేశాన్ని పేదరికంలోకి నెడుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికలు ప్రజల భవిష్యత్తుకు కీలకమైనవని వ్యాఖ్యానించారు. దగాకోరు, అవకాశవాది అయిన మోదీ దేశంలో మూడవసారి అధికారం చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిన మోదీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని సైతం మోదీ విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటకు గిట్టుబాటు ధరలు లేక…పెట్టుబడి చేతికి రాక రైతు అల్లాడిపోతున్నాడని, వ్యవసాయ రంగం అతలాకుతలమైందన్నారు. అయినా మోదీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో మోదీ మద్దతు పార్టీలను ఓడిరచాలని పిలుపునిచ్చారు.
గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికలు అసాధారణమైనవన్నారు. రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. మతోన్మాదుల రాజ్యాంగం అమలు చేయడానికిగాను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని తొలగించాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆ దిశగా అడుగులు వేస్తారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఇండియా కూటమి గెలిస్తే అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులో ఉంటుందని చెప్పారు. ముస్లింలకు, క్రైస్తవులకు, పేదలకు అండగా కూటమి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు కోట మాల్యాద్రి, కె.నళినీకాంత్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్‌.రవీంధ్రనాథ్‌, ముఠా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చల్లా చిన ఆంజనేయులు, వెంకటసుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్‌, నాయకులు పిచ్చయ్య, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img