Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించితే మంచి భవిష్యత్తు..

ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థు లను తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలో చేర్పిస్తే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలో చేర్పించడం ద్వారా తల్లిదండ్రులకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, చదువు విషయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. అదే ప్రభుత్వ కళాశాలలో నిష్ణాతులైన శిక్షణ పొందిన అధ్యాపకులచే మంచి విద్యాబోధన ఉంటుందని, తద్వారా విద్యార్థులకు మంచి చదువు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు ముగిసాయని ఇక తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ లో ఏ కాలేజీలో చదివించాలన్న ఆలోచనలో ఉంటారని, ఆ ఆలోచనకు స్వస్తి చెప్పి తప్పక ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని వారు తెలిపారు. ఇంటర్మీడియట్ చదవడం అంటే ఇంజనీరింగ్, ఎంబిబిఎస్ చదువులకు ముఖ ద్వారం లాంటిదని తెలిపారు. మంచి కాలేజీలో చదువుకుంటే ఆ తర్వాత ఎంత బాధపడి లాభం లేదని అనే నమ్మకాలు ఎక్కువ ఉంటాయని తెలిపారు. కార్పొరేట్ కాలేజీల్లో నిజానికి ఎటువంటి అద్భుతాలు జరగని, విద్యార్థులపై చదువు ఒత్తిడి అధికంగా ఉంటుందని, స్వేచ్ఛాయిత వాతావరణము లేకపోవడం వలన నేడు విద్యార్థులు చదువు ఒత్తిడి తట్టుకోలేక, తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మనము ఎన్నో చూసామని వారు గుర్తు చేశారు. కార్పొరేట్ కళాశాలలు టీవీలలో పత్రికలలో అసత్య ప్రకటనలు చేస్తూ, లక్షల్లో తల్లిదండ్రుల ద్వారా ఫీజులను వసూలు చేయడం దారుణం కాదా? అని వారు ప్రశ్నించారు. కార్పొరేట్ కళాశాలలో వెనుకబడ్డ పిల్లలను అసలు పట్టించుకోరని, అటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో తల్లిదండ్రులు ఒకసారి గమనించాలని తెలిపారు. కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పిల్లలు బాగా ఎదిగే కీలకమైన వయస్సు, వీరికి విపరీతమైన ఒత్తిడిని పెంచుతారని తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు డబ్బు వ్యాపారం తప్ప చదువు విలువలు ఉండవని, పోటీ తప్ప తామే నెగ్గాలి అన్న భావన తప్ప, విలువలు నేర్పరని తెలిపారు. అంతేకాకుండా కార్పొరేట్ కళాశాలలో చదివి బయటకు వచ్చినవారు జ్ఞానం లేని ఏకాకులుగా మారుతున్న సంఘటనలు కూడా చూడడం జరిగిందని, మంచితనానికి దూరం అవుతున్నారని తెలిపారు. అదే ప్రభుత్వ కళాశాలలో వారి టార్గెట్ మేరకు సబ్జెక్టు మీద పట్టు సాధిస్తారని, విద్యార్థులను స్వతంత్రంగా ఎదిగేలా చూస్తారని, తక్కువ మంది విద్యార్థులు ఉన్నందువలన చదువులో వెనకబడ్డ వాళ్ల మీద కూడా చక్కటి శ్రద్ధను కూడా కనపరుస్తారని తెలిపారు. ఈ కారణంగా చదువులోనే కాదు జీవితంలో కూడా వీరు రాణించడం జరుగుతుందని తెలిపారు. కావున తల్లిదండ్రుల్లారా!! కొంచెం ఆలోచించండి!! నిజాలు ఏంటో తెలుసుకోండి!! మీ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించండి అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img