Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

చలివేంద్రి రైతులకేసుల ఎత్తివేతలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టరుల నిర్ణయంపై సర్వత్రా హర్షనీయం

విశాలాంధ్ర-పార్వతీపురం : మన్యం జిల్లాలోని పాలకొండ రెవెన్యూ డివిజన్ వీరఘట్టం మండలం చలివేంద్రి రైతుల సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కారంచేయటంలోను, రైతులపై పెట్టినకేసులు 24గంటల వ్యవధిలో ఎత్తివేయడంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆనంద్ లు సమిష్టిగా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇటు అధికారులతోపాటు అటురైతులుకూడా తాము జిల్లాకు పెద్దయిన జిల్లా కలెక్టర్ పై వ్యవహరించిన తీరును,చేసిన తప్పును తెలుసుకొని శుక్రవారం సాయంత్రం గ్రామంలోని రైతులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయంకు విచ్చేసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడులను కలిసి తమ తప్పును పెద్ద మనస్సుతోమన్నించాలని కోరడంతో సమస్య సామరస్య పూర్వకంగా పరిష్కారం జరగడానికి కారణమైనది. ధాన్యం కొనుగోలు జరగలేదనే కొంతఆవేశంతో తెలియక పొరపాటు చేసామని మన్నించాలని రైతులు చెప్పినమాటలు జిల్లా కలెక్టర్,ఎస్పీలను ఆలోచింపజేసాయి.
ఇదేసమయంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రైతులతో మాట్లాడినమాటలు, వారితోకలిసి తీసుకున్నఫొటోలతీరును చూసి రైతులు ఎంతో ఆనందపడుతూ పదిమందికి చెబుతున్నారు. నేనుకూడా మీలో ఒక కుటుంబ సభ్యుడుగా భావిస్తున్నానని, ఇక్కడ ప్రజలకు మంచి సేవలు అందించాలని వచ్చానని, జిల్లాలో మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రతీచోట ఏదోఒకసమస్య తనదృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించుటకు శక్తిమేరకు కృషిచేస్తున్నానని జిల్లా కలెక్టర్ చెప్పిన మాటలు ఎంతో అభినందనీయం. కుటుంబ సభ్యునిగా భావించండి…ఎక్కువ సేవలు అందించుటకు సహకరిస్తాను అన్న మాటలు రైతులనే కాకుండా జిల్లా ప్రజలను ఆనదింపజేసాయి. మరోవైపు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ నాయుడు  ప్రజలసమస్యల పరిష్కారంకు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, జాయింట్ కలెక్టర్ ల కార్యాలయాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పడం, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరడం, ఆయన ఆద్వర్యంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం గూర్చి చెప్పడం, రైతులపై కేసులు నమోదు చేసిన అరెస్టులులేకుండా చూడటం, 24గంటల వ్యవధిలో కేసులను ఎత్తివేయాలని నిర్ణయించిన తీరును జిల్లా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన చిరునవ్వుతో ఆయనకార్యాలయానికి వచ్చే ప్రతీ ఒక్కరితో మాట్లాడేతీరు వల్లనే నేడు ఆయన  రైతుల కేసుల పరిష్కారంలోతీసుకున్న చొరవను జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు
 
ఈఏడాది నిర్దేశింబడిన ధాన్యం లక్ష్యాలు నెరవేర్చడంలో జాయింట్ కలెక్టర్ ఆనంద్ పాత్రను కీలకంగా చెప్పవచ్చు.రాత్రనక, పగలనక రెవెన్యూ సమస్యలు, రీసర్వే సమస్యలు ప్రక్కనపెట్టీ ధాన్యం సేకరణపై ఆయన తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం. వారితో పాటు కలసిపనిచేస్తున్న జిల్లా అధికారులు,పాలకొండ,పార్వతీపురం రెవెన్యూ, పోలిస్ డివిజన్ అధికారుల కృషి అభినందనీయం. ఇదేసమయంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్,వ్యవసాయ, పౌరసరఫరాల అధికార యంత్రాంగం ఒక్కసారి ధాన్యంకొనుగోలుపై పునః సమీక్ష చెయ్యాల్సిన అవసరం ఎంతైనఉంది. ఎన్నడూ లేనివిధంగా  ఈఏడాది వరిపంట దిగుబడి బాగా వచ్చిందని,ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యంతోపాటు మన్యం జిల్లాలోమరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయన్నది వాస్తవం. ఎక్కువగా పాలకొండ నియోజక వర్గంలోనే ఉండటంతో అక్కడ రైతులు ఆవేధనను గుర్తించి ప్రభుత్వం దృష్టికి సమస్య తీవ్రతను తెలియజేసి పూర్తిగా పరిష్కారం చేస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. అటుశ్రీకాకుళం, ఇటుపార్వతీపురం మన్యంజిల్లాలోని ప్రజలు కష్టపడి పనిచేసే వారని, వారికి కల్మషం ఉండదని, ఎంతో అవేదనఉంటే తప్ప ఇటువంటి సంఘటనలు జరగవని అధికారులు కూడా గమనించాలి. చలివేంద్రి రైతుల సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేయడానికి పాలకొండ డి.ఎస్పీ కృష్ణారావు, సీఐ మురళీదర్, ఎస్ఐ హరికృష్ణలు కూడా సామరస్య పూర్వకంగా వ్యవహరించిన తీరును అక్కడ రైతులు, ప్రజలు అభినందిస్తున్నారు. ఇదంతా పరిశీలించి విఆర్లో ఉంచిన ఎస్ఐ హరికృష్ణని కూడా తిరిగి విధుల్లోకి తక్షణమే తీసుకోవడం చేస్తే ఎంతో బాగుంటుందిమరి.
రైతులపై కేసులు ఎత్తివేత హర్షణీయం:
వీరఘట్టంమండలం చలివేంద్రి రైతులపై పెట్టిన కేసులు తక్షణమే ఎత్తివేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధానకార్యదర్శి బుడితి అప్పల నాయుడు, సీపీఐ మన్యంజిల్లా ప్రధాన కార్యదర్శి కె మన్మధరావు, సహాయ కార్యదర్శి జీవన్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ల తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img