Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

150 ఎంబిబిఎస్ సీట్లు మంజూరు
రూ. 8.6 కోట్ల‌తో స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో స‌దుపాయాలు
కొత్త‌వాటిలో..ప్రారంభం కానున్న మొద‌టి క‌ళాశాల మ‌న‌దే

విశాలాంధ్ర -విజ‌య‌న‌గ‌ర ః జిల్లా ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ నెర‌వేరింది. జిల్లాలో ప్ర‌భుత్వ వైద్య‌క‌ళాశాల సేవ‌లు త్వ‌ర‌లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. మెడిక‌ల్ కాలేజ్‌ త‌ర‌గ‌తుల‌ను వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం 2023-24 నుంచి ప్రారంభించేందుకు, నేష‌న‌ల్ మెడిక‌ల్ క‌మిష‌న్ అనుమ‌తులు మంజూరు చేసింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లా వైద్య క‌ళాశాల‌కు 150 ఎంబిబిఎస్‌ సీట్లు మంజూరు చేసిన‌ట్లు పేర్కొన్నారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రంలో వైద్య‌క‌ళాశాల‌ మొద‌టి బ్యాచ్‌కు ప్ర‌వేశాలు జ‌రుగుతాయ‌ని తెలిపారు. కాగా రాష్ట్రంలో కొత్త‌గా మంజూరైన 16 ప్ర‌భుత్వ వైద్య‌ క‌ళాశాలల్లో, మొట్ట‌మొద‌టిగా అనుమ‌తులు పొంది ప్రారంభానికి సిద్ద‌మైన క‌ళాశాల మ‌న‌దే కావ‌డం విశేషం.

స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో సౌకర్యాలు
ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ను తాత్కాలికంగా ప్రారంభించేందుకు, జిల్లా స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రిలో ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసుప‌త్రి రూపురేఖ‌ల‌ను మార్చివేసి, ఆధునిక వ‌స‌తుల‌ను క‌ల్పించారు. ఆసుప‌త్రి ప‌రిశ‌రాల‌ను సుంద‌రంగా తీర్చిదిద్దారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియ‌మించారు. సుమారు 8.6 కోట్ల రూపాయ‌ల‌ ఖ‌ర్చుతో అవ‌స‌ర‌మైన భ‌వ‌నాల‌ను నిర్మించి, వ‌స‌తుల‌ను ఏర్పాటు చేశారు. ఔట్ పేషెంట్‌ రిజిష్ట్రేష‌న్ రూమ్‌, లెక్చ‌ర్ గ్యాల‌రీని నిర్మించారు. మొత్తం 30 ప‌డ‌క‌ల‌తో ఎన్ఐసియు, ఐసియు, ఎస్ఐసియు స‌దుపాయాల‌ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక ఆప‌రేషన్ థియేట‌ర్‌ను ఇప్ప‌టికే అందుబాటులోకి తెచ్చారు. గ‌ర్భిణులు, చిన్న‌పిల్ల‌ల కోసం ఘోషా ఆసుప‌త్రిని అభివృద్ది చేశారు. వైద్య క‌ళాశాల ఏర్పాటు కోసం మౌలిక వ‌సతుల‌ను క‌ల్పించ‌డ‌మే కాకుండా, దీనికి అవ‌స‌ర‌మైన ప్రిన్సిపాల్‌, ప్రొఫెస‌ర్లు, వైద్య నిపుణులు, ఇత‌ర‌ సిబ్బంది నియామ‌కాల‌ను కూడా దాదాపు పూర్తి చేశారు.

శ‌ర‌వేగంగా ప్ర‌భుత్వ వైద్య‌క‌ళాశాల‌
గాజుల‌రేగ వ‌ద్ద 500 కోట్ల రూపాయ‌ల‌తో వైద్య క‌ళాశాల శాశ్వ‌త భ‌వ‌నాల‌ నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 16 ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేయ‌గా, వీటిలో త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించేందుకు అనుమ‌తి పొందిన తొలి క‌ళాశాల మ‌న‌దే కావ‌డం గ‌ర్వ‌కార‌ణం. ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణ ప‌నుల‌ను ఇటీవ‌లే రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని ప‌రిశీలించారు. రాష్ట్ర‌స్థాయి ఉన్న‌తాధికారులతోపాటు జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, ఎపిఎస్ఎంఐడిసి ఎస్ఈ శివ‌శంక‌ర్‌, ఇఇ స‌త్య‌ప్ర‌భాక‌ర్ ఈ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. నాగార్జున క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో రోజుకు 200 మంది నిపుణులు నిర్మాణ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఫ‌లితంగా వైద్య క‌ళాశాల నిర్మాణ ప‌నుల ప్ర‌గ‌తిలో మ‌న జిల్లా, ఇత‌ర జిల్లాలతో పోలిస్తే, మొద‌టి స్థానంలో ఉండ‌టం విశేషం. సుమారు 35 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో, పివిబి స్ట‌క్చ‌ర్ విధానంలో, వైద్య క‌ళాశాల త‌ర‌గ‌తుల భ‌వ‌నాన్ని త్వ‌ర‌లో ప్రారంభించేందుకు సిద్దం చేస్తున్నారు. ఇక్క‌డే ఎంబిబిఎస్ మొద‌టి సంవ‌త్స‌ర త‌ర‌గ‌తులను వ‌చ్చే ఏడాది నుంచి నిర్వ‌హించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img