Friday, April 26, 2024
Friday, April 26, 2024

బిందెడు నీరు దొరకని సత్యవరం…

పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి….

ఒంటి పూట కుళాయిల వద్ద గృహిణుల ఎదురుచూపులు..

విశాలాంధ్ర – పెనుమంట్ర : సత్యవరం గ్రామం లో ఎన్నడు లేని విధంగా బిందెడు నీటి కోసం ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే ఒంటి పూట సరఫరాకు పంచాయతీ నడుం బిగించింది. ఒంటి పూట సరఫరాలో సైతం కుళాయిల నుండి గాలి మినహా నీరు రావడంలేదని మహిళలు వాపోతున్నారు. గంటల తరబడి కుళాయిల వద్ద వేచి ఉన్నా, బిందెడు నీరు లభించడం దుర్లభమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయి ఇచ్చే సమయానికి కరెంటు లేకపోతే ఆ నీరు కూడా ఇచ్చే పరిస్థితి గ్రామంలో లేదని, వేసవి ప్రారంభం కాకుండానే గ్రామంలో త్రాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి వేసవిలో గ్రామంలో కుళాయిల వద్ద నీటి కోసం క్యూ కట్టడం, బిందెలతో కొట్టుకోవడం పరిపాటిగా మారింది. ప్రతిరోజు వాలంటరీలకు, పంచాయతీ వారి వద్దకు వెళ్లి కుళాయి నీటి కోసం ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఈ సమస్య పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకు వెళుతూనే ఉన్నారు. కానీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. చివరకు వేసవి ముగిసాక మాత్రం వేసవిలో నీటిని చివరి ప్రాంతాలకు తరలించి నందుకు అన్ని లక్షలు ఖర్చు జరిగిందని అజెండాలోని అంశంగా చేరుస్తారు.
కుళాయి పన్ను కట్టకపోతే ఇంటికి వచ్చి ఇబ్బంది పట్టే పంచాయతీ వారు మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఇది వాస్తవమా కాదా.. అనేది ఉన్నత అధికార యంత్రాంగం త్వరలోనే తేల్చవలసి ఉంది. ఒంటి పూట నీళ్ల సవాళ్లను అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే ప్రజలే పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన పరిస్థితి దాపురిస్తుందని కుళాయిల వద్ద నీటి కోసం పడిగాపులు కాస్తున్న గృహిణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img