Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాక్షస పాలనకు చరమగీతం

ఎన్నికలకు సిద్ధం కండి
దృష్టి మరల్చేందుకే కోనసీమ అల్లర్లు
సామాజిక న్యాయమంటూ సహచర దొంగలకు రాజ్యసభ సీట్లు
తప్పులు ప్రశ్నిస్తే కేసులా: మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీనే హత్య చేస్తాడు… దానిని పక్కదారి పట్టించేందుకు ప్రశాంతంగా ఉన్న కోనసీమలో అల్లర్లు సృష్టించి కులాల మధ్య చిచ్చు రేపుతారు. సామాజిక న్యాయం అంటూ సహచర దొంగలకు రాజ్యసభ సీట్లు కేటాయిస్తారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారు… దాడులు చేస్తారు… మరోపక్క పేదలపై బాదుడే బాదుడుతో పన్నులు విధిస్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రత్యేక హోదా, పోలవరాన్ని గాలికొదిలేశారు… రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశంపై ఉంది. రాష్ట్రం దశ, దిశ మార్చే విధంగా కార్యకర్తలు మహానాడు నిర్ణయాలతో ఎన్నికలకు సిద్ధం కావాలి… క్విట్‌ జగన్‌… సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో ముందుకెళ్లాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు ఒంగోలులో జరుగుతున్న మహాసభలను చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు.

విశాలాంధ్ర బ్యూరో ` ఒంగోలు : తెలుగు ప్రజల గుండెల్లో నుంచి ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకొని ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన మహానాడుకు తెలుగుతమ్ముళ్లు కదం తొక్కారు. వేలాది మంది ఎండను సైతం లెక్కచేయకుండా మహానాడుకు తరలివచ్చారు. మహానాడు శుక్రవారం ఉదయం ప్రతినిధుల సభతో మొదలైంది. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోటో ప్రదర్శనను, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వేదికపైకి వచ్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మరణించిన పార్టీ కార్యకర్తలకు నివాళిగా మౌనం పాటించి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహానాడు ప్రారంభ ఉపన్యాసాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తూ రాష్ట్రంలో వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో జరుగుతున్న మహానాడు రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే విధంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు, తరువాత అని చెప్పుకునే స్థాయికి తెలుగుదేశం ఎదిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులు చేసి తమ పైనే కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన అన్నారు. నాడు రౌడీలను అణచివేసిన పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఉన్మాది పాలనలో గాడితప్పిందని చెప్పారు. జగన్‌ను నమ్ముకున్న అధికారులు సైతం జైలుకెళ్లారని, జగన్‌ మాటలు విని అధికారులు తప్పు చేస్తే మున్ముందు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పన్నులు, ధరలు… ప్రజలపై బాదుడే బాదుడుతో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, రైతులకు జగన్‌ పాలనలో తీవ్ర ద్రోహం జరిగిందని, కనీస గిట్టుబాటు ధర అందలేదని తెలిపారు. గతంలో రూ.50 వేల రుణ బాకీ చేస్తే జగన్‌ రూ.7 వేలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. జగన్‌ చెప్పిన మద్య నిషేధం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ఇక అభివృద్ధి ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక, సిమెంటు, స్టీలు ధరలు పెరిగి పేదవాడు ఇళ్లు కట్టుకునే పరిసితి లేదని అన్నారు. మూడేళ్లలో మూడు ఇళ్లు కట్టిన జగన్‌ ఇప్పుడు 30 లక్షల ఇళ్లు కడతానని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, టీడీపీ హయాంలో 25 వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే జగన్‌ హయాంలో రెండు కిలోమీటర్లు కూడా వేయలేదని తెలిపారు. మరలా వర్షాకాలం వస్తుందని, రోడ్లపై నాట్లు వేసి చేపలు కూడా పట్టవచ్చని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రజలు సీఎం సీఎం అంటూ నినాదాలు ఇస్తున్నారని… నాకు సీఎం పదవి కొత్త కాదని… రాష్ట్రం కోసమే నా పోరాటం అని అన్నారు. ఒక్క ఛాన్స్‌ అని జగన్‌కు అవకాశం ఇస్తే కరెంటు తీగను ఒక్కసారి పట్టుకుంటే ఏమైందో అదే అయిందని తెలిపారు. డ్రైవర్‌ను చంపిన ఎమ్మెల్సీని రక్షించేందుకే ప్రశాంతంగా ఉన్న కోనసీమలో అల్లర్లు సృష్టించి కులాల మధ్య చిచ్చు పెట్టింది జగన్‌మోహన్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు బాబాయి హత్యను గుండెపోటుగా మార్చి జగన్‌ సానుభూతి పొందాడని, గుండెపోటు కాదు… గొడ్డలిపోటు కథ ఏమైందని ప్రశ్నించారు. కోడికత్తి ఒక డ్రామాగా చేసిన జగన్‌… అధికారం కోసం చెల్లిని, అమ్మను కూడా దూరం చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రం ఒక ఉన్మాది చేతిలో ఉందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. దీనికోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో రాష్ట్ర భవిష్యత్తు దిశ దశ కావాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ఈ తెలుగుదేశం మరో 40 ఏళ్లు సమర్ధంగా పని చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇచ్చి ప్రోత్సహిస్తామని అన్నారు. జగన్‌ రాజకీయాల నుంచి దిగిపోతే తప్ప ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నా క్విట్‌ జగన్‌… సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఇదే లక్ష్యంతో పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహానాడులో మాజీ మంత్రులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు 17 అంశాలపై ప్రవేశపెట్టిన తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప, పితాని సత్యనారాయణ, యనమల రామకృష్ణుడు, రావుల చంద్రశేఖర్‌, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, అనిత, కళావెంకట్రావు, ధూళిపాళ్ల నరేంద్ర, దామచర్ల జనార్ధన్‌, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్‌ విజయ్‌కుమార్‌, కందుల నారాయణరెడ్డి, సాయికల్పనారెడ్డి, పమిడి రమేష్‌, సుహాసిని, ఉమ్మడి సంధ్యారాణి, జనార్ధన్‌రెడ్డి, రవిచంద్ర, శ్రావణ్‌, గూడూరి ఎరిక్షన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img