Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇక సమరమే

సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
రెండు రోజుల్లో భేటీకి హామీ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించకుంటే, ఇక ఆందోళన అనివార్యమని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. దానిపై రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల కీలక సమావేశం మంగళవారం జరిగింది. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని, పెండిరగ్‌ డీఏలు, పీఆర్సీ అమలు చేయాలని ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. సీపీఎస్‌ రద్దుకు చర్యలు తీసుకోవాలని తదితర సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగులకు దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ ఇస్తుందన్న ఆశతో ఉన్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలపగా, పీఆర్సీ అతి త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సజ్జల హామీ ఇచ్చారు. వాటితో పాటు ఉద్యోగులకు చెందిన ఏడీలు, ఇతరత్రా సమస్యలపై రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో భేటీ నిర్వహిస్తామని అన్నారు. ఏపీ జేఎసీ చైర్మన్‌ బండి శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని సజ్జల దృష్టికి తీసుకొచ్చామని, వాటిపై సానుకూలంగా స్పందించారన్నారు. ఉద్యోగులకు కింద స్థాయిలో చాలా సమస్యలు తలెత్తుతున్నా యని, 12వ తేదీ వచ్చినా పదవీ విరమణ ఉద్యోగులకు పెన్షన్లు రావడం లేదని తెలిపారు. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బులు రావడం లేదని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరామని మెడికల్‌ అండ్‌ హెల్త్‌లో ప్రమోషన్లపైనా సజ్జల సానుకూలత వ్యక్తం చేశారన్నారు. ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమానికి సన్నద్దమవుతామని చెప్పారు. అనంతరం సీఎస్‌ సమీర్‌ శర్మను ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసులు, నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు, వైవీరావు తదితరులు కలిసి వినతిపత్రం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img