Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అందరి నోటా అమరావతే

రెండవ రోజు 12.6 కిలోమీటర్లు కొనసాగిన మహాపాదయాత్ర
గ్రామాల నుంచి ఘనస్వాగతం
రైతులు, మహిళల నినాదాలతో దద్దరిల్లిన రాజధాని ప్రాంతం
ఇకనైనా రాజధానిపై డ్రామాలు ఆపండి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో ` గుంటూరు : రాజధాని అమరావతి కోసం అక్కడి ప్రజలు, రైతులు, రైతు కూలీలు చేస్తున్న పోరాటం ‘మహాపాద యాత్ర’గా ఉవ్వెత్తున ఎగసింది. రోజులు గడుస్తున్నా ఎత్తిన జెండా దించకుండా దిక్కులు పెక్కటిల్లేలా ఉద్యమ నినాదాలను వినిపిస్తూ ఎన్నో ఆంక్షలు, కేసులను భరిస్తూ, వానొచ్చిన వరదొచ్చినా తట్టుకుని, కరోనా భూతం కోరలు చాచినా చెక్కుచెదరని మనోధైర్యంతో న్యాయం కోసం ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ మహాపాద యాత్రను ప్రారంభించి ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్ర మంగళవారం రెండవ రోజు తాడికొండలో ఉదయం 8.45కు ప్రారంభమై తాడికొండ అడ్డరోడ్డు, లాం, గోరంట్ల మీదుగా సాయంత్రం 6 గంటలకు నగరాలులోని బండ్లమూడి గార్డెన్స్‌కు చేరుకుంది. ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో వారు న్యాయం కోసం, సాయం కోసం తొక్కని గడప లేదు, కలవని నాయకులు లేరు. తమ గోడును విన్నవిస్తూ నాయకులందరికీ లేఖలు సైతం రాశారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం రాజధాని అమరావతిని ప్రకటించాలని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఈ మహాపాద యాత్రకు ప్రతి గ్రామం నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. అమరావతే రాజధాని అంటూ నినాదాలు చేస్తూ రైతులను ప్రజలంతా ఉత్సాహపరుస్తున్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా చెదరని సంకల్పంతో అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. రెండవ రోజు యాత్రలో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అమరావతి రైతులకు మద్దతు పలికి సంఫీుభావంగా తాడికొండ అడ్డరోడ్డు నుంచి లాం వరకు మహాపాద యాత్రలో భాగస్వాములయ్యారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, కోట మాల్యాద్రి, కంచర్ల కాశయ్య, భైరాపట్నం రామకృష్ణ, ముప్పాళ్ల శివశంకర్‌, జి.వి.రాజు, జేఏసీ నేతలు పువ్వాడ సుధాకర్‌, శివారెడ్డి, రాయపాటి శైలజ, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, రాయపాటి శ్రీనివాస్‌, వివిధ పార్టీలకు చెందిన నేతలు, మహిళలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొని మద్దతు పలికారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజధాని అమరావతిపై ఇకనైనా డ్రామాలు ఆపి రాజధాని అమరావతే అని మహాపాద యాత్ర తిరుపతి చేరేలోపు స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అమరావతి ఉద్యమానికి సంఫీుభావం ప్రకటించిందని, కేంద్రంలో మోదీ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. రాజధాని విషయంలో ప్రధాని మోదీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలని, అమరావతే రాజధానిగా కొనసాగుతుందని తెలిపారు. సీఎం జగన్‌ రాజధాని విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నాయని గుర్తుచేశారు. అసెంబ్లీ సాక్షిగా రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తానని స్పష్టం చేసిన జగన్‌ నేడు మాట తప్పాడని విమర్శించారు. జగన్‌ నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని పరిరక్షణ జేఏసీ చేస్తున్న ఉద్యమాలకు, పాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పునరుద్ఘాటించారు.
మూడవ రోజు రూట్‌ మ్యాప్‌
అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న రైతులు చేపట్టిన పాదయాత్ర మూడవ రోజు గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌ నుంచి పుల్లడిగుంట వరకు కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై 13.5 కిలోమీటర్ల మేర కొనసాగే మహాపాద యాత్రలో మధ్యాహ్నం నల్లచెరువు వద్ద భోజన విరామం ఉంటుంది. తిరిగి మళ్లీ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పుల్లడిగుంట వద్ద మూడవ రోజు పాదయాత్ర ముగియనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img