Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ముంబైలో ‘ఒమిక్రాన్‌’ కలవరం

యుద్ధ ప్రాతిపదికన వాక్సిన్‌ పంపిణీ
రాత్రిళ్లూ అందుబాటులో టీకా కేంద్రాలు

ముంబై : కరోనా రెండో దశలో దేశంలోనే అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ముంబై నగరాన్ని మళ్లీ ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వణికిస్తోంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల్లో దాదాపు సగం కేసులు మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 28 కేసులు బయటపడ్డాయి. మంగళవారం ఒక్కరోజే 8 కేసులు వెలుగుచూడగా.. అందులో ఏడు కేసులు ముంబైలో నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 12కు చేరింది. ఈ నేపథ్యంలో వాక్సిన్‌ పంపిణీని యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని అక్కడి మహా వికాస్‌ అఘాది ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలో రాత్రిపూట కూడా టీకాలు వేసేందుకు ముంబై నగరపాలక సంస్థ (బీఎంసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. రాత్రిపూట టీకా సెషన్లు ప్రారంభించి అర్హులకు అందించే కార్యక్రమం మొదలుపెట్టింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలోని అన్ని వార్డుల్లో సంచార బృందం లేదా వాక్సినేషన్‌ కేంద్రాలు పనిచేయనున్నట్లు బీఎంసీ ప్రకటించింది. రైల్వేస్టేషన్లు, మురికివాడలు, నిర్మాణ ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో టీకాలు వేసేందుకు సంచార వైద్య బృందాలు ఉంటాయి. కార్మికులు, రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులు, చిరువ్యాపారుల కోసం ప్రత్యేక టీకా కేంద్రాలు, సంచార బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా, పెద్ద సంఖ్యలో టీకాలు తీసుకోని వారు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక రోగనిరోధక సెషన్‌ నిర్వహించనున్నారు. కొన్ని వార్డుల్లో ఈ కార్యక్రమం సోమవారమే ప్రారంభం కాగా మంగళవారం నుంచి ప్రతి వార్డులో కనీసం ఒక టీకా కేంద్రం అందుబాటులో ఉంచుతున్నట్లు బీఎంసీ ఆరోగ్య కార్యనిర్వాహక అధికారి మంగళ గోమరే పేర్కొన్నారు. ముంబైలో ఇప్పటికే 80 శాతం మంది రెండు డోసుల వాక్సిన్‌ తీసుకున్నారు. ఇంకా 20 శాతం మంది రెండో డోసు తీసుకోవాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img