Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పెట్రో ధరల నుంచి ఊరట కలిగిస్తాం

కేంద్రమంత్రి పూరి వెల్లడి
న్యూదిల్లీ: ఆకాశాన్నంటిన ఇంధన ధరల నుంచి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు కేంద్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి సోమవారం రాజ్యసభకు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, అయితే, అది ఇంకా ఆచరణకు నోచుకోలేదని పెట్రోలియం, ఖనిజవాయువుల శాఖమంత్రి హర్‌దీప్‌సింగ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశ అవసరాల కోసం విదేశాల నుంచి 85శాతం ముడిచమురును కొనుగోలు చేయాల్సి వస్తున్నదని, అందువల్ల చమురు ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. జీఎస్‌టీ వచ్చిన కొత్తలో పెట్రోలియం ఉత్పత్తులను దాని పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం, ప్రతిపక్షాలు అంగీకరించాయని, ఈ దిశగా పురోగతి ఎందుకు సాధించలేదని కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. పెట్రోలు, పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రాష్ట్రాలు అధిక ఆదాయం పొందుతున్నాయని, అందువల్ల పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడానికి కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయని మంత్రి వివరించారు. అయితే, పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణకు రానున్న కాలంలో కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటుందని, కచ్చితంగా వినియోగదారులకు ఊరట కల్పిస్తామని మంత్రి పూరి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బాగా పెరిగిందని, దీనికితోడు తాజాగా రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధంతో మరింత భారం పడే ప్రమాదం ఏర్పడిరదని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే, భారతీయులు, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా కచ్చితంగా ధరలు తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img